Mahaa Daily Exclusive

  సూర్యాపేటలో గ్యాస్ సిలిండర్ పేలుడు..! సూపర్ మార్కెట్ అగ్నికి ఆహుతి..

Share

  • సూర్యాపేటలో గ్యాస్ సిలిండర్ పేలుడు
  • సూపర్ మార్కెట్ అగ్నికి ఆహుతి
  • భారీగా చోటు చేసుకున్న ఆస్తి నష్టం

సూర్యపేట, మహా : సూర్యాపేట పట్టణంలో దసరా పండుగ వేళ భారీ పేలుడు సంభవించడం కలకలం రేపింది. స్థానిక పీఎస్‌ఎస్ఆర్ సెంటర్ సమీపంలోని శ్రీసాయి సూపర్ మార్కెట్‌లో మంగళవారం గ్యాస్ సిలిండర్ పేలడంతో భవనం తీవ్రంగా ధ్వంసమైంది. పేలుడు ధాటికి భారీ శబ్దం రావడంతో పరిసర ప్రాంతాల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏం జరిగిందో తెలియక భయాందోళనలకు గురై ఇళ్ల నుంచి, దుకాణాల నుంచి బయటకు పరుగులు తీశారు. పండుగ వేళ చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది.

ప్రాథమిక అంచనాల ప్రకారం.. గ్యాస్ లీకేజీ కారణంగానే సిలిండర్ పేలి ఉండవచ్చునని భావిస్తున్నారు. పేలుడు తీవ్రతకు సూపర్ మార్కెట్ భవనానికి భారీ నష్టం వాటిల్లింది. దుకాణంలోని వస్తువులు, ఇతర సామగ్రి కూడా దెబ్బతిన్నాయి. ఈ ఘటనతో వ్యాపార ప్రాంతంలో చోటు చేసుకోవటంతో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. పేలుడు శబ్దం చాలా దూరం వరకు వినిపించడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు.

ప్రమాదం కారణంగా తమకు భారీగా ఆస్తి నష్టం జరిగిందని సూపర్ మార్కెట్ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు. పండుగ సమయంలో వ్యాపారం జరుగుతున్న వేళ ఈ ఘటన చోటు చేసుకోవడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి వివరాలు సేకరించారు. ఘటనకు దారితీసిన పరిస్థితులపై విచారణ ప్రారంభించారు. గ్యాస్ సిలిండర్ నుంచి లీకేజీ జరిగిందా, సిలిండర్ పేలడానికి ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరిగపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తాజా ప్రమాదం నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ల వినియోగం, నిల్వ, భద్రతా ప్రమాణాలపై మరోసారి చర్చ మొదలైంది. ముఖ్యంగా దుకాణాలు, వాణిజ్య సముదాయాల్లో గ్యాస్ పరికరాలను ఉపయోగించే సమయంలో లీకేజీలను ముందుగానే గుర్తించడం, సిలిండర్లను సురక్షితంగా ఉంచడం, ప్రమాద నివారణ చర్యలు పాటించడం ఎంత ముఖ్యమో ఈ ఘటన గుర్తుచేస్తోంది. కాగా, రెండ్రోజుల క్రితం హైదరాబాద్ మదీనా సమీపంలోనూ భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బట్టల గోదాంలో మంటలు చెలరేగి క్షణాల్లోనే బట్టలు కాలి బూడిదయ్యాయి. ఈ ఘటనలోనూ భారీగా ఆస్తి నష్టం చోటు చేసుకుంది.