Mahaa Daily Exclusive

  గోదావరి జలాలను గరిష్ఠంగా వినియోగించుకోవాలి..: సీఎం రేవంత్‌రెడ్డి

Share

గోదావరి జలాలను గరిష్ఠంగా వినియోగించుకోవాలి.
• ఎల్లంపల్లి, దేవాదుల, సీతారామ నుంచి సాధ్యమైనంత మేర ఎత్తిపోతలు చేపట్టాలి.
• సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌, మహా.

గోదావరి జలాలను గరిష్ఠ స్థాయిలో వినియోగించుకుని రాష్ట్రంలోని సాగు భూములకు సాధ్యమైనంత ఎక్కువగా నీరందించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎల్లంపల్లి, దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల నుంచి అందుబాటులో ఉన్న నీటిని పూర్తిస్థాయిలో ఎత్తిపోసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. చిన్నచిన్న సాంకేతిక సమస్యలు, పరిపాలనా ఇబ్బందుల కారణంగా నీటి ఎత్తిపోతలకు ఆటంకం కలగకుండా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు.

నీటిపారుదల శాఖపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు ఉన్నతాధికారులతో కలిసి ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టుల నీటి లభ్యత, ఎత్తిపోతల సామర్థ్యం, పెండింగ్‌ పనులు, ముంపు గ్రామాలు, పరిహారం, పునరావాసం తదితర అంశాలపై సమావేశంలో సమగ్రంగా చర్చించారు.

దేవాదుల ఎత్తిపోతల పథకం నుంచి గతంలో ఎన్నడూ లేనివిధంగా తొమ్మిది పంపులతో నీటిని ఎత్తిపోస్తున్నట్లు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమావేశంలో వివరించారు. దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల నుంచి మరింత ఎక్కువ నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నందున అక్కడ ఉన్న చిన్నచిన్న సమస్యలను వెంటనే గుర్తించి పరిష్కరించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఎత్తిపోతల వ్యవస్థలు పూర్తిస్థాయి సామర్థ్యంతో పనిచేసేలా క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు.

మరోవైపు పలు ప్రాజెక్టుల పరిధిలో ఒకట్రెండు గ్రామాలు, కొద్దిపాటి వ్యవసాయ భూములకు సంబంధించిన పరిహారం చెల్లింపులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని సమావేశంలో అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ పెండింగ్‌ పరిహారాన్ని త్వరితగతిన చెల్లించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని రేవంత్‌రెడ్డి ఆదేశించారు. నీటిపారుదల, రెవెన్యూ శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ముంపు గ్రామాలు, భూముల పరిహారం, పునరావాసానికి సంబంధించిన వాస్తవ పరిస్థితులపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని సూచించారు.

ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయినప్పటికీ పరిహారం లేదా పునరావాసానికి సంబంధించిన చిన్నచిన్న అంశాలు పెండింగ్‌లో ఉండటం వల్ల నీటి నిల్వకు ఇబ్బందులు ఏర్పడకూడదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తక్షణ ప్రభావం పడే గ్రామాలకు ముందుగా పరిహారం చెల్లించాలని ఆదేశించారు. ఈ పనులను వేగంగా పూర్తి చేస్తే బస్వాపూర్‌, గౌరవెల్లి ప్రాజెక్టుల్లో నీటిని నింపే అవకాశం ఉంటుందని తెలిపారు. అవసరమైన నిధులు, పరిపాలనా అనుమతులు, క్షేత్రస్థాయి సమన్వయంపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

గట్టు, గూడెందొడ్డి ఎత్తిపోతల పథకాల సామర్థ్యాన్ని పెంచే అంశంపైనా ముఖ్యమంత్రి సమీక్షించారు. ప్రస్తుత నీటి లభ్యత, భవిష్యత్‌ అవసరాలు, ఎత్తిపోతల సామర్థ్యం, విద్యుత్‌ వినియోగం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని సమగ్ర అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. గూడెందొడ్డి పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టుకు సంబంధించి కన్సల్టెంట్‌ను నియమించి తదుపరి కార్యాచరణ రూపొందించాలని సూచించారు.

ఇదిలా ఉండగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీల భద్రత అంశంపైనా సమావేశంలో చర్చ జరిగింది. జాతీయ డ్యామ్‌ భద్రత సంస్థ సూచనల మేరకే ఈ మూడు బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయడం లేదని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రికి వివరించారు. మేడిగడ్డతో పాటు సుందిళ్ల బ్యారేజీలోనూ పలు లోపాలు ఉన్నట్లు పరిశీలనల్లో తేలిందని తెలిపారు.

బ్యారేజీల భద్రత విషయంలో జాతీయ డ్యామ్‌ భద్రత సంస్థ సూచనలను తప్పనిసరిగా పాటించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలకు సంబంధించి సాంకేతిక అంశాలపై జాతీయ డ్యామ్‌ భద్రత సంస్థతో నిరంతరం సంప్రదింపులు జరపాలని సూచించారు. నిపుణుల సూచనలకు అనుగుణంగానే నీటి నిల్వ, నిర్వహణ, పునరుద్ధరణకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో గోదావరి జలాల లభ్యతను పూర్తిస్థాయిలో వినియోగించుకోవడంతో పాటు ప్రాజెక్టుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఒకవైపు అందుబాటులో ఉన్న నీటిని ఎత్తిపోసి సాగుకు ఉపయోగించుకోవడం, మరోవైపు ముంపు గ్రామాలు, పరిహారం, పునరావాస సమస్యలను పరిష్కరించడం, భద్రతాపరమైన లోపాలున్న ప్రాజెక్టుల్లో నిపుణుల సూచనల మేరకు ముందుకు సాగడం ద్వారా నీటిపారుదల రంగాన్ని సమర్థంగా నిర్వహించాలని సూచించారు.

Latest