హైదరాబాద్, మహా.
దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు పెరుగుతున్న వేళ తెలంగాణలో మాత్రం సైబర్ మోసాల నియంత్రణలో గణనీయమైన పురోగతి నమోదైంది. సైబర్ కేసుల నమోదులో దేశంలో ముందంజలో ఉన్నప్పటికీ, మొత్తం సైబర్ నేరాల సంఖ్యలో తెలంగాణ 11వ స్థానంలో ఉండటం రాష్ట్ర పోలీసుల సమర్థ పనితీరుకు నిదర్శనంగా నిలుస్తోంది. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌బీ) వేగవంతమైన చర్యలు, సాంకేతిక పరిజ్ఞాన వినియోగంతో సైబర్ నేరాలను అరికట్టడంలో విశేష ఫలితాలు సాధిస్తున్నట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌కు ఈ ఏడాది జూన్ నాటికి దేశవ్యాప్తంగా 12.71 లక్షలకుపైగా ఫిర్యాదులు అందగా, వాటిలో కేవలం 1.56 శాతం మాత్రమే ఎఫ్‌ఐఆర్‌లుగా నమోదయ్యాయి. అయితే తెలంగాణలో నమోదైన 45,080 ఫిర్యాదుల్లో 7,467 కేసులను ఎఫ్‌ఐఆర్‌లుగా నమోదు చేశారు. అంటే 16.56 శాతం ఫిర్యాదులను కేసులుగా మార్చి దర్యాప్తు ప్రారంభించారు. జాతీయ సగటుతో పోలిస్తే ఇది దాదాపు పది రెట్లు అధికమని అధికారులు తెలిపారు.
గతేడాదితో పోలిస్తే రాష్ట్రంలో సైబర్ నేరాలు, ఆర్థిక నష్టాలు రెండూ తగ్గుముఖం పట్టాయి. 2024లో నమోదైన 93,930 ఫిర్యాదులు 2025లో 91,369కు తగ్గాయి. అలాగే సైబర్ మోసాల వల్ల బాధితులు కోల్పోయిన మొత్తం రూ.1,909 కోట్ల నుంచి రూ.1,524 కోట్లకు తగ్గి దాదాపు 20 శాతం తగ్గుదల నమోదైంది. దేశవ్యాప్తంగా ఆర్థిక నష్టాల పరంగా మహారాష్ట్ర తొలి స్థానంలో ఉండగా, తెలంగాణ ఆరో స్థానంలో నిలిచింది.
ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేసే డిజిటల్ అరెస్ట్ మోసాలను అరికట్టడంలో కూడా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో గణనీయమైన విజయాన్ని నమోదు చేసింది. 2024తో పోలిస్తే 2025లో డిజిటల్ అరెస్ట్ కేసులు 60 శాతం తగ్గగా, ఈ తరహా మోసాల్లో ఆర్థిక నష్టం 47 శాతం మేర తగ్గింది. ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్ కేసుల్లో కూడా తగ్గుదల నమోదైంది. బాధితుల డబ్బు నిందితుల ఖాతాల నుంచి ఉపసంహరించకుండా నిలిపివేసే ‘పుట్ ఆన్ హోల్డ్’ విధానంలోనూ మెరుగైన ఫలితాలు సాధించినట్లు అధికారులు వెల్లడించారు.
మూడేళ్ల క్రితం ఏర్పాటైన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రస్తుతం కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతను వినియోగిస్తూ సైబర్ నేరాల నియంత్రణను మరింత బలోపేతం చేస్తోంది. ఫిర్యాదు అందిన వెంటనే స్పందించడం, అంతర్రాష్ట్ర సైబర్ ముఠాలపై ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించడం, నిందితులను అరెస్టు చేయడం వంటి చర్యలతో సైబర్ నేరగాళ్లలో భయాన్ని కల్పిస్తోంది. అయితే పోలీసుల చర్యలతో పాటు ప్రజలు కూడా ఆన్‌లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉంటేనే సైబర్ నేరాలను పూర్తిస్థాయిలో అరికట్టడం సాధ్యమవుతుందని అధికారులు సూచిస్తున్నారు.







