Mahaa Daily Exclusive

  ఏపీలో మొదలైన ఎన్నికల హింస….

Share

  • ఏపీలో మొదలైన ఎన్నికల హింస
  • పుంగనూరు, రాయచోటిలో టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
  • గాల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు
  • రాళ్లదాడిలో పలు వాహనాలు ధ్వంసం
  • ఎస్‌ఎన్‌ కాలనీలో వాహనాలకు నిప్పు

పుంగనూరు/ రాయచోటి, మహా : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల తొలిరోజే తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అన్నమయ్య జిల్లా పుంగనూరు, రాయచోటిలలో నామినేషన్లు దాఖలు చేసేందుకు వైఎస్సార్‌సీపీ, టీడీపీ వర్గాలు ఒకేసారి నామినేషన్ కేంద్రానికి వెళ్తుండగా ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ క్రమంలో ఇరుపక్షాలు ఒకరిపై ఒకరు రాళ్లదాడికి దిగడంతో పరిస్థితి అదుపుతప్పి రణరంగంగా మారింది. ఈ దాడిలో పలు వాహనాల అద్దాలు ధ్వంసమవ్వగా, ఇరువర్గాలకు చెందిన పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు గాల్లోకి గాల్పులు జరపాల్సి వచ్చింది.

వైసీపీ దాడుల్లో వాహనాలు ధ్వసం..

టీడీపీ నేత మధురాయల్ (మధు రెడ్డెప్ప రాయల్) పై వైఎస్సార్ సీపీ ఎంపీ మిథున్ రెడ్డి అనుచరులు దాడికి పాల్పడినట్లు పార్టీ శ్రేణులు ఆరోపించాయి. పోలీసులతో పాటు టీడీపీ అభ్యర్థులపై వైసీపీ వర్గీయులు దాడికి తెగబడ్డాయని, వారి దాడిలోనే వాహనాలు ధ్వంసమయ్యాయని వారు పేర్కొన్నారు. ఇరువర్గాల పోటాపోటీ ఆరోపణలు, రాళ్లదాడి ఘటనలతో పుంగనూరు పరిసర ప్రాంతాల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతుండగా, పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

గేట్లు ఢీకొడుతూ మిథున్ రెడ్డి వర్గీయులు హల్ చల్

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తన అనుచరులతో కలిసి నామినేషన్ కేంద్రానికి వెళ్తున్న సమయంలో వాహనాలపై టీడీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వారని ఆరోపించారు. తీవ్ర ఉద్రిక్తతల నడుమ ఎంపీ మిథున్ రెడ్డి, ఇతర వైసీపీ నేతలు నామినేషన్ కార్యాలయంలోకి వెళ్లారు. గేట్లను వాహనంతో ఢీకొడుతూ దూసుకెళ్లారని టీడీపీ నాయకులు తెలిపారు. వారిని అడ్డుకునేందుకు టీడీపీ కార్యకర్తలు యత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. దాంతో పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు.

రాయచోటిలోనూ రణరంగం..

అన్నమయ్య జిల్లా రాయచోటిలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ తీవ్ర హింసాత్మకంగా మారింది. రాయచోటిలోని ఎస్ఎన్ కాలనీలో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఒక్కసారిగా ఘర్షణ తలెత్తింది. ఇరువర్గాల నాయకులు, కార్యకర్తలు రాళ్లు, కర్రలతో పరస్పరం దాడులు చేసుకోవడంతో ఆ ప్రాంతమంతా రణరంగంగా మారింది. ఈ ఘర్షణల్లో సుమారు 15 కార్లు తీవ్రంగా ధ్వంసమవ్వగా, 4 కార్లకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో అవి పూర్తిగా దగ్ధమయ్యాయి. ఇదే సమయంలో రాయచోటిలోని వైసీపీ కార్యాలయం వద్ద నిలిపి ఉంచిన వాహనాలకు కూడా నిప్పు పెట్టడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నామినేషన్ల వేళ ఒకేసారి భారీగా తరలిరావడం, పరస్పర దాడులకు పాల్పడటంతో అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు రంగంలోకి దిగి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.