Mahaa Daily Exclusive

  రిజర్వాయర్లపై ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్లాంట్లు…

Share

రిజర్వాయర్లపై ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్లాంట్లు.
* తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం.
* పెరుగుతున్న విద్యుత్‌ డిమాండ్‌కు జలాశయాలపై సౌర విద్యుత్‌ పరిష్కారం.
* నాగార్జునసాగర్‌ నుంచి మిడ్‌మానేరు వరకు…
9 రిజర్వాయర్లపై ఫ్లోటింగ్‌ సోలార్‌పై అధ్యయనం.
• ఉప ముఖ్యమంత్రి, విద్యుత్‌ శాఖ మంత్రి భట్టి విక్రమార్క .

హైదరాబాద్‌, మహా:
తెలంగాణలో పెరుగుతున్న విద్యుత్‌ డిమాండ్‌ను తీర్చేందుకు సంప్రదాయ విద్యుత్‌ వనరులతో పాటు పునరుత్పాదక ఇంధన వనరులను భారీగా విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రధాన, మధ్య తరహా రిజర్వాయర్లపై ఫ్లోటింగ్‌ సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్లు ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలిస్తోంది. విద్యుత్‌, నీటిపారుదల శాఖలు సంయుక్తంగా సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేస్తున్నాయని ఉప ముఖ్యమంత్రి, విద్యుత్‌ శాఖ మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో వెల్లడించారు. అధ్యయనం పూర్తయిన అనంతరం ప్రాజెక్టులపై స్పష్టమైన ప్రకటన చేస్తామని తెలిపారు.

రాష్ట్రంలో విద్యుత్‌ అవసరాలు వేగంగా పెరుగుతున్నాయని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. 2023 డిసెంబర్‌లో రాష్ట్ర గరిష్ఠ విద్యుత్‌ డిమాండ్‌ 15,000 మెగావాట్లుగా ఉండగా, ప్రస్తుతం 18,543 మెగావాట్లకు చేరిందని తెలిపారు. భవిష్యత్‌లో డిమాండ్‌ మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందుగానే ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం సౌర విద్యుత్‌, ఫ్లోటింగ్‌ సోలార్‌, ఇతర సంప్రదాయేతర ఇంధన వనరులను ప్రోత్సహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇటీవలి కాలంలో తెలంగాణ విద్యుత్‌ వ్యవస్థ రికార్డు స్థాయిలో డిమాండ్‌ను విజయవంతంగా నిర్వహించిన విషయం కూడా నమోదైంది.

భూమిపై సోలార్‌ ప్లాంట్ల ఏర్పాటుకు విస్తారమైన భూమి అవసరమవుతుందని, అదే సమయంలో తెలంగాణలోని జలాశయాల ఉపరితలాన్ని వినియోగించుకోవడం ద్వారా భూసేకరణ అవసరాన్ని గణనీయంగా తగ్గించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. నీటిపై తేలియాడే సౌర ఫలకాల ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి చేయడంతో పాటు నీటి ఆవిరీభవనం తగ్గే ప్రయోజనం కూడా ఉంటుందని భట్టి వివరించారు. ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్లాంట్లకు సాధారణ సోలార్‌ ప్రాజెక్టులతో పోలిస్తే పెట్టుబడి ఎక్కువైనా, భూమి ఆదా కావడం, నీటి ఆవిరి నష్టాన్ని తగ్గించడం వంటి ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు.

ప్రస్తుతం నాగార్జునసాగర్‌, శ్రీశైలం, పులిచింతల, శ్రీరామ్‌సాగర్‌, ఎల్లంపల్లి, మల్లన్నసాగర్‌, ఎల్‌ఎండీ, మిడ్‌మానేరు, పోచారం తదితర ప్రధాన, మధ్య తరహా రిజర్వాయర్లపై ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్లాంట్ల ఏర్పాటును పరిశీలిస్తున్నారు. ఆయా జలాశయాల విస్తీర్ణం, నీటి మట్టాల హెచ్చుతగ్గులు, విద్యుత్‌ అనుసంధానం, పర్యావరణ ప్రభావం, ప్రాజెక్టు వ్యయం తదితర అంశాలను పరిశీలించిన తర్వాత ఏ రిజర్వాయర్‌పై ఎంత సామర్థ్యంతో ప్లాంట్‌ ఏర్పాటు చేయాలన్నది ఖరారు చేయనున్నారు.

ఫ్లోటింగ్‌ సోలార్‌కు ఖర్చు ఎక్కువగా ఉండటం ప్రధాన సవాలుగా మారనుంది. కేంద్రం నుంచి ప్రతి మెగావాట్‌కు రూ.1 కోటి వరకు వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ అందే అవకాశం ఉన్నప్పటికీ, దేశీయంగా తయారైన పరికరాల తప్పనిసరి వినియోగం వల్ల ఒక్క మెగావాట్‌కు అదనంగా సుమారు రూ.1.30 కోట్ల వరకు వ్యయం పెరిగే పరిస్థితి ఉందని భట్టి తెలిపారు. ఈ వ్యయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టుల ఆర్థిక సాధ్యాసాధ్యాలను కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది.

అయితే తెలంగాణకు ఫ్లోటింగ్‌ సోలార్‌ కొత్త విషయం కాదు. రామగుండంలోని ఎన్‌టీపీసీ జలాశయంపై ఇప్పటికే 100 మెగావాట్ల ఫ్లోటింగ్‌ సోలార్‌ విద్యుత్‌ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో పనిచేస్తోంది. 2022 జూలై 1న ఈ ప్రాజెక్టు పూర్తి సామర్థ్యంతో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించింది. సుమారు 500 ఎకరాల జలాశయ విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ ప్రాజెక్టు ద్వారా భూమిని వినియోగించకుండా సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు.

ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్రాజెక్టుల మరో ముఖ్య ప్రయోజనం నీటి ఆవిరీభవనాన్ని తగ్గించడం. ఎన్‌టీపీసీ వివరాల ప్రకారం రామగుండం ప్రాజెక్టు నీటి ఆవిరి నష్టాన్ని తగ్గించడంలో సహాయపడుతోంది. సౌర ఫలకాలకు నీటి ఉపరితలం నుంచి లభించే సహజ శీతలీకరణ కారణంగా విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యానికి కూడా ప్రయోజనం కలగవచ్చని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.