Mahaa Daily Exclusive

  సెప్టెంబర్‌లో ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు….మున్సిపల్ ఎన్నికలతో ప్రక్రియ ప్రారంభానికి ప్రభుత్వ కసరత్తు.

Share

అమరావతి, మహా.
ఆంధ్రప్రదేశ్‌లో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం వేగంగా కసరత్తు ప్రారంభించింది. ప్రాథమిక ప్రణాళిక ప్రకారం సెప్టెంబర్ నెలలో ఎన్నికల ప్రక్రియకు శ్రీకారం చుట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది. ముందుగా మున్సిపల్ ఎన్నికలను నిర్వహించి, అనంతరం జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలు పూర్తి చేసి, చివరి దశలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగంతో పాటు అధికార పార్టీ కూడా ఎన్నికల సన్నాహాలను వేగవంతం చేస్తోంది.

ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం తొలిదశలో రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అనంతరం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించి, చివరిగా గ్రామ పంచాయతీల ఎన్నికలు చేపట్టే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే ముందు అవసరమైన పరిపాలనా, న్యాయపరమైన ప్రక్రియలను పూర్తి చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ కూడా క్షేత్రస్థాయిలో కార్యాచరణను ముమ్మరం చేసింది. ఈ నెల 27వ తేదీ నుంచి 45 రోజుల పాటు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు తమ తమ నియోజకవర్గాల్లో ఇంటింటికీ వెళ్లాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు, ఆరోపణలకు సమాధానం చెప్పాలని ఆయన సూచించినట్లు సమాచారం.

డోర్ టు డోర్ కార్యక్రమాన్ని కేవలం ప్రజా సంపర్క యాత్రగా కాకుండా ఎన్నికల సన్నాహక కార్యక్రమంగా కూడా వినియోగించుకోవాలని పార్టీ నాయకత్వం దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. జోనల్ కోఆర్డినేటర్లు, పార్టీ ముఖ్య నేతలతో జరిగిన సమావేశంలో నియోజకవర్గాల వారీగా ప్రత్యేక కార్యాచరణపై చర్చించినట్లు సమాచారం. గ్రామస్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు పార్టీ శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేయాలని నాయకత్వం సూచించినట్లు తెలుస్తోంది.

ఇదే సమయంలో ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న వివిధ నామినేటెడ్ పదవులను వీలైనంత త్వరగా భర్తీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల నాటికి పార్టీ సంస్థాగత బలాన్ని మరింత పెంచే దిశగా ఈ చర్యలు ఉపయోగపడతాయని నాయకత్వం భావిస్తోంది. ఎన్నికల నిర్వహణపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉన్నప్పటికీ, ప్రభుత్వ యంత్రాంగం, అధికార పార్టీ చేపడుతున్న చర్యలు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి.