కల్తీ మసాలాలపై హెచ్-ఫాస్ట్ ఉక్కుపాదం.
* 25 టన్నులకుపైగా మసాలాల స్వాధీనం.
హైదరాబాద్, మహా.
నగరంలో కల్తీ మసాలాల తయారీ, విక్రయాలపై హెచ్-ఫాస్ట్ అధికారులు భారీ స్థాయిలో మెరుపుదాడులు నిర్వహించారు. 13 మసాలా వ్యాపార, ప్రాసెసింగ్ కేంద్రాల్లో చేపట్టిన తనిఖీల్లో 25.3 టన్నుల కల్తీ మసాలా దినుసులు, 89.15 టన్నుల ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో మూడు క్రిమినల్ కేసులు నమోదు చేసి ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు.
ప్రజల నుంచి అందిన విశ్వసనీయ సమాచారం ఆధారంగా ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు సజ్జనార్ వెల్లడించారు. మైలార్‌దేవ్‌పల్లి, బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన తనిఖీల్లో వాము, జీలకర్ర, లవంగం, షాజీరా, ఆవాలు తదితర మసాలా దినుసుల్లో భారీగా కల్తీ జరిగినట్లు గుర్తించినట్లు తెలిపారు. మసాలాలకు ఆకర్షణీయమైన రంగు, మెరుపు, బరువు పెంచేందుకు ఫ్యాబ్రిక్ డైలు, సింథటిక్ రంగులు, ఇండస్ట్రియల్ డైలు, టాల్కమ్ పౌడర్, రైస్ బ్రాన్ ఆయిల్ వంటి ప్రమాదకర రసాయనాలను ఉపయోగిస్తున్నట్లు వెల్లడించారు. కొన్ని ఉత్పత్తుల్లో హెయిర్ కలర్‌ను కూడా కలుపుతున్నట్లు గుర్తించినట్లు చెప్పారు.
కల్తీ మసాలాలను నాణ్యమైన ఉత్పత్తులుగా విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారని సీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కెట్లో విక్రయానికి సిద్ధంగా ఉన్న 89 టన్నులకు పైగా ముడి పదార్థాలను కూడా స్వాధీనం చేసుకుని, వాటి నమూనాలను ప్రయోగశాల పరీక్షలకు పంపించినట్లు తెలిపారు. ఆహార భద్రత చట్టం కింద నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
కల్తీ మసాలాల వినియోగం వల్ల కాలేయం, మూత్రపిండాల వ్యాధులు, క్యాన్సర్, అలర్జీలు, జీర్ణకోశ సమస్యలు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని సజ్జనార్ హెచ్చరించారు. ప్రజలు ఆహార పదార్థాల కొనుగోలులో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
హెచ్-ఫాస్ట్ ఏర్పాటు చేసిన 140 రోజుల్లోనే 659 దాడులు నిర్వహించి, 202 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి, మొత్తం 246 టన్నుల కల్తీ ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ వెల్లడించారు. నకిలీ, కల్తీ ఆహార పదార్థాల కేసుల విచారణ కోసం త్వరలో ప్రత్యేక సిట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అనుమానాస్పద ఆహార పదార్థాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు లేదా హెచ్-ఫాస్ట్ హెల్ప్‌లైన్ 87126 61212కు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.







