Mahaa Daily Exclusive

  జనగణనలో ఓబీసీ కాలమ్‌ కోసం తెలంగాణలో గళం…..

Share

జనగణనలో ఓబీసీ కాలమ్‌ కోసం తెలంగాణలో గళం.
* అసెంబ్లీలో తీర్మానానికి డిమాండ్‌.
* ఓబీసీలకు ప్రత్యేక గుర్తింపు లేకుంటే బీసీ జనాభా లెక్కలు ఎలా తేలుతాయి?
* 130 కులాల్లో 90కే కేంద్ర జాబితాలో చోటు.
* మిగిలిన 40 కులాలను చేర్చిన తర్వాతే గణన చేపట్టాలని డిమాండ్‌.

హైదరాబాద్‌, మహా .

2027 జనగణనలో ఓబీసీలకు ప్రత్యేకంగా గుర్తింపు ఇచ్చే విధంగా కేంద్రం చర్యలు తీసుకోవాలని తెలంగాణలో డిమాండ్‌ బలపడుతోంది. జనగణనలో ఎస్సీ, ఎస్టీల మాదిరిగా వెనుకబడిన తరగతుల కులాల వివరాలను కూడా స్పష్టంగా నమోదు చేయాలని బీసీ సంఘాలు, జేఏసీలు కోరుతున్నాయి. ఓబీసీల వివరాల నమోదుకు స్పష్టమైన కాలమ్‌ లేదా ముందుగా గుర్తించిన అధికారిక కులాల జాబితా ఉండాలని, ఈ అంశంపై తెలంగాణ శాసనసభలో మరోసారి తీర్మానం చేసి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్‌ వినిపిస్తోంది.

2027 జనగణనలో కులగణనను చేపట్టాలని కేంద్రం ఇప్పటికే నిర్ణయించింది. తెలంగాణలో గృహ జాబితా, గృహ గణన ప్రక్రియ మే 11 నుంచి జూన్‌ 9 వరకు నిర్వహించనున్నట్లు గతంలో కేంద్ర జనగణన అధికారులు వెల్లడించారు. తెలంగాణలో 2027 జనగణన ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకోనుంది. స్వాతంత్ర్యం తర్వాత దేశవ్యాప్తంగా తొలిసారిగా సమగ్ర కుల వివరాల సేకరణకు కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో, కులాల గుర్తింపు, నమోదు విధానం కీలకంగా మారింది.

అయితే జనగణనలో వెనుకబడిన తరగతుల వివరాలను ఏ విధంగా నమోదు చేస్తారన్న అంశంపై ఇప్పుడు చర్చ మొదలైంది. ప్రాథమిక గృహ జాబితా ప్రశ్నావళిలో కుటుంబ పెద్ద ఎస్సీ, ఎస్టీ లేదా ఇతర వర్గానికి చెందినవారా అనే అంశానికి చోటు ఉన్నప్పటికీ, ఓబీసీలను ప్రత్యేకంగా గుర్తించే విధానం ఉండకపోవడంపై బీసీ వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. రెండో దశ జనాభా లెక్కల్లో కుల వివరాలను సేకరించే సమయంలో కూడా ఓబీసీలకు స్పష్టమైన, ప్రమాణీకృత విధానం ఉండాలని వారు కోరుతున్నారు.

తెలంగాణ బీసీ కమిషన్‌ ఇప్పటికే ఈ అంశంపై కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. కమిషన్‌ చైర్మన్‌ జి.నిరంజన్‌ ప్రకారం తెలంగాణలో 130 కులాలు బీసీలుగా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందగా, కేంద్ర ఓబీసీ జాబితాలో ప్రస్తుతం 90 కులాలకే చోటు ఉంది. మిగిలిన 40 కులాలు కేంద్ర జాబితాలో లేకుండానే జనగణన జరిగితే, ఆ వర్గాల జనాభా అధికారిక లెక్కల్లో సరిగా ప్రతిబింబించకపోవచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అందువల్ల మిగిలిన 40 కులాలను కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చిన తర్వాతే జనగణన ప్రక్రియను చేపట్టాలని కమిషన్‌ కోరింది.

తెలంగాణలో నిర్వహించిన సామాజిక, ఆర్థిక, కుల సర్వేలో బీసీల జనాభా 56.32 శాతంగా ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఆ సర్వే ఆధారంగా విద్య, ఉద్యోగాలు, రాజకీయ ప్రాతినిధ్యంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో జాతీయ జనగణనలో బీసీల జనాభా వివరాలు శాస్త్రీయంగా, స్పష్టంగా నమోదైతేనే భవిష్యత్‌ విధానాలు, రిజర్వేషన్లు, సంక్షేమ కార్యక్రమాలకు బలమైన గణాంక ఆధారం లభిస్తుందని బీసీ సంఘాలు వాదిస్తున్నాయి.

ఓబీసీలకు ప్రత్యేక కాలమ్‌ లేకుండా వివరాలను నమోదు చేస్తే తెలంగాణలో ఇప్పటికే వెల్లడైన 56.32 శాతం బీసీ జనాభా గణాంకాలతో జాతీయ జనగణనలో నమోదయ్యే వివరాలను ఎలా సరిపోల్చాలన్న ప్రశ్న కూడా ముందుకు వస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలో బీసీలుగా గుర్తించిన అన్ని కులాలకు కేంద్ర స్థాయిలో సమాన గుర్తింపు లేకపోవడం వల్ల భవిష్యత్‌లో గణాంకాల ఆధారంగా రూపొందించే విధానాలపై ప్రభావం పడే అవకాశం ఉందని బీసీ సంఘాలు చెబుతున్నాయి.

ఈ అంశానికి తమిళనాడు అసెంబ్లీ తాజాగా మరింత ప్రాధాన్యత తీసుకొచ్చింది. సెప్టెంబర్‌ 8న తమిళనాడు శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేసి, 2027 జనగణన రెండో దశలో బీసీ, అత్యంత వెనుకబడిన తరగతులు, డీనోటిఫైడ్‌ కమ్యూనిటీల కుల వివరాలను ఎస్సీ, ఎస్టీల మాదిరిగా అధికారిక జాబితాల ఆధారంగా సేకరించాలని కేంద్రాన్ని కోరింది. జనగణన పోర్టల్‌లో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అధికారికంగా గుర్తించిన కులాల జాబితాలను ముందుగానే పొందుపరిచి, ప్రజలు అందులోని పేర్లను ఎంపిక చేసుకునే విధానాన్ని అమలు చేయాలని తమిళనాడు అసెంబ్లీ కోరింది.

ప్రస్తుతం ప్రతిపాదిస్తున్న ‘ఓపెన్‌ కాలమ్‌’ విధానంపై కూడా తమిళనాడు అసెంబ్లీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఒకే కులానికి ప్రాంతాల వారీగా వేర్వేరు పేర్లు, ఉచ్చారణలు, అక్షరరూపాలు నమోదైతే గణాంకాల్లో గందరగోళం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. అందువల్ల అధికారిక జాబితాలను జనగణన వ్యవస్థలో ముందుగానే పొందుపరిచి, వాటి ఆధారంగానే వివరాలను నమోదు చేయాలని తీర్మానించింది.

తమిళనాడు అసెంబ్లీ తీర్మానం నేపథ్యంలో తెలంగాణలోనూ ఇదే తరహా నిర్ణయం తీసుకోవాలన్న డిమాండ్‌ ఊపందుకుంటోంది. గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలోనూ, ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనూ కులగణనకు సంబంధించి తెలంగాణ శాసనసభ తీర్మానాలు చేసింది. ఇప్పుడు జాతీయ జనగణనలో ఓబీసీలకు ప్రత్యేక గుర్తింపు, అధికారిక కులాల జాబితా, రాష్ట్రంలో గుర్తింపు పొందిన అన్ని బీసీ కులాలకు కేంద్ర జాబితాలో చోటు కల్పించడం వంటి అంశాలపై మరోసారి తీర్మానం చేయాలని బీసీ జేఏసీలు పట్టుబడుతున్నాయి.

కేంద్ర జనగణనలో నమోదయ్యే గణాంకాలే భవిష్యత్‌లో సామాజిక సంక్షేమ విధానాలు, రిజర్వేషన్లు, ప్రభుత్వ పథకాల రూపకల్పనకు కీలక ఆధారంగా మారే అవకాశం ఉన్నందున ఓబీసీల కుల వివరాల సేకరణలో ఎలాంటి గందరగోళానికి తావులేకుండా స్పష్టమైన విధానం ఉండాలని బీసీ వర్గాలు కోరుతున్నాయి. తెలంగాణలో ఇప్పటికే నిర్వహించిన కుల సర్వే గణాంకాలను దృష్టిలో పెట్టుకుని, జాతీయ జనగణనలోనూ బీసీల సంఖ్య కచ్చితంగా ప్రతిబింబించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాయి.