- మంత్రి కొండా సురేఖను వివరణ కోరాలని నిర్ణయం.
- క్రమశిక్షణ చర్యలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్.
హైదరాబాద్, మహా.
మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మితా పటేల్ చేసిన రాజకీయ వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్‌లో కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై ఆమె చేసిన వ్యాఖ్యలు, వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోయినా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానన్న ప్రకటనపై టీపీసీసీ తీవ్రంగా స్పందించింది. ఈ వ్యవహారంపై మంత్రి కొండా సురేఖను వివరణ కోరాలని పార్టీ నిర్ణయించినట్లు సమాచారం.
వరంగల్ జిల్లా గీసుకొండలో బుధవారం మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సుస్మితా పటేల్ వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి తాను పోటీ చేస్తానని ప్రకటించారు. కాంగ్రెస్ అధిష్ఠానం తనకు టికెట్ ఇవ్వకపోయినా స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతానని స్పష్టం చేశారు. అదే సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి వ్యవహారశైలిపై ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు మీడియా, సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టికి వెళ్లాయి.
సుస్మిత వ్యాఖ్యలపై ఇప్పటికే పార్టీ క్రమశిక్షణ కమిటీ తీవ్రంగా స్పందించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్టీ నిర్దేశించిన లక్ష్మణరేఖను ఎవరైనా అతిక్రమిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. సుస్మిత చేసిన వ్యాఖ్యలపై పూర్తి వివరాలు సేకరించిన అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా ఈ పరిణామంపై ఆరా తీసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సుస్మిత వ్యాఖ్యలపై పూర్తి నివేదికను అందజేయాలని టీపీసీసీ అధ్యక్షుడిని ఆమె కోరినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్ఠానం తదుపరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
పరకాల నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో పోటీపై సుస్మిత చేసిన ప్రకటన రాజకీయంగా మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఒకవైపు కాంగ్రెస్‌లోనే కొనసాగుతూ టికెట్ కోసం ప్రయత్నిస్తానని సంకేతాలు ఇవ్వడం, మరోవైపు టికెట్ దక్కకపోతే స్వతంత్రంగా పోటీ చేస్తానని ప్రకటించడం పార్టీ నాయకత్వానికి ఇబ్బందికరంగా మారినట్లు తెలుస్తోంది.
మంత్రి కొండా సురేఖను వివరణ కోరాలని టీపీసీసీ నిర్ణయించిన నేపథ్యంలో.. ఆమె ఇచ్చే సమాధానం, అనంతరం పార్టీ క్రమశిక్షణ కమిటీ తీసుకునే నిర్ణయంపై కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే పరకాల రాజకీయాలపై సుస్మిత వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారగా, తాజాగా పార్టీ అధిష్ఠానం జోక్యంతో ఈ వ్యవహారం మరింత వేడెక్కింది.








