• హక్కులతోపాటు బాధ్యతలను గుర్తుంచుకోవాలి.
• యువత తమ ప్రతిభతో దేశ ప్రగతికి బాటలు వేయాలి.
• రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఢిల్లీ, మహా.
దేశాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని సాధించేందుకు దేశ ప్రజలంతా ఐక్యంగా పనిచేయాలని ఆకాంక్షించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతినుద్దేశించి ఆమె సందేశమిచ్చారు.
దేశ ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను గుర్తుంచుకోవడంతోపాటు, అదే రాజ్యాంగం నిర్దేశించిన బాధ్యతలను కూడా ప్రతి ఒక్కరూ నెరవేర్చాలని రాష్ట్రపతి సూచించారు. దేశ ప్రగతి కేవలం ప్రభుత్వాల కృషితోనే సాధ్యం కాదని, ప్రతి పౌరుడి భాగస్వామ్యంతోనే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
యువత దేశ భవిష్యత్తుకు ప్రధాన శక్తి అని ద్రౌపది ముర్ము అన్నారు. యువత తమలోని ప్రతిభను, నైపుణ్యాలను పూర్తిస్థాయిలో వినియోగించుకుని వ్యక్తిగత స్వప్నాలను సాకారం చేసుకోవడంతోపాటు దేశ అభివృద్ధికి కూడా తోడ్పడాలని పిలుపునిచ్చారు. కొత్త ఆలోచనలు, సృజనాత్మకత, సాంకేతిక నైపుణ్యాలతో భారతదేశాన్ని మరింత శక్తిమంతంగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు.
భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రజలకు స్ఫూర్తిని నింపిన ‘వందే మాతరం’ గేయాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని రాష్ట్రపతి కోరారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవడం ద్వారా దేశభక్తి భావనను మరింత బలోపేతం చేసుకోవాలని సూచించారు.
ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలస్తంభాలైన న్యాయవ్యవస్థ, చట్టసభలను గౌరవించడం ప్రతి పౌరుడి బాధ్యత అని ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. రాజ్యాంగ విలువలను పరిరక్షిస్తూ ప్రజాస్వామ్య స్ఫూర్తిని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
దేశ స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవడం మాత్రమే కాకుండా, దాని ఫలాలను ప్రతి పౌరుడికి అందేలా సమాన అవకాశాలతో కూడిన అభివృద్ధిని సాధించడం కూడా మన ముందున్న లక్ష్యమని రాష్ట్రపతి సందేశం స్పష్టం చేసింది. స్వాతంత్ర్య స్ఫూర్తి, రాజ్యాంగ విలువలు, యువశక్తి, సమష్టి కృషితో వికసిత్ భారత్ నిర్మాణం సాధ్యమవుతుందని ఆమె ఆకాంక్షించారు.







