Mahaa Daily Exclusive

  గ్రామాల విలీనంపై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరణ…ఏపీ ప్రభుత్వానికి నోటీసులు…

Share

అమరావతి, మహా.
ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని గ్రామాలను సమీప మున్సిపాలిటీల్లో ఏకపక్షంగా విలీనం చేశారంటూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. మున్సిపాలిటీలలో గ్రామాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై బుధవారం విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం, ఈ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ అరాధేలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కీలక వ్యవహారంపై ఇరుపక్షాల వాదనలు వింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలపై తక్షణమే స్టే ఇవ్వడానికి నిరాకరించిన ధర్మాసనం, మున్సిపాలిటీలలో ఈ గ్రామాల విలీన ప్రక్రియ అంతా సుప్రీంకోర్టు వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటుందని స్పష్టం చేసింది.
ఈ విచారణలో పిటిషనర్లు ఎద్దుల సుబ్బారెడ్డి, వల్లేపల్లి వెంకట సుబ్రహ్మణ్యం తరఫున సీనియర్ న్యాయవాది రామకృష్ణ ప్రసాద్ వాదనలు వినిపించగా, ఏపీ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు హాజరయ్యారు. చట్టబద్ధమైన నిబంధనలు పాటించకుండా ప్రభుత్వం ఏకపక్షంగా జీవోలు జారీ చేసిందన్నది పిటిషనర్ల ప్రధాన ఆరోపణ. గ్రామాలను మున్సిపాలిటీల్లో విలీనం చేసే సమయంలో కనీసం స్థానిక గ్రామ పంచాయతీల తీర్మానాలు కానీ, గ్రామస్థుల ఆమోదం కానీ తీసుకోలేదని వారు న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీల్లో విలీనం కావడం వల్ల మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వంటి ఎన్నో కీలకమైన గ్రామీణ సంక్షేమ పథకాలను పేదలు కోల్పోవాల్సి వస్తుందని, అలాగే స్థానిక స్వపరిపాలన హక్కులు తీవ్రంగా దెబ్బతింటాయని పిటిషనర్ల తరఫు న్యాయవాది ఆందోళన వ్యక్తం చేశారు.
అయితే, రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. పట్టణాల విస్తరణ, పెరుగుతున్న జనాభా ప్రాతిపదికన అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేసి ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించే ఉద్దేశంతోనే పూర్తి చట్టానుసారంగా ఈ విలీన ప్రక్రియను చేపట్టామని వాదించారు. పైగా, ఈ వివాదంపై ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చిందని గుర్తుచేశారు. ఇరువర్గాల వాదనలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు, హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో మధ్యంతర స్టే ఇచ్చేందుకు నిరాకరిస్తూనే, ఈ ప్రక్రియకు సంబంధించిన చట్టబద్ధత అంతా తమ తుది తీర్పుపై ఆధారపడి ఉంటుందని ప్రకటిస్తూ ఏపీ సర్కార్‌కు నోటీసులు జారీ చేసింది.