సైదాబాద్ పాఠశాల ఘటనపై బీజేపీ ఆగ్రహం.
• సమగ్ర దర్యాప్తుతో పాటు కఠిన చర్యలు తీసుకోవాలని రాంచందర్ రావు డిమాండ్.
హైదరాబాద్, మహా.
హైదరాబాద్‌లోని సైదాబాద్ ప్రాంతంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో విద్యార్థికి మతపరమైన పాఠ్యాంశాన్ని హోమ్‌వర్క్‌గా ఇచ్చారనే ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వివాదం చెలరేగింది. ఈ ఘటనపై భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. విద్యా సంస్థలు విద్యను అందించే కేంద్రాలుగా ఉండాలే తప్ప విద్యార్థులపై ఏ మతానికీ సంబంధించిన అంశాలను బలవంతంగా రుద్దకూడదని ఆయన పేర్కొన్నారు.
ఈ ఘటనకు సంబంధించి విడుదల చేసిన ప్రకటనలో రాంచందర్ రావు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో విద్యారంగంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయని ఆరోపించారు. పాతబస్తీ సైదాబాద్‌లోని సక్సెస్ స్కూల్‌లో రెండో తరగతి చదువుతున్న హిందూ విద్యార్థికి కల్మా, సూరా అల్-ఫాతిహాలను చదివి రావాలని హోమ్‌వర్క్‌గా ఇచ్చినట్లు వెలుగులోకి రావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని అన్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
తమ చిన్నారికి ఇచ్చిన హోమ్‌వర్క్‌ను గమనించి పాఠశాల యాజమాన్యాన్ని ప్రశ్నించిన విద్యార్థి తల్లి ధైర్యాన్ని అభినందిస్తున్నట్లు రాంచందర్ రావు తెలిపారు. ఇంతటి వివాదాస్పద ఘటన వెలుగులోకి వచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ ఇప్పటివరకు పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. కేవలం ఒక ఉపాధ్యాయుడిని విధుల నుంచి తప్పించడం ద్వారా సమస్య పరిష్కారం కాదని, ఈ వ్యవహారంలో పూర్తి బాధ్యత పాఠశాల యాజమాన్యానిదేనని ఆయన అభిప్రాయపడ్డారు.
విద్యార్థుల మత స్వేచ్ఛ, రాజ్యాంగబద్ధ హక్కులను ప్రతి విద్యాసంస్థ గౌరవించాలని రాంచందర్ రావు అన్నారు. విద్యా సంస్థలు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాల్సిందే తప్ప, ఏ మతానికి సంబంధించిన ప్రార్థనలు లేదా ఆచారాలను బలవంతంగా పాటించేలా చేయడం సమంజసం కాదని పేర్కొన్నారు. కొన్ని విద్యాసంస్థల్లో హిందూ విద్యార్థుల మతాచారాలకు సంబంధించి కూడా అభ్యంతరకర పరిస్థితులు ఉన్నాయని ఆరోపిస్తూ, అలాంటి వ్యవహారాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.
ఈ ఘటనపై నిష్పాక్షికంగా, సమగ్రంగా దర్యాప్తు నిర్వహించాలని రాంచందర్ రావు డిమాండ్ చేశారు. సంఘటనకు బాధ్యులుగా తేలిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైతే సంబంధిత పాఠశాల గుర్తింపును కూడా రద్దు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. విద్యా వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని కాపాడేందుకు ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.








