అమరావతి…
ఉమ్మడి రాష్ట్రానికి, విభజిత రాష్ట్రానికి పలుసార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన ప్రస్తుత సిఎం చంద్రబాబునాయుడు పరిపాలనలో ఎందుకో తడబడుతున్నారు. అపారఅనుభవం ఉన్న ఆయన పాలనలో తనదైన మార్కును చూపించలేకపోతున్నారు. ప్రభుత్వ పరంగా చేయాల్సిన పనులు చేస్తున్నా..ప్రభుత్వానికి రావాల్సిన మైలేజ్ రావడం లేదనే భావన వ్యక్తం అవుతోంది. ఒకవైపు రాష్ట్రానికి వరదలా పెట్టుబడులు తీసుకువస్తున్నా, సంక్షేమ పాలన అందిస్తున్నా..ఎక్కడో ఏదో లోపం అన్నట్లు ప్రతివాళ్లూ చంద్రబాబు పాలనపై పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు, పార్టీ సానుభూతిపరులు ఎవరూ ఈ పాలనపై సంతృప్తికరంగా లేరు. ముఖ్యమంత్రి ఆదేశించినా ఒక్క నిర్ణయం కూడా సకాలంలో అమలు కావడం లేదని, ఎక్కే గడపా, దిగే గడపా అన్నట్లు ఉందనే విమర్శలు అధికార, పార్టీ, రాజకీయ, పాత్రికేయవర్గాల్లో వ్యక్తం అవుతోంది. ఎందుకు ఇలా జరుగుతుందనే దానిపై రకరకాలైన విశ్లేషణలు వెలువడుతున్నాయి. మిగతా సంగతి ఎలా ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన కార్యాలయాన్ని సరిగా ఏర్పాటు చేసుకోలేదనే విమర్శలు, ఆరోపణలు పార్టీ, రాజకీయ,
సచివాలయ వర్గాల నుంచి వ్యక్తం అవుతున్నాయి.2024లో కూటమి ఆఖండ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన తరువాత రవిచంద్ర అనే సీనియర్ ఐఏఎస్‌ను ఆయన తన కార్యాలయ ఇన్‌ఛార్జిగా నియమించుకున్నారు. రవిచంద్ర నిజాయితీపరుడు, నెమ్మదస్తుడు, నిగర్వి, పాలనానుభవం ఉన్న వ్యక్తి కావడంతో..మొదట్లో పాలన సులువుగానే జరిగింది. సిఎంఓలో రవిచంద్ర నియామకం సరైనదేనని, బీసీ వర్గానికి చెందిన ఆయనకు సముచిత స్థానం కల్పించారనే భావన వ్యక్తం అయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా ఆయన పనిచేసుకుంటూ వెళ్లారు. అయితే..ఆయనపై కొన్నిపత్రికలు రాసిన వార్తలతో ఆయన మనస్థాపం చెందిన అక్కడి నుంచి తిరుమల తిరుపతిదేవస్థానానికి బదిలీ చేయించుకుని వెళ్లిపోయారు. ఆయన వెళ్లిపోయిన తరువాత సిఎంఓ పరిస్థితి మరింత దిగజారింది. అక్కడ ఏమి జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు.ముఖ్యంగా సిఎంఓలో ఆధిపత్య ధోరణి సిఎంఓ పరువు తీస్తోంది. ఇద్దరు అధికారుల మధ్య జరుగుతున్న గొడవలను చూసి ఇది ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కార్యాలయమేనా..అనే ప్రశ్నలు పలువురి వద్ద నుంచి వస్తున్నాయి. వివాదాస్పద అధికారులకు
పోస్టింగ్‌లు ఇప్పించే విషయంలో కానీ, సిఎం అపాయింట్‌మెంట్‌ల విషయంలో కానీ, మంత్రులు, ఎమ్మెల్యేలు తీసుకువచ్చే విజ్ఙప్తులను పరిష్కరించే విషయంలో కానీ సదరు సిఎంఓ అధికారులు సరిగా స్పందించడం లేదని, మొక్కుబడిగా పనిచేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఎవరూ ఇది తమ బాధ్యత అని, ముఖ్యమంత్రి తమను నమ్మి..బాధ్యతలు అప్పగించారని, ఆయన నమ్మకాన్ని నిలబెడదామనే ఆలోచన ఎవరికీ లేదు. ఎవరికి వారు..ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు, ఆరోపణలు జోరుగా వస్తున్నాయి. రవిచంద్ర తరువాత సిఎంఓ ఇన్‌ఛార్జిగా నియమితులైన విజయానంద్ కూడా అక్కడ పరిస్థితిని సరిదిద్దలేకపోయారనే మాట సర్వత్రా వినిపిస్తోంది. అంతే కాక ఆయన అనారోగ్యానికి గురికావడంతో..ఇప్పుడు ఇద్దరు అధికారులే సిఎంఓ అంతా పెత్తనం చేస్తున్నారని, వారిలో వారే..పోటీకి దిగుతున్నారని, ఒకరిపై ఒకరు ఆధిపత్యం సాధించేందుకు యత్నిస్తూ..పనిచేసే వాతావరణాన్నిచెడగొడుతున్నారనే భావన వ్యక్తం అవుతోంది. మొత్తం మీద..సిఎంఓలో నెలకొన్న ఆధిపత్య పోరు..ప్రభుత్వ ప్రతిష్టను మసకబారుస్తుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపై చర్యలు తీసుకుని..సిఎంఓను దారిని పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.








