• హెచ్‌ఎండీఏ పరిధిలో ఎక్కడైనా వినియోగానికి అవకాశం.
• ఇకపై టీడీఆర్ జారీ ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లోనే.
హైదరాబాద్, మహా.
హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) పరిధిలో ట్రాన్స్‌ఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్ (టీడీఆర్) జారీ, వినియోగానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. టీడీఆర్ ప్రక్రియను మరింత పారదర్శకంగా, సులభతరం చేసేలా తెలంగాణ బిల్డింగ్ రూల్స్–2012లో సవరణలు చేస్తూ ప్రభుత్వం జీవోఎంఎస్ నంబర్ 218 జారీ చేసింది. కొత్త నిబంధనలతో హెచ్‌ఎండీఏ పరిధిలో ప్రజా ప్రయోజన ప్రాజెక్టుల కోసం భూములు సమకూర్చే యజమానులకు టీడీఆర్ వినియోగంలో మరింత వెసులుబాటు కలగనుంది.
హెచ్‌ఎండీఏ చేపట్టే వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల కోసం అవసరమైన లేదా స్వాధీనం చేసుకున్న భూములకు ఇకపై హెచ్‌ఎండీఏనే టీడీఆర్ సర్టిఫికెట్లను జారీ చేయనుంది. రహదారుల విస్తరణ, ప్రజా ప్రయోజన ప్రాజెక్టులు, ఇతర మౌలిక వసతుల కోసం భూములను సమకూర్చిన సందర్భాల్లో ఈ విధానం వర్తించనుంది.
క్యూర్ ,ప్యూర్ పరిధులతోపాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో ప్రజా ప్రయోజనాలు లేదా ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం భూములు ఇచ్చే సందర్భాల్లోనూ ఈ నిబంధనలు వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. తద్వారా ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి ప్రాజెక్టులకు భూముల సమీకరణ ప్రక్రియలో టీడీఆర్ కీలక సాధనంగా మారనుంది.
హెచ్‌ఎండీఏ జారీ చేసే టీడీఆర్ సర్టిఫికెట్‌ను సంస్థ పరిధిలోని ఇతర ప్రాంతాల్లోనూ వినియోగించుకునే లేదా డిస్పోజ్ చేసుకునే అవకాశం కల్పించారు. అంటే టీడీఆర్ పొందిన భూ యజమాని తనకు లభించిన అభివృద్ధి హక్కులను నిబంధనలకు అనుగుణంగా హెచ్‌ఎండీఏ పరిధిలోని ఇతర అర్హత కలిగిన ప్రదేశాల్లో వినియోగించుకునే వెసులుబాటు ఉంటుంది.
టీడీఆర్ జారీ ప్రక్రియను పూర్తిగా ఆన్‌లైన్ విధానంలోకి తీసుకురావడం కొత్త నిబంధనల్లో మరో ముఖ్యమైన మార్పు. టీడీఆర్ దరఖాస్తు, పరిశీలన, జారీ తదితర ప్రక్రియలను డిజిటల్ విధానంలో నిర్వహించనున్నారు. దీనివల్ల కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం తగ్గడంతోపాటు, ప్రక్రియలో పారదర్శకత పెరిగే అవకాశం ఉంది.
టీడీఆర్‌కు సంబంధించిన వివరాలు, లెక్కలు, జారీ, బదిలీ, వినియోగంలోనూ ఏకరీతి విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సంబంధిత మున్సిపల్ కార్పొరేషన్, పట్టణ స్థానిక సంస్థ , ఎఫ్‌సీడీఏలకు టీడీఆర్ సర్టిఫికెట్ కాపీని అందజేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. తద్వారా టీడీఆర్ వినియోగంపై సంబంధిత సంస్థల వద్ద కూడా సమగ్ర రికార్డు అందుబాటులో ఉంటుంది.
ఇదే సమయంలో ‘బిల్డ్ నౌ’ వ్యవస్థలోనూ టీడీఆర్‌కు సంబంధించిన మార్పులు చేశారు. టీడీఆర్ ప్రాసెసింగ్, సర్టిఫికెట్ల జారీ, అకౌంటింగ్, వినియోగాన్ని డిజిటల్ విధానంలో నిర్వహించేందుకు అవసరమైన సాంకేతిక మార్పులను ఈ వ్యవస్థలో చేపట్టనున్నారు. భవిష్యత్తులో టీడీఆర్ లావాదేవీలను ఒకే డిజిటల్ వ్యవస్థ ద్వారా పర్యవేక్షించేందుకు ఇది దోహదపడనుంది.
ప్రజా ప్రయోజనాల కోసం భూములు సమకూర్చే యజమానులకు పరిహారానికి ప్రత్యామ్నాయంగా లేదా పరిహారంతో పాటు లభించే అభివృద్ధి హక్కులను సులభంగా వినియోగించుకునే విధంగా టీడీఆర్ విధానం పనిచేస్తుంది. సాధారణంగా రహదారుల విస్తరణ, మౌలిక వసతుల అభివృద్ధి వంటి అవసరాల కోసం భూమిని వదులుకున్న యజమానికి ప్రత్యామ్నాయంగా అభివృద్ధి హక్కులు కల్పించడం ఈ విధానంలో ప్రధాన ఉద్దేశం.
కొత్త నిబంధనలు గెజిట్‌లో ప్రచురించిన తేదీ నుంచే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంతంలో రహదారులు, ప్రజా మౌలిక వసతులు, భవిష్యత్ పట్టణాభివృద్ధి ప్రాజెక్టులకు అవసరమైన భూముల సమీకరణతో పాటు టీడీఆర్ జారీ, వినియోగ ప్రక్రియ మరింత వ్యవస్థీకృతంగా మారే అవకాశం ఉంది.








