- బరి నుంచి తప్పుకున్న పులిచెర్ల రాజేశ్వరి!
- టీడీపీలో సముచిత స్థానం కల్పిస్తామని వీఎంఆర్డీఏ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ హామీ.
గాజువాక ,మహా.
మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) ఎన్నికల వేళ గాజువాక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే దివంగత పల్లా సింహాచలం కుమార్తె, టీడీపీ మాజీ కౌన్సిలర్ పులిచెర్ల రాజేశ్వరి ఎట్టకేలకు మెత్తబడ్డారు. కూటమి అగ్రనేతల బుజ్జగింపులు ఫలించడంతో ఆమె పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించారు. గురువారం వీఎంఆర్డీఏ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్, సీనియర్ నేత ప్రగడ (ప్రక్కుర్తి) మురళి తదితరులు గాజువాకలోని పులిచెర్ల రాజేశ్వరి నివాసానికి వెళ్లి ఆమెతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
పార్టీలో సముచిత గౌరవం దక్కుతుంది..
పార్టీ ప్రయోజనాలు, కూటమి ధర్మాన్ని దృష్టిలో ఉంచుకుని నామినేషన్ ఉపసంహరించుకోవాలని ప్రణవ్ గోపాల్, మురళి ఆమెను కోరారు. పల్లా సింహాచలం కుటుంబానికి తెలుగుదేశం పార్టీతో ఉన్న సుదీర్ఘ అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. పార్టీ అధిష్టానం దృష్టికి ఆమె సేవలను తీసుకెళ్తామని, రాబోయే రోజుల్లో టీడీపీలో ఆమెకు తగిన గుర్తింపు, సముచిత పదవి కల్పిస్తామని ప్రణవ్ గోపాల్ స్పష్టమైన హామీ ఇచ్చారు. కూటమి నేతల హామీతో సంతృప్తి చెందిన పులిచెర్ల రాజేశ్వరి.. పార్టీ ఆదేశాలకు కట్టుబడి తన నామినేషన్ను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. కూటమి అభ్యర్థి గెలుపు కోసం తమ వంతు కృషి చేస్తామని స్పష్టం చేశారు.
అభివృద్ధికి పట్టం కట్టండి: ప్రణవ్ గోపాల్.
అనంతరం వీఎంఆర్డీఏ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ మీడియాతో మాట్లాడుతూ.. గడిచిన రెండేళ్లలో కూటమి ప్రభుత్వం విశాఖపట్నం అభివృద్ధికి పెద్దపీట వేసిందని, నగరాన్ని దేశంలోనే అత్యున్నత స్థానానికి తీసుకువెళ్లిందని తెలిపారు. యువతకు ఉపాధి కల్పించేలా ప్రతిష్టాత్మకమైన ‘గూగుల్ డేటా సెంటర్’ వంటి ఐటీ దిగ్గజాలను విశాఖకు తీసుకురావడంతో పాటు, పర్యాటక రంగాన్ని కొత్త పుంతలు తొక్కించామని పేర్కొన్నారు. ముఖ్యంగా కైలాసగిరిపై పర్యాటకులను ఆకట్టుకునేలా నిర్మించిన అద్భుతమైన ‘గ్లాస్ బ్రిడ్జి’, భారీ త్రిశూలం వంటి ప్రాజెక్టులతో విశాఖ పర్యాటక శోభ మరింత పెరిగిందన్నారు.
విశాఖ నగరాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు మరోసారి ఆశీర్వదించాలని ఆయన కోరారు. నగర సమగ్రాభివృద్ధి మరింత వేగంగా కొనసాగాలంటే జీవీఎంసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించి, కూటమి మేయర్ అభ్యర్థిని పీఠంపై కూర్చోబెట్టాలని విశాఖ ప్రజలకు ప్రణవ్ గోపాల్ విజ్ఞప్తి చేశారు.








