Mahaa Daily Exclusive

  సుప్రీం కోర్టులో వైసీపీకి ఊరట..! నామినేసన్లపై ధర్మాసనం కీలక ఆదేశాలు..

Share

  • సుప్రీం కోర్టులో వైసీపీకి ఊరట
  • నామినేసన్లపై ధర్మాసనం కీలక ఆదేశాలు
  • నామినేషన్ల వేసేందుకు 48 గంటల గడువు
  • తుది జాబితాను ఈ నెల 25 వరకు ప్రకటించొద్దు

న్యూఢిల్లీ, మహా : ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల నామినేషన్లపై సుప్రీం కోర్టును ఆశ్రయించిన వైఎస్సార్‌సీపీకి ఊరట దక్కింది. మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్లకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల్ని పారదర్శకంగా నిర్వహించాలని.. అభ్యర్థులకు రక్షణ కల్పించాలని ఆదేశించింది. నామినేషన్లు దాఖలు చేయలేనివారి విజ్ఞప్తుల్ని పరిశీలించి.. వారి కోసం గురువారంలోగా నిర్ణయం తీసుకోవాలని సూచించింది. మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల దాఖలు చేసేందుకు గడువును పెంచేలా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై ఇవాళ సుప్రీం కోర్టు ధర్మాసనం విచారణ జరిపింది.

అలాగే నామినేషన్లకు సంబంధించి అభ్యర్థులు, పిటిషనర్లు సమర్పించిన విజ్ఞప్తులకు ఎలక్ట్రానిక్ ఆధారాలను పరిశీలించాలని సుప్రీం కోర్టు సూచించింది. 22 వ తేదీలోగా నిర్ణయం తీసుకోవాలని.. నామినేషన్లు దాఖలు చేసేందుకు గడువు పొడిగిస్తే, నిర్ణయం ప్రచురించినప్పటి నుంచి అభ్యర్థులకు నామినేషన్ వేయడానికి కనీసం 48 గంటల సమయం ఇవ్వాలని ఆదేశించింది. జిల్లా కేంద్రాల్లో నామినేషన్లకు అవకాశం ఇవ్వాలని సూచించింది. అభ్యర్థుల తుది జాబితాను ఈ నెల 25 వరకు ప్రకటించొద్దని ఆదేశించింది. అర్హులైన అభ్యర్థులందరికీ స్వేచ్ఛగా, న్యాయంగా పోటీ చేసే అవకాశం కల్పించేలా తగిన నిర్ణయాలు తీసుకోవాలని ఎస్ఈసీకి సూచించింది. నామినేషన్ వేసే అభ్యర్థులకు తగిన పోలీసు బందోబస్తు, సీసీటీవీ కవరేజ్, రక్షణ కల్పించాలని డీజీపీని ఆదేశించింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది.

ఎన్నికల సమయంలో ఎలాంటి ఒత్తిళ్లు, అడ్డంకులు లేకుండా నామినేషన్లు దాఖలు చేసే పరిస్థితులు ఉండాలని సుప్రీం కోర్టు శాంతిభద్రతలను కాపాడటంతో పాటుగా స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలు నిర్వహించడం రాజ్యాంగబద్ధమైన బాధ్యతని అభిప్రాయపడింది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ఎస్ఈసీ పర్యవేక్షించాలని.. తాము జారీ చేసే ఉత్తర్వుల అమలుకు సంబంధించిన నివేదికను సమర్పించాలని ఆదేశించింది. నామినేషన్ల దాఖలును అడ్డుకుంటుంటే చూస్తూ ఊరుకోలేమని, న్యాయసమీక్షాధికారం కింద ఈ వ్యవహారంలో ఎన్నికల సంఘానికి తగిన ఆదేశాలు జారీ చేస్తున్నామని ధర్మాసనం తెలిపింది. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగాలని.. అభ్యర్థులందరికీ సమాన అవకాశాలు కల్పిస్తూ వారు స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసే అవకాశం కల్పించాలంది. స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణ కోసం అవసరమైన సందర్భాల్లో కోర్టులుతగిన ఆదేశాలు జారీ చేస్తాయని వ్యాఖ్యానించింది.

మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకున్నారంటూ వైఎస్సార్‌సీపీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. నామినేషన్ దాఖలుకు గడువు పొడిగించాలని.. నామినేషన్ కేంద్రాల దగ్గర ప్రక్రియను వీడియోగ్రఫీ చేసేలా ఎస్ఈసీని ఆదేశించాలని కోరింది. అలాగే ఏకగ్రీవ ఎన్నికపై స్టే ఇవ్వాలని కోరింది.. ఈ మేరకు విచారణ జరిపిన సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.