Mahaa Daily Exclusive

  కన్నబిడ్డను కోల్పోవడం తల్లిదండ్రులకు తీరని వేదన: హోంమంత్రి వంగలపూడి అనిత..! డీసీపీ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను స్వయంగా పరామర్శించిన వంగలపూడి అనిత..

Share

•విజయవాడ ట్రాఫిక్ డీసీపీ షిరీన్ బేగం కుమార్తె అఫీఫా అకాల మరణం తీవ్రంగా కలచివేసింది

•ట్రాఫిక్ డీసీపీ షిరీన్ బేగంను ఓదార్చి ధైర్యం చెప్పిన హోంమంత్రి

•డీసీపీ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను స్వయంగా పరామర్శించిన వంగలపూడి అనిత

విజయవాడ, మహా

గుంటూరు జిల్లా ఏటుకూరు బైపాస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయవాడ ట్రాఫిక్ డీసీపీ షిరీన్ బేగం కుమార్తె అఫీఫా (24) అకాల మరణం చెందడం అత్యంత విషాదకరమని రాష్ట్ర హోంమంత్రి శ్రీమతి వంగలపూడి అనిత అన్నారు.

విజయవాడలోని ట్రాఫిక్ డీసీపీ షిరీన్ బేగం నివాసానికి వెళ్లిన హోంమంత్రి అనిత ఆమెను, కుటుంబ సభ్యులను స్వయంగా పరామర్శించారు. కన్నబిడ్డను కోల్పోయి తీవ్ర దుఃఖంలో ఉన్న షిరీన్ బేగంను ఓదార్చి ధైర్యం చెప్పారు.

చీరాల బీచ్‌కు వెళ్తున్న సమయంలో ఏటుకూరు బైపాస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో అఫీఫా ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కలచివేసిందని హోంమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. 24 ఏళ్ల చిన్న వయసులోనే నిండు జీవితం ముగియడం అత్యంత బాధాకరమన్నారు. కన్నబిడ్డను కోల్పోవడం ఏ తల్లిదండ్రులకైనా తీరని వేదనని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ప్రమాదం జరిగిన తీరును కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్న హోంమంత్రి, ప్రమాదంలో గాయపడిన వారి వివరాలపై కూడా ఆరా తీశారు. ఈ విషాద సమయంలో షిరీన్ బేగం, ఆమె కుటుంబ సభ్యులు మనోధైర్యంతో ఉండాలని కోరారు.

అఫీఫా అకాల మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసిన హోంమంత్రి వంగలపూడి అనిత, షిరీన్ బేగం కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ అపారమైన దుఃఖాన్ని తట్టుకునే ధైర్యం, మనోస్థైర్యాన్ని భగవంతుడు కుటుంబ సభ్యులకు ప్రసాదించాలని ఆకాంక్షించారు.

Latest