టీ-ఫైబర్‌కే ప్రభుత్వ శాఖలు.
• సెప్టెంబర్ 1 నుంచి ప్రైవేట్ నెట్‌కు నో.
• ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు.
హైదరాబాద్, మహా.
తెలంగాణలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సెప్టెంబర్ 1 నుంచి టీ-ఫైబర్ ద్వారానే ఇంటర్నెట్ సేవలు వినియోగించాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో టీ-ఫైబర్ సేవల విస్తరణపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో ఆయన అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. నిర్ణీత గడువులోగా ప్రతి ప్రభుత్వ కార్యాలయానికి టీ-ఫైబర్ కనెక్టివిటీ అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
సెప్టెంబర్ 1 తర్వాత ఏ ప్రభుత్వ శాఖ కూడా ప్రైవేట్ ఇంటర్నెట్ సేవలను వినియోగిస్తూ బిల్లులు చెల్లించవద్దని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వ నిధుల ఆదాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఏకీకృత డిజిటల్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వ శాఖలు ఉపయోగిస్తున్న టీ-స్వాన్ నెట్‌వర్క్‌ను వచ్చే నెల రోజుల్లో పూర్తిగా టీ-ఫైబర్‌కు అనుసంధానం చేయాలని సంబంధిత అధికారులకు గడువు విధించారు.
ఈ ప్రక్రియలో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించిన మంత్రి, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి చెందుతున్న ఫ్యూచర్ సిటీకి అత్యాధునిక టీ-ఫైబర్ కనెక్టివిటీ కల్పించేలా ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. డిజిటల్ మౌలిక వసతుల అభివృద్ధికి టీ-ఫైబర్ కీలక వేదికగా మారాలని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘ఇంటింటికీ ఇంటర్నెట్’ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేసి, గ్రామీణ ప్రాంతాల వరకు నాణ్యమైన బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని శ్రీధర్ బాబు ఆదేశించారు. నిర్దేశించిన గడువులోగా అన్ని లక్ష్యాలను పూర్తి చేసి తెలంగాణను దేశంలోనే అత్యుత్తమ డిజిటల్ కనెక్టివిటీ కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు.







