Mahaa Daily Exclusive

  పంద్రాగస్టు వేళ..! రాష్ట్ర పోలీసులకు కేంద్ర పతకాల పంట..

Share

  • పంద్రాగస్టు వేళ…
  • రాష్ట్ర పోలీసులకు కేంద్ర పతకాల పంట
  • ఇద్దరికి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు
  • గ్రేహౌండ్స్ సిబ్బందికి శౌర్య పతకాలు
  • వివిధ విభాగాల అధికారులకు ప్రశంసనీయ సేవా పతకాలు

హైదరాబాద్, మహా : స్వాతంత్ర్య దినోత్సవ శుభసందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన పలువురు పోలీసు అధికారులు , సిబ్బందిని కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పతకాలతో గౌరవించింది. విధుల్లో చూపిన అసమాన ధైర్యసాహసాలు, విశిష్ట సేవలు , నిబద్ధతకు గుర్తింపుగా ‘రాష్ట్రపతి విశిష్ట సేవా పతకం’ (పీపీడీఎంఎస్), ‘శౌర్య పతకం’ (పీఎంజీ) , ‘ప్రశంసనీయ సేవా పతకాలను’ (పీఎంఎంఎస్) ప్రకటించింది. ప్రజాసేవలోనూ, శాంతిభద్రతల పరిరక్షణలోనూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు ఈ పురస్కారాలు లభించాయి.

విశిష్ట సేవా పతకాలు , శౌర్య పురస్కారాల గ్రహీతలు

అత్యున్నతమైన రాష్ట్రపతి విశిష్ట సేవా పతకానికి హైదరాబాద్ ఇంటెలిజెన్స్ ఎస్పీ ఆర్. జగదీశ్వర్ రెడ్డి, సికింద్రాబాద్ జోన్ అదనపు డీసీపీ నర్సయ్య జోగుల ఎంపికయ్యారు. అలాగే ప్రాణాలకు తెగించి పోరాడే వీరోచిత ప్రతిభ కనబరిచినందుకు గాను గ్రేహౌండ్స్ రంగానికి చెందిన బి. సత్యరావు (పిసి), కె. సందీప్ కుమార్ (పిసి), జె. వంశీకృష్ణ (పిసి)లు అత్యంత ప్రతిష్టాత్మకమైన శౌర్య పతకాలను దక్కించుకున్నారు.

ప్రశంసనీయ సేవా పతకాల (మరిటోరియస్ సర్వీస్) విజేతలు

రాష్ట్రవ్యాప్తంగా వివిధ విభాగాల్లో ఉత్తమ సేవలు అందించిన పలువురు అధికారులకు ప్రశంసనీయ సేవా పతకాలు లభించాయి. వీరిలో కరీంనగర్ అదనపు డీసీపీ పి. వెంకటరమణ, హైదరాబాద్ సైబర్ క్రైమ్స్ ఏసీపీ ఆర్.జి. శివ మారుతి, సైబరాబాద్ సీటీసీ ఏసీపీ ఆశాల గంగారామ్, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీఎస్పీ బి. రవికుమార్ రెడ్డి, టీజీ ఈగిల్ ఫోర్స్ డీఎస్పీ బచలకుర రమేష్, సీఐడీ డీఎస్పీ బి. శ్రీనివాసరావు, టీజీఎస్పీ 8వ బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ డి. సత్యనారాయణ, సైబరాబాద్ ఇన్‌స్పెక్టర్ పి. జగదీశ్వర్, ఆక్టోపస్ హెడ్ కానిస్టేబుల్ సి. రాములు, పిటిఓ హెడ్ కానిస్టేబుల్ కురపాటి తిరుపతి రాజు ఉన్నారు. వీరితో పాటు గ్రేహౌండ్స్‌కు చెందిన హోంగార్డు మేడిపల్లి యాదయ్య కూడా ప్రశంసనీయ సేవా పతకాన్ని సాధించారు.

Latest