- కారేపల్లి కాలేజీని కంచే చేను మేస్తుంది….
- రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన కాలేజీ… గతవైభవం కోల్పోతోంది..
- చరిత్ర కలిగిన కళాశాల పై రకరకాల చర్చలు
- కారు ట్రయల్ తో రచ్చ కెక్కిన కారేపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీ
కారేపల్లి, మహ:పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా నిర్వాహకుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది.. లక్షలాది రూపాయలు వేతనాలు ఇచ్చి ఉన్నతమైన అధికారాలను కట్టబెడుతున్నా కొందరు అధికారులు వ్యక్తిగత ఇగోలతో వ్యవస్థలనే నాశనం చేస్తున్నారు. కారేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల పరిస్థితి నిర్వాహకుల సమన్వయ లోపంతో లక్ష్యం నీరుగారి పేద విద్యార్థుల పాలిట శాపంగా మారుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడ ప్రిన్సిపల్ తీరు కంచే చేను మేసిన చందంగా ఉంది..గతంలో కారేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొంది వందలాది మంది ఉత్తమ విద్యార్థులను తీర్చి దిద్దిన కాలేజీగా అనేక ప్రశంసలు పొందింది. శర్మ ప్రిన్సిపల్ గా చేసిన హయాంలో కళాశాల క్రమశిక్షణలో ఉత్తమ ఫలితాల సాధనలో అనేక అవార్డులు పొంది ప్రైవేటు కళాశాలలు కూడా పోటీ తట్టుకోలేక పెట్టిన రెండు ప్రైవేటు కళాశాలలు మూసివేసిన పరిస్థితి.. గతంలో అంతటి వైభవం కలిగిన కాలేజీ ఇది
*ముగ్గురికి ప్రాధాన్యతనిస్తూ….
పెద్దన్న పాత్ర పోషించాల్సిన ప్రిన్సిపల్ స్టాఫ్ లో ఓ ముగ్గురు లెక్చరర్లను దగ్గర పెట్టుకొని మరికొందరని దూరంగా ఉంచడం ఇక్కడ గ్రూపులను పెంచి పోషించినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ కళాశాలలో గతంలో పనిచేసిన ప్రిన్సిపల్స్ అంతా సమర్థవంతంగా నాయకత్వ లక్షణాలతో పనిచేసి కళాశాలను నడిపిన వారే .. సమస్య వచ్చినా సున్నితంగా పరిష్కరించిన వారే.. ప్రస్తుతం సమస్యల సృష్టికర్తగా కూడా నిర్వాహకులే కావటం విచారకరం.. కళాశాల బోరు పాడవుతే వెంటనే బాగు చేయించాలి లేదా గ్రామపంచాయతీని ఆశ్రయించి ట్యాంకర్ నీటినైనా తెప్పించాలి కానీ ఇక్కడ వాటిపై దృష్టి సారించకుండా బాలికలు టాయిలెట్స్ వాడకుండా బయటకే వెళ్లండని చెప్పిన సందర్భాలు విచారకరమ్. స్టాఫ్ అందరినీ సమన్వయం చేసుకుని ఉత్తమ ఫలితాల సాధనకు కృషిచేయాల్సిన ప్రిన్సిపల్ ముగ్గురు లెక్చరర్లను దగ్గరపెట్టుకుని వారు చెప్పినట్లుగా వ్యవహరిస్తూ కాలేజీలో అనేక ఆరోపణలకు అవకాశం కల్పిస్తున్నారు.
*హైకోర్టు చీఫ్ జస్టిస్ కు
విన్నవించిన చరిత్ర…
టాయిలెట్స్ సరిగ్గా లేకపోవడంతో గతంలో బాలికలు మంచినీళ్లు తాగకుండా కళాశాల సమయం వరకు గడిపారు.. మంచినీళ్లు తాగితే టాయిలెట్స్ కి వెళ్లాల్సి వస్తుందని భావించి మంచినీళ్లు తాగకుండా అనారోగ్య పాలైన సందర్భాలు గత 13 ఏళ్ల క్రితం ఈ కళాశాలలో చోటుచేసుకుంది. అప్పటి పరిస్థితిని ఆ బాలికలంతా అప్పటి లెక్చరర్ వాసిరెడ్డి శ్రీనివాస్ సూచనలతో హైకోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ రాశారు. బాలికల పరిస్థితిపై చలించిన చీఫ్ జస్టిస్ ఆ లేఖను సుమోటోగా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని కళాశాలలో సరిపడా టాయిలెట్స్ ఉండాలని కోర్టు ఆదేశించింది. ఉన్నత విద్య ప్రిన్సిపల్ సెక్రెటరీ స్వయంగా కారేపల్లి కళాశాలను సందర్శించి కారేపల్లి కళాశాలతో పాటు రాష్ట్రంలో అన్ని కళాశాలకు సరిపడా టాయిలెట్స్ నిర్మాణానికి నిధులను మంజూరు చేయించారు. అంతటి చరిత్ర కలిగిన కళాశాల ఇది
అంతా ప్రిన్సిపాల్ ఇష్టారాజ్యం…..
కారేపల్లి జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినబడుతున్నాయి.ఫస్ట్ ఇయర్ హెచ్ఈసీ, బైపీసీ, ఎంపీసీ కలిపి 111 మంది విద్యార్థులను ఒకే గదిలో కూర్చోబెట్టి ఇంగ్లీష్ క్లాస్ బోధించడం , వొకేషనల్ 90 మందిని ఒకే గదిలో కూర్చోబెట్టి ఇంగ్లీష్ బోధించడం విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఒక్కో లెక్చరర్ కి ఎన్ని పీరియడ్స్ ఉండాలనే షెడ్యూల్ కూడా ఇక్కడ వివాదాస్పదం కావడం విచారకరం. ఇంగ్లీష్ స్టడీ అవర్స్ వారానికి ఉండాల్సినవి పాటిస్తున్నారా అనేది ప్రశ్నార్థకమైంది. ఎంపీ హెచ్ డబ్ల్యూ కు ల్యాబ్ అటెండర్ క్లాసులు బోధించడం కూడా విమర్శలకు దారితీస్తుంది. విద్యార్థులతో అటెండర్ డ్యూటీస్ చేయించడం, మానసికంగా ఇబ్బందిపడేవిధంగా వ్యవహరించడం బాధాకరం.. మార్నింగ్ ప్రేయర్ టైమ్ అందరూ హాజరుకాకపోవడం, లెక్చరర్లు కూడా క్లాసులకు సమయపాలన పాటించడం లేదనే ఆరోపణలు ఉన్నాయ
కారు ట్రయల్ తో రచ్చ…
ఇటీవల కళాశాల ఆవరణలో ఓ లెక్చరర్ డెమో కోసం వచ్చిన టయోటా కంపెనీ కొత్త కారు ట్రయల్ వేసే టపుడు కంట్రోల్ కాక కారు చెట్టుకు తగిలి భారీగా డ్యామేజ్ అయింది. పెద్ద శబ్దం రావడం ఆ సమయంలో ఇద్దరు విద్యార్ధులు కూడా పక్కకు తప్పుకోవడం ఎటువంటి ప్రమాదం జరగకుండా బయటపడ్డారు.
.. ఈ సంఘటన పై డీఐ ఈవో ను విలేకరులు అడగగా ఎవరికీ ఏం కాలేదు కదా అని సంఘటనను చాలా తేలికగా తీసిపారేసిన విషయం మరింత వివాదాస్పదమైంది. ఈ అధికారి తీరు కంచే చేను మేసిన చందంగా ఉంది. కళాశాలలను కట్టుదిట్టంగా నడిచేవిధంగా చర్యలు చేపట్టాల్సిన అధికారే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ప్రిన్సిపల్ ను వారు చేసిన పొరపాట్లను సమర్థించడం అనేక విమర్శలకు దారితీసింది. గతంలో ఎంతో వైభవంగా నడిచిన ప్రభుత్వ జూనియర్ కళాశాల నేడు నిర్వాహకుల ఒంటెద్దుపోకడలతో మసకబారిపోతుందనే ఆరోపణలకు జిల్లా అధికారులు చెక్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది..








