Mahaa Daily Exclusive

  నా జీవితం గురించి రాయడం అంత సులభం కాలేదు..! సోనియా గాంధీ ఆత్మకథ ‘బిలాంగింగ్‌’ నవంబర్‌ 10న విడుదల…

Share

• సోనియా గాంధీ ఆత్మకథ ‘బిలాంగింగ్‌’ నవంబర్‌ 10న విడుదల.
• ప్రధాని పదవిని ఎందుకు తిరస్కరించారో వెల్లడి.

ఢిల్లీ, మహా.
కాంగ్రెస్‌ అగ్రనేత సోనియా గాంధీ తన జీవిత ప్రయాణంపై రాసిన ఆత్మకథ ‘బిలాంగింగ్‌: ఎ జర్నీ ఆఫ్‌ లవ్‌’ త్వరలో పాఠకుల ముందుకు రానుంది. 544 పేజీల ఈ పుస్తకంలో తన వ్యక్తిగత జీవితం, రాజీవ్‌ గాంధీతో పరిచయం, ప్రేమ, వివాహం, గాంధీ కుటుంబంలోకి అడుగుపెట్టిన నాటి అనుభవాలు, రాజకీయాల్లోకి వచ్చిన పరిస్థితులతో పాటు తన జీవితాన్ని ప్రభావితం చేసిన విషాద ఘటనలను ఆమె వివరించినట్లు వెల్లడైంది. ఈ పుస్తకం నవంబర్‌ 10న హార్డ్‌కవర్‌, ఈ-బుక్‌ రూపంలో విడుదల కానుంది.
తన జీవితాన్ని తానే రాసుకోవడం అంత సులభమైన పని కాదని సోనియా గాంధీ పేర్కొన్నారు. ఇప్పటివరకు తన వ్యక్తిగత గోప్యతను కాపాడుకోవడానికి ఎంతో ప్రాధాన్యం ఇచ్చానని, అయితే జీవితంలో ఎదురైన కొన్ని హృదయవిదారక ఘటనలు, నష్టాలే చివరకు తనను రాజకీయాల్లోకి తీసుకువచ్చాయని ఆమె తెలిపారు. తన ఆత్మకథ రాయడం అంటే తనలో దాచుకున్న అనుభవాలను, జ్ఞాపకాలను, భావోద్వేగాలను పాఠకులతో పంచుకోవడమేనని వివరించారు.
రాజీవ్‌తో ప్రేమ నుంచి గాంధీ కుటుంబంలోకి..
యుద్ధానంతర ఇటలీలో తన బాల్యం నుంచి ఆత్మకథ ప్రారంభమవుతుందని సోనియా గాంధీ వెల్లడించారు. 1965లో ఇంగ్లాండ్‌లోని కేంబ్రిడ్జ్‌లో 19 ఏళ్ల విద్యార్థినిగా ఉన్న సమయంలో రాజీవ్‌ గాంధీతో పరిచయం, ఆ పరిచయం ప్రేమగా మారడం, అనంతరం వివాహం వరకు జరిగిన పరిణామాలను పుస్తకంలో పొందుపరిచినట్లు తెలిపారు.
రాజీవ్‌ గాంధీని వివాహం చేసుకున్న తర్వాత భారతదేశంలో తన జీవితం ఎలా మారింది? అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ కోడలిగా ఎదురైన అనుభవాలేమిటి? భారతీయ సంస్కృతికి అలవాటు పడేందుకు తాను చేసిన ప్రయత్నాలు, హిందీ నేర్చుకోవడం, చీర ధరించడం, భారతీయ వంటకాలను అలవాటు చేసుకోవడం వంటి వ్యక్తిగత విషయాలను కూడా ఆత్మకథలో ప్రస్తావించినట్లు సమాచారం.
కుటుంబాన్ని కుదిపేసిన విషాదాల ప్రస్తావన
గాంధీ కుటుంబాన్ని కుదిపేసిన పలు విషాద ఘటనలను కూడా సోనియా గాంధీ ఆత్మకథలో గుర్తుచేసుకున్నట్లు తెలుస్తోంది. విమాన ప్రమాదంలో సంజయ్‌ గాంధీ మరణం, అనంతరం 1984లో ఇందిరాగాంధీ హత్య, ఆ తర్వాత రాజీవ్‌ గాంధీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం, సరిగ్గా ఏడేళ్లకే ఎన్నికల ప్రచార సమయంలో ఆయన హత్యకు గురికావడం వంటి తీవ్ర విషాద పరిణామాలను తన దృష్టికోణంలో వివరించినట్లు ప్రచురణ సంస్థ వెల్లడించింది.
తన కుటుంబం గురించి ఇప్పటివరకు అనేక మంది అనేక రకాలుగా రాశారని, అయితే వారి చర్యలు, ఉద్దేశాలు, మానవ సహజమైన బలహీనతలను అర్థం చేసుకునే ప్రయత్నం చాలా తక్కువగా జరిగిందని సోనియా గాంధీ అభిప్రాయపడ్డారు. అందుకే ఈ పుస్తకాన్ని తన కుటుంబ సభ్యుల మానవత్వానికి ఒక నివాళిగా కూడా భావిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.
2004లో ప్రధాని పదవిని ఎందుకు తిరస్కరించారు?
ఆత్మకథలో అత్యంత ఆసక్తికరమైన అంశాల్లో ఒకటిగా 2004లో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు నిలవనున్నాయి. కాంగ్రెస్‌ నేతృత్వంలోని కూటమి లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ప్రధానమంత్రి పదవిని సోనియా గాంధీ స్వీకరించలేదు. ఆ నిర్ణయం వెనుక ఉన్న కారణాలను కూడా పుస్తకంలో వెల్లడించినట్లు సమాచారం.
దశాబ్దాల పాటు రాజకీయ ఒత్తిళ్లకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించిన తాను చివరకు రాజకీయాల్లోకి రావడానికి దారితీసిన పరిస్థితులు, ఆ తర్వాత ఎదురైన సవాళ్లను ఇందులో వివరించినట్లు తెలుస్తోంది. ప్రధానమంత్రి పదవిని తిరస్కరించాలన్న నిర్ణయం ఎలా తీసుకున్నారు? ఆ సమయంలో తన మనసులో ఉన్న ఆలోచనలేమిటి? అనే అంశాలపై ఆమె తొలిసారిగా తన దృక్కోణాన్ని పాఠకుల ముందుంచనున్నట్లు ప్రచురణ సంస్థ తెలిపింది.
ఆరు దశాబ్దాల భారత రాజకీయ, సామాజిక మార్పులకు సాక్ష్యం
భారత్‌లో తాను గడిపిన దాదాపు ఆరు దశాబ్దాల కాలంలో దేశంలో చోటుచేసుకున్న సామాజిక, రాజకీయ మార్పులను కూడా సోనియా గాంధీ తన ఆత్మకథలో ప్రస్తావించారు. భారతదేశాన్ని తనకు చెందిన అందమైన దేశంగా అభివర్ణించిన ఆమె.. వ్యక్తిగత అనుభవాలతో పాటు దేశ రాజకీయ పరిణామాలను ఒక ప్రత్యేక దృక్కోణంలో పాఠకులకు పరిచయం చేయనున్నట్లు తెలిపారు.
‘బిలాంగింగ్‌: ఎ జర్నీ ఆఫ్‌ లవ్‌’ పుస్తకాన్ని న్యూయార్క్‌కు చెందిన ప్రముఖ ప్రచురణ సంస్థ ఆల్ఫ్రెడ్‌ ఎ. నాఫ్‌ ప్రచురిస్తోంది. నవంబర్‌ 10న పుస్తకం విడుదల కానుండగా.. ఆడియో ఎడిషన్‌ను పెంగ్విన్‌ ర్యాండమ్‌ హౌస్‌ ప్రచురించనుంది. తొలి ముద్రణలో లక్ష కాపీలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రచురణ సంస్థ నిర్ణయించింది.
సోనియా గాంధీ వ్యక్తిగత జీవితం, గాంధీ కుటుంబ చరిత్ర, భారత రాజకీయాల్లో కీలక మలుపులు, ముఖ్యంగా 2004లో ప్రధాని పదవిని తిరస్కరించిన నిర్ణయం వెనుక ఉన్న అంశాలను తెలుసుకునేందుకు ఈ ఆత్మకథపై రాజకీయ, సామాజిక వర్గాల్లో ఇప్పటికే ఆసక్తి నెలకొంది.

Latest