హైదరాబాద్, మహా.
బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావుపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తీవ్ర ఆరోపణలు చేశారు. హరీశ్ రావు క్షుద్ర పూజలు నిర్వహించారని, ఇందుకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన, అరుంధతి సినిమాలో చూపించిన తరహాలో హరీశ్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారని ఆరోపించారు.
హరీశ్ రావు ఈ ఏడాది మార్చి 2న తమిళనాడులోని తిరుచ్చికి, జూన్ 1న కర్ణాటకలోని శివమొగ్గకు వెళ్లారని పేర్కొన్న మహేశ్ కుమార్ గౌడ్, ఆ తేదీల్లో ఆయన ఎక్కడ ఉన్నారో ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. తిరుపతికి వెళ్లిన సందర్భంగా మీడియాతో మాట్లాడిన హరీశ్ రావు, అఘోరీ ఆలయానికి వెళ్లిన విషయాన్ని ఎందుకు గోప్యంగా ఉంచారంటూ ప్రశ్నించారు.
తెలంగాణలో వర్షాలు పడకూడదని, రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఏర్పడాలని కోరుతూ హరీశ్ రావు క్షుద్ర పూజలు చేశారని మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ప్రజల సంక్షేమం కోసం దేవుడిని ప్రార్థించడం సహజమని, కానీ రాజకీయ స్వార్థం కోసం ప్రజలకు కీడు జరగాలని కోరుతూ పూజలు చేయడం సమంజసం కాదని విమర్శించారు. ఈ ఆరోపణలకు సంబంధించిన నిజాలను బయటపెట్టినందుకే అద్దంకి దయాకర్, సామ రామ్మోహన్లకు లీగల్ నోటీసులు పంపించారని, అయితే అలాంటి నోటీసులకు తాము భయపడబోమని స్పష్టం చేశారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా గతంలో అఘోరాలతో క్షుద్ర పూజలు చేశారనే ప్రచారం జరిగిందని మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ఇప్పుడు హరీశ్ రావుపై వస్తున్న ఆరోపణలతో ఆ ప్రచారానికి కూడా బలం చేకూరుతోందని అన్నారు. యాదగిరిగుట్టకు వెళ్లి చేసిన పూజల ఉద్దేశం ఏమిటో ప్రజలకు వివరించాలని హరీశ్ రావును డిమాండ్ చేశారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మంత్రాలు, తంత్రాల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించే ఘటనలు గతంలో జరిగాయని ఆయన వ్యాఖ్యానించారు.
అయితే టీపీసీసీ అధ్యక్షుడు చేసిన ఈ ఆరోపణలపై బీఆర్ఎస్ లేదా హరీశ్ రావు నుంచి ఇప్పటివరకు అధికారిక స్పందన వెలువడలేదు. ఈ వ్యవహారంపై రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది.







