Mahaa Daily Exclusive

  విద్యావ్యవస్థను కాంగ్రెస్‌ ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తోంది…

Share

విద్యావ్యవస్థను కాంగ్రెస్‌ ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తోంది.
• రూ.15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి.
• 21 వేలకుపైగా బడులు శిథిలావస్థలో ఉన్నాయి.
• బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి.

హైదరాబాద్‌, మహా.

తెలంగాణ విద్యావ్యవస్థపై కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తీవ్రంగా విమర్శించారు. శాసనసభలో విద్యాశాఖ పద్దులపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. పాఠశాల విద్య నుంచి ఉన్నత విద్య వరకు అనేక సమస్యలు పేరుకుపోయాయని ఆరోపించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, కళాశాలల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

తెలంగాణలో విద్యకు బడ్జెట్‌లో కేవలం 8.2 శాతం మాత్రమే కేటాయిస్తున్నారని మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు. 2026–27 బడ్జెట్‌లో విద్యారంగానికి రూ.26,674 కోట్లు, మొత్తం బడ్జెట్‌లో 8.22 శాతం కేటాయించినట్లు రాష్ట్ర ప్రభుత్వ అధికారిక సమాచారం చెబుతోంది. విద్యకు ఏటా కేటాయింపులు పెంచి 15 శాతం వరకు తీసుకెళ్లాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గతంలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో బడ్జెట్‌ కేటాయింపులు సరిపోతున్నాయా, విద్యా రంగ అవసరాలకు అనుగుణంగా ఖర్చు జరుగుతోందా అన్న అంశంపై సభలో రాజకీయ వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి.

ఫీజు బకాయిలపై తీవ్ర ఆగ్రహం

ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీజేపీ నేత డిమాండ్‌ చేశారు. దాదాపు రూ.15 వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయని, దీని ప్రభావంతో విద్యార్థులు, కళాశాలలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. ఈ మొత్తంపై బీజేపీ ఇప్పటికే గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లాను కలిసి జోక్యం చేసుకోవాలని కోరింది. దాదాపు 40 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన అంశంగా బీజేపీ దీనిని ప్రస్తావిస్తోంది.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల విడుదల కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావుతో కలిసి తాము విద్యార్థుల సంతకాలతో వినతిపత్రం సమర్పించేందుకు వెళ్లినప్పుడు పోలీసులు అరెస్టు చేయడాన్ని మహేశ్వర్‌రెడ్డి తప్పుబట్టారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం వారి తరఫున ప్రశ్నిస్తున్న వారిని అడ్డుకోవడం సరికాదని అన్నారు.

పాలిటెక్నిక్‌ విద్యార్థులకు సంబంధించిన జీవో 97ను వెంటనే రద్దు చేయాలని, విద్యార్థుల ఆందోళనలపై పోలీసుల చర్యలను నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. జీవో 97 ఉపసంహరణ, విద్యార్థుల బకాయిల చెల్లింపు అంశాలపై శుక్రవారం అసెంబ్లీ సమీపంలో విద్యార్థి సంఘాల ఆందోళనలు, పోలీసుల నిర్బంధాలు కూడా చోటుచేసుకున్నాయి.

బడుల్లో కనీస వసతులపై ప్రశ్నలు

ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో మౌలిక వసతుల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని మహేశ్వర్‌రెడ్డి అన్నారు. తాగునీరు, మరుగుదొడ్లు, భవనాల నిర్వహణ వంటి ప్రాథమిక అవసరాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. 21 వేలకు పైగా పాఠశాలలు శిథిలావస్థలో ఉన్నాయని, అనేక బడుల్లో విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు లేవని ఆయన ఆరోపించారు. కేంద్ర విద్యా మంత్రిత్వశాఖకు చెందిన పాఠశాల విద్యా సమాచార వ్యవస్థ గణాంకాలను ఆధారంగా చేసుకుని రాష్ట్రంలోని పాఠశాలల పరిస్థితిపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు.

గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో ఆహార నాణ్యత, భద్రతకు సంబంధించి చోటుచేసుకున్న ఘటనలను కూడా ఆయన ప్రస్తావించారు. విద్యార్థుల ప్రాణాలకు ముప్పు కలిగించే పరిస్థితులు పునరావృతం కాకుండా వసతిగృహాలు, పాఠశాలల్లో పటిష్ఠమైన పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.

ఉన్నత విద్యలో ఖాళీలపై ఆందోళన

బాసర ట్రిపుల్‌ ఐటీకి అవసరమైన నిధులు పూర్తిస్థాయిలో విడుదల చేయడం లేదని మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. అధ్యాపకుల కొరతతో విద్యార్థుల బోధనపై ప్రభావం పడుతోందని పేర్కొన్నారు. రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో భారీగా అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయని, జిల్లా విద్యాశాఖల్లోనూ అధికారుల కొరత ఉందని తెలిపారు. మోడల్‌ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ప్రధానోపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయాలని కోరారు.

అధ్యాపక ఖాళీలను తక్షణమే భర్తీ చేయడంతో పాటు ఉపాధ్యాయుల బదిలీలు, జీవో 317 సమస్య, భార్యాభర్తల బదిలీలు, వేతన సవరణ అంశాలను పరిష్కరించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఉపాధ్యాయులకు 53 శాతం ఫిట్‌మెంట్‌ అమలు చేయాలని కోరారు.

విద్యార్థులకు సంబంధించిన సమస్యలను కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం చేయకుండా ప్రభుత్వం శాశ్వత పరిష్కారాల దిశగా చర్యలు తీసుకోవాలని మహేశ్వర్‌రెడ్డి సూచించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల విడుదల, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, అధ్యాపక ఖాళీల భర్తీ, ఉన్నత విద్యాసంస్థలకు నిధుల సమకూర్పు వంటి అంశాలపై ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.