- 35 రోజుల ఉత్సవాల్లో రూ.61.35 లక్షల ఆదాయం
- 17 రోజుల్లోనే రూ.37.88 లక్షలు సమకూరిన వైనం
మహా ప్రతినిధి పెద్దాపురం, ఆగస్టు 18: కాకినాడ జిల్లా పెద్దాపురం ఇలవేల్పు దేవత శ్రీ మరిడమ్మ అమ్మవారి ఆషాఢ మాస ఉత్సవాలకు భక్తుల నుంచి విశేష స్పందన లభించింది. 35 రోజుల పాటు నిర్వహించిన ఉత్సవాల్లో దేవస్థానానికి హుండీలు, అన్నదానం విరాళాల రూపంలో మొత్తం రూ.61,35,051 ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారిణి, దేవాదాయ సహాయ కమిషనర్ కె. విజయలక్ష్మి తెలిపారు.
ఉత్సవాల సందర్భంగా హుండీల ద్వారా రూ.60,10,453, అన్నదానం విరాళాల ద్వారా రూ.1,24,598 ఆదాయం వచ్చినట్లు ఆమె వెల్లడించారు.
ఇదిలా ఉండగా, ఈ నెల 1వ తేదీ నుంచి 17వ తేదీ వరకు 17 రోజుల ఆదాయాన్ని తాజాగా లెక్కించగా మొత్తం రూ.37,88,761 సమకూరినట్లు తెలిపారు. ఇందులో హుండీల ద్వారా రూ.37,09,515, అన్నదానం హుండీ ద్వారా రూ.79,246 వచ్చినట్లు వివరించారు.
ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త చింతపల్లి శ్రీహర్ష, ఆలయ చైర్మన్, కమిటీ సభ్యులు, గ్రామస్తులు, భక్తులు, భక్త మండలి సభ్యులు, ఆలయ సిబ్బంది, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది సమక్షంలో ఈ ఆదాయ లెక్కింపు ప్రక్రియ నిర్వహించారు.
గత ఏడాది ఉత్సవాలతో పోలిస్తే ఈసారి హుండీ ఆదాయం గణనీయంగా పెరిగింది. గత ఏడాది హుండీల ద్వారా రూ.51,32,909, అన్నదానం హుండీ ద్వారా రూ.50,071 ఆదాయం వచ్చినట్లు విజయలక్ష్మి తెలిపారు.
ఆదాయ లెక్కింపు కార్యక్రమాన్ని జేవీవో వి.వి. పల్లంరాజు, దేవాదాయ తనిఖీదారు వి. ఫణీంద్రకుమార్, కాకినాడ శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయ అధికారి లక్ష్మణ్, పెద్దాపురం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం అధికారి కె. జగదీశ్వరరావు పర్యవేక్షించారు.








