Mahaa Daily Exclusive

  తెలంగాణ పోలీస్‌ శాఖలో భారీ పునర్‌వ్యవస్థీకరణ..! గ్రేహౌండ్స్‌, ఆక్టోపస్‌, ఎస్‌ఐబీ నుంచి 513 మందికి బదిలీలు..

Share

• గ్రేహౌండ్స్‌, ఆక్టోపస్‌, ఎస్‌ఐబీ నుంచి 513 మందికి బదిలీలు.
• ట్రాఫిక్‌, రోడ్డు భద్రతకు 224 మంది.
హైదరాబాద్‌, మహా.

మారుతున్న నేర స్వరూపాలు, శాంతిభద్రతల సవాళ్లకు అనుగుణంగా తెలంగాణ పోలీస్‌ శాఖలో పునర్‌వ్యవస్థీకరణ చేపడుతున్నట్లు డీజీపీ సీవీ ఆనంద్‌ తెలిపారు. ఇందులో భాగంగా గ్రేహౌండ్స్‌, ఆక్టోపస్‌, ఎస్‌ఐబీ విభాగాల్లో పనిచేస్తున్న 513 మంది సిబ్బందిని ఇతర విభాగాలకు బదిలీ చేసినట్లు వెల్లడించారు. పోలీస్‌ సిబ్బంది అనుభవం, సామర్థ్యాలను ప్రజలకు మరింత సమర్థంగా ఉపయోగపడేలా ఈ మార్పులు చేపట్టినట్లు తెలిపారు.
బదిలీ అయిన వారిలో ఐదుగురు సీఐలు, 22 మంది ఎస్‌ఐలు, 14 మంది ఏఎస్‌ఐలు ఉన్నారు. వీరితో పాటు 84 మంది హెడ్‌ కానిస్టేబుళ్లు, 388 మంది కానిస్టేబుళ్లకు కొత్త బాధ్యతలు అప్పగించారు. ప్రత్యేక విభాగాల్లో పనిచేసిన సిబ్బందిని అవసరమున్న ఇతర విభాగాలకు మళ్లించడం ద్వారా పోలీసింగ్‌ వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దాలని పోలీస్‌ శాఖ నిర్ణయించింది.
ఈ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా అత్యధికంగా 224 మంది సిబ్బందిని ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌, రోడ్డు భద్రత విభాగాలకు కేటాయించారు. నగరాలు, పట్టణాల్లో పెరుగుతున్న ట్రాఫిక్‌ రద్దీ, రోడ్డు ప్రమాదాల నియంత్రణ, ట్రాఫిక్‌ నిర్వహణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో ఈ విభాగాలకు పెద్ద సంఖ్యలో సిబ్బందిని కేటాయించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
కొత్తగా కేటాయించిన బాధ్యతల్లోకి సిబ్బంది నేరుగా వెళ్లకుండా ముందుగా రెండు నెలల పాటు వివిధ విభాగాల్లో అటాచ్‌మెంట్‌ విధానంలో పనిచేయనున్నట్లు డీజీపీ సీవీ ఆనంద్‌ తెలిపారు. ఈ కాలంలో వారి పనితీరు, అనుభవం, నైపుణ్యాలను పరిశీలించడంతో పాటు ఆయా విభాగాల విధానాలపై అవగాహన కల్పించనున్నారు.
సిబ్బంది విద్యార్హతలు, గత అనుభవం, విధుల్లో చూపిన సామర్థ్యం ఆధారంగా రెండు నెలల అటాచ్‌మెంట్‌ అనంతరం తుది బాధ్యతలను నిర్ణయించనున్నట్లు డీజీపీ స్పష్టం చేశారు. తద్వారా సరైన వ్యక్తికి సరైన బాధ్యత అప్పగించి పోలీస్‌ శాఖ పనితీరును మరింత మెరుగుపరచడమే లక్ష్యంగా పునర్‌వ్యవస్థీకరణ కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
మారుతున్న నేరాల తీరు, సాంకేతిక ఆధారిత నేరాలు, ట్రాఫిక్‌ సమస్యలు, ప్రజా భద్రత వంటి అంశాలకు అనుగుణంగా పోలీస్‌ బలగాలను సమర్థంగా వినియోగించేందుకు ఈ మార్పులు దోహదపడనున్నాయి. ವಿಶೇಷ విభాగాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న సిబ్బందిని ఇతర కీలక విభాగాల్లో వినియోగించడం ద్వారా ప్రజలకు మరింత వేగవంతమైన, సమర్థవంతమైన పోలీస్‌ సేవలు అందించేందుకు అవకాశం ఏర్పడనుంది.

Latest