Mahaa Daily Exclusive

  రాష్ట్రాన్ని జంగిల్‌ రాజ్‌లా మార్చారు…

Share

  • రాష్ట్రాన్ని జంగిల్‌ రాజ్‌లా మార్చారు
  • పుంగనూరు దాడి ఘటనపై జగన్ తీవ్ర ఆగ్రహం
  • ఎంపీ మిథున్‌రెడ్డికి ఫోన్ చేసి పరామర్శించిన జగన్
  • ఏపీలో లా అండ్ ఆర్డర్ క్షీణించిందని జగన్ విమర్శ

విజయవాడ, మహా : ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ అరాచకాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోందని వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పూడ్చిపెట్టి ‘జంగిల్ రాజ్’ పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ లోక్‌సభ పక్ష నేత, రాజంపేట ఎంపీ మిథున్‌ రెడ్డిపై శుక్రవారం జరిగిన దాడి ఘటనపై జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనంతరం ఆయన ఎంపీ మిథున్‌రెడ్డికి స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. పుంగనూరు పర్యటనలో జరిగిన దాడి వివరాలను, అక్కడ నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను అడిగి తెలుసుకుని ఎంపీకి ధైర్యం చెప్పారు.

ఓటమి భయంతోనే

ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను సజావుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించడం ఎంతమాత్రం ఇష్టం లేదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నరేళ్ల పరిపాలన పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని, దాంతో ఓటమి భయంతోనే వైఎస్సార్‌సీపీ నాయకులు, పోటీ చేస్తున్న అభ్యర్థులపై భౌతిక దాడులు, బెదిరింపులకు ఒడిగడుతున్నారని విమర్శించారు. “హింసాత్మక రాజకీయం చేయడం చంద్రబాబుకు కొత్తేమీ కాదు. ఆయన రాష్ట్రాన్ని పూర్తిగా జంగిల్ రాజ్‌లా మార్చేశారు,” అని జగన్ తీవ్రంగా ఆక్షేపించారు.

ఎంపీకే రక్షణ లేదు

రాష్ట్రంలో శాంతిభద్రతల వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందని మాజీ సీఎం ధ్వజమెత్తారు. చివరకు లోక్‌సభలో ఒక పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్న ఎంపీకే రక్షణ లేని పరిస్థితులు ఉన్నాయంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు తన అధికార దుర్వినియోగానికి తెగబడుతూ, ఎన్నికల్లో అక్రమాలు చేయడానికి పోలీసు వ్యవస్థను వాడుకుంటున్నారని ఆరోపించారు. కళ్లముందే దాడులు జరుగుతున్నా పోలీసులు చేష్టలుడిగి నిస్తేజంగా ఉండిపోతున్నారని మండిపడ్డారు. ఈ అన్యాయాలు, అక్రమాలను వైఎస్సార్‌సీపీ సమర్థవంతంగా ఎదుర్కొంటుందని జగన్ స్పష్టం చేశారు. తమ పార్టీ చట్టపరంగా, రాజ్యాంగబద్ధంగా అన్ని రకాలుగా పోరాటం చేస్తుందని తెలిపారు. పార్టీ శ్రేణులంతా ధైర్యం, సహనం మరియు పట్టుదలతో ఈ పరిస్థితులను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రభుత్వం సాగిస్తున్న అక్రమాలు, పోలీసుల పక్షపాత వైఖరి పరిస్థితులను ఆధారాలతో సహా కోర్టుల ముందు ఉంచుతామని వెల్లడించారు. రాష్ట్రంలో పారామిలటరీ బలగాల పర్యవేక్షణలో ఎన్నికలు నిర్వహించినప్పుడే పారదర్శకంగా, సజావుగా సాగుతాయని, ఇదే డిమాండ్‌ను న్యాయస్థానాల దృష్టికి తీసుకెళ్తామని జగన్ పేర్కొన్నారు. తమది ప్రజలకు సంక్షేమం, మంచి చేసిన చరిత్ర అని, కానీ చంద్రబాబుది మాత్రం హింస, విధ్వంసాల చరిత్ర అని ఆయన వ్యాఖ్యానించారు.