Mahaa Daily Exclusive

  విద్యతోనే సమాజంలో సమూల మార్పు…

Share

విద్యతోనే సమాజంలో సమూల మార్పు.
• గ్రామం నుంచి విశ్వవిద్యాలయం వరకు విద్య విస్తరణే లక్ష్యం.
• నైపుణ్యాలతో కూడిన విద్యకు ప్రాధాన్యం.
• ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

హైదరాబాద్‌, మహా:

విద్య ద్వారానే సమాజంలో శాశ్వత మార్పు సాధ్యమవుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రతి కుటుంబం, ప్రతి సామాజిక వర్గం అభివృద్ధి చెందాలంటే విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సామాజికంగా వెనుకబడటానికి ప్రధాన కారణాల్లో విద్యకు దూరంగా ఉండటం కూడా ఒకటని, మారుతున్న ప్రపంచ అవసరాలకు అనుగుణంగా విద్యా విధానంలో సమూల మార్పులు రావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో విద్యను విస్తరించడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు కీలక పాత్ర పోషించాయని రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రతి గూడెంలో సింగిల్‌ టీచర్‌ పాఠశాలల ఏర్పాటుతో పాటు ప్రతి నివాస ప్రాంతానికి ప్రాథమిక విద్యను చేరువ చేశామని తెలిపారు. ప్రతి 3 కిలోమీటర్లకు ప్రాథమిక పాఠశాల, ప్రతి 5 కిలోమీటర్లకు మాధ్యమిక స్థాయి పాఠశాల, ప్రతి 10 కిలోమీటర్లకు ఉన్నత పాఠశాల అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వివరించారు.

విద్యా వ్యవస్థను గ్రామ స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు విస్తరించేందుకు పలు చర్యలు తీసుకున్నామని సీఎం పేర్కొన్నారు. ప్రతి మండలంలో జూనియర్‌ కళాశాల, ప్రతి నియోజకవర్గంలో డిగ్రీ కళాశాల, ప్రతి రెవెన్యూ డివిజన్‌లో ఇంజినీరింగ్‌ కళాశాల, ప్రతి జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటు చేశామని తెలిపారు. ఆదిలాబాద్‌ నుంచి భద్రాద్రి కొత్తగూడెం వరకు గిరిజన ప్రాంతాల్లో విద్యా అవకాశాలను విస్తరించామని, ఆదివాసీ గూడేల్లోనూ విద్యను అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు.

2004 తర్వాత అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పలు విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు చర్యలు జరిగాయని రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు. విద్యను సామాజిక అభివృద్ధికి ప్రధాన సాధనంగా భావించిన ప్రభుత్వాల విధానాల వల్లే ఉన్నత విద్యకు విస్తృత అవకాశాలు ఏర్పడ్డాయని అన్నారు.

చదువు మాత్రమే కాదు.. నైపుణ్యమూ కావాలి

ప్రస్తుతం ప్రపంచం వేగంగా మారుతున్న నేపథ్యంలో కేవలం పట్టాలు అందించే విద్య సరిపోదని రేవంత్‌రెడ్డి అన్నారు. విద్యార్థులకు ఉద్యోగం, ఉపాధి, స్వయం ఉపాధికి అవసరమైన సాంకేతిక నైపుణ్యాలను అందించే విధానం అవసరమని పేర్కొన్నారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో జ్ఞానం, సాంకేతిక అవగాహన, నైపుణ్యాలను పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ విద్యా వ్యవస్థను దేశానికి ఆదర్శంగా నిలిపే దిశగా సంస్కరణలు చేపడుతున్నామని తెలిపారు. కొడంగల్‌లో ఇటీవల ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలోనూ నాణ్యమైన విద్య, సాంకేతిక నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలకు అనుసంధానమైన విద్యపై సీఎం ఇదే దిశలో మాట్లాడారు.

తెలంగాణ విద్యా వ్యవస్థలోని లోటుపాట్లను గుర్తించి అవసరమైన సంస్కరణలకు మార్గం చూపేందుకు విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేశామని రేవంత్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 2024 సెప్టెంబరు 4న తెలంగాణ విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేయగా, పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయాలు, సాంకేతిక విద్య వరకు విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం దాని ప్రధాన లక్ష్యాల్లో ఒకటిగా ఉంది.

అంబేడ్కర్‌ ఆలోచనలకు అనుగుణంగా..

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఆలోచనా విధానాన్ని అమలు చేయడంలో కాంగ్రెస్‌ ముందుంటుందని రేవంత్‌రెడ్డి అన్నారు. సామాజికంగా వెనుకబడిన వర్గాల జీవితాల్లో విద్య ద్వారా గణనీయమైన మార్పు తీసుకురావచ్చని పేర్కొన్నారు. పేదలు, అణగారిన వర్గాలు, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందితేనే సమాజంలో సమాన అవకాశాలు విస్తరిస్తాయని చెప్పారు.

విద్యాశాఖతో పాటు న్యాయశాఖ వంటి కీలక శాఖలను తాను స్వయంగా సమీక్షిస్తున్నట్లు సీఎం తెలిపారు. పేదలకు ప్రయోజనం చేకూర్చే నిర్ణయాలను వేగంగా తీసుకునేందుకే ముఖ్యమైన శాఖలను తన వద్ద ఉంచుకున్నానని వివరించారు. ముఖ్యమంత్రి స్థాయిలో సమీక్షలు నిర్వహించినప్పుడు ఉన్నతాధికారులు అందుబాటులో ఉండటంతో నిర్ణయాలను త్వరగా అమలు చేసే అవకాశం ఉంటుందని చెప్పారు.