•జిల్లా కేంద్రాల్లో శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలి.
•సదరన్ కమాండ్‌తో సీఎం రేవంత్‌రెడ్డి కీలక చర్చ.
హైదరాబాద్, మహా.
భారత సైన్యంలో తెలంగాణ యువతకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఆర్మీ కలిసి పనిచేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి సూచించారు. దేశవ్యాప్తంగా నిర్వహించే వివిధ సైనిక నియామకాల్లో తెలంగాణ యువత పెద్ద సంఖ్యలో పాల్గొనేలా ముందస్తు శిక్షణ అందించేందుకు జిల్లా కేంద్రాల్లో శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. దీనిపై ఆర్మీ సదరన్ కమాండ్ అధికారులు సానుకూలంగా స్పందించారు.
ఆర్మీ సదరన్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ రాజేష్ పుష్కర్ పలువురు సైనిక ఉన్నతాధికారులతో కలిసి ఎంసీఆర్ హెచ్ఆర్డీలోని బోధి పెవిలియన్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. తెలంగాణ యువతకు సైనిక నియామకాల్లో అవకాశాలు పెంచడం, విపత్తుల సమయంలో సైన్యం అందించే సేవలు, హైదరాబాద్ నగర అభివృద్ధి తదితర అంశాలపై ఇరువర్గాలు చర్చించాయి.
సైన్యంలో చేరాలనే ఆసక్తి ఉన్న తెలంగాణ యువతకు సరైన మార్గదర్శకత్వం, శారీరక దృఢత్వ శిక్షణ, నియామక పరీక్షలకు అవసరమైన ముందస్తు సిద్ధత అందిస్తే భారీ సంఖ్యలో యువతకు ప్రయోజనం కలుగుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఇందుకోసం అనువైన జిల్లా కేంద్రాలను గుర్తించి అక్కడ ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల నుంచి సైన్యంలో చేరాలనుకునే యువతకు ఈ శిక్షణా కేంద్రాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు.
ముఖ్యమంత్రి ప్రతిపాదనపై లెఫ్టినెంట్ జనరల్ రాజేష్ పుష్కర్ సానుకూలంగా స్పందించారు. దేశవ్యాప్తంగా నిర్వహించే వివిధ సైనిక నియామకాలకు ముందుగానే తెలంగాణలోని ఎంపిక చేసిన జిల్లా కేంద్రాల్లో యువతకు శిక్షణ అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆర్మీ నియామకాలకు అవసరమైన అర్హతలు, శారీరక ప్రమాణాలు, పరీక్షా విధానం తదితర అంశాలపై యువతకు ముందస్తుగా అవగాహన కల్పించే అవకాశం ఏర్పడనుంది.
తెలంగాణలోని మారుమూల ప్రాంతాల యువతకు కూడా సైన్యంలో చేరే అవకాశం సమానంగా అందేలా ఈ కార్యక్రమాన్ని విస్తరించాల్సిన అవసరం ఉందని సమావేశంలో అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. జిల్లా స్థాయిలో శిక్షణ అందుబాటులోకి వస్తే ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన యువత కూడా ఖరీదైన ప్రైవేట్ శిక్షణపై ఆధారపడకుండా సైనిక నియామకాలకు సిద్ధమయ్యే అవకాశం ఉంటుంది.
విపత్తుల సమయంలో ఆర్మీ సేవలకు సీఎం ప్రశంసలు
దేశంలో ప్రకృతి వైపరీత్యాలు, విపత్తులు సంభవించిన ప్రతిసారీ భారత సైన్యం అందిస్తున్న సేవలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభినందించారు. వరదలు, భారీ వర్షాలు వంటి విపత్తుల సమయంలో ప్రజలను రక్షించడం, సురక్షిత ప్రాంతాలకు తరలించడం, సహాయక చర్యల్లో సైన్యం కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు.
తెలంగాణలోనూ వరదలు, భారీ వర్షాల సమయంలో సైన్యం మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి కోరారు. ముఖ్యంగా ప్రమాదకర పరిస్థితుల్లో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, అత్యవసర సహాయక చర్యలు చేపట్టడం, పునరావాస కార్యక్రమాల్లో ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించడం వంటి అంశాల్లో సైన్యం సహకారం ఎంతో కీలకమని తెలిపారు.
తెలంగాణలో విపత్తులు సంభవించినప్పుడు ప్రత్యేకంగా స్పందించేలా స్థానిక సైనిక అధికారులకు సూచనలు చేస్తానని లెఫ్టినెంట్ జనరల్ రాజేష్ పుష్కర్ హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ విపత్తు నిర్వహణ యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన సందర్భాల్లో వేగంగా స్పందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
మూసీ పునరుజ్జీవనానికి ఆర్మీ అధికారి ప్రశంసలు
హైదరాబాద్ నగర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న మూసీ పునరుజ్జీవన కార్యక్రమంపైనా సమావేశంలో చర్చ జరిగింది. కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు చారిత్రక హైదరాబాద్ నగరానికి పూర్వ వైభవాన్ని తీసుకురావాలనే లక్ష్యంతో మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టును చేపట్టడంపై లెఫ్టినెంట్ జనరల్ రాజేష్ పుష్కర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించారు.
హైదరాబాద్ నగరాన్ని కాపాడుకోవాలంటే మూసీ నదిని ప్రక్షాళన చేయడం, దాని పరిసరాలను పునరుద్ధరించడం అవసరమని ఆయన పేర్కొన్నారు. నగర జీవన ప్రమాణాలు మెరుగుపడటంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా మూసీ పునరుజ్జీవనం దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు.
సైనిక నియామకాల్లో యువతకు అవకాశాలు కల్పించడం, విపత్తుల సమయంలో పరస్పర సహకారం పెంచడం, నగర అభివృద్ధి అంశాలపై కలిసి పనిచేయడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం–భారత సైన్యం మధ్య సమన్వయం మరింత బలోపేతం కానుంది. ఈ సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మేజర్ జనరల్ ఎన్. శ్రీనివాస్‌రావుతో పాటు పలువురు ఆర్మీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.








