- ‘ఓట్ల చోరీ’ ఆరోపణల వెనుక చొరబాటుదారులను కాపాడే కుట్ర: అమిత్ షా ధ్వజం.
న్యూఢిల్లీ,మహా.
“రాహుల్ బాబా.. నా మాటలు రాసిపెట్టుకోండి. మీరు అనుసరిస్తున్న వ్యతిరేక, విచ్ఛిన్నకర రాజకీయాల వల్ల రాబోయే 30 ఏళ్లలో కూడా కాంగ్రెస్ పార్టీకి గానీ, మీకు గానీ దేశంలో అధికారం దక్కే ప్రసక్తే లేదు” అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బూత్ స్థాయి కార్యకర్త నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరకు బీజేపీ శ్రేణులు నిరంతరం ప్రజల మధ్యే ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నాయని, అందుకే ప్రజలు బీజేపీకి పట్టం కడుతున్నారని స్పష్టం చేశారు. గురువారం తన 62వ పుట్టినరోజు సందర్భంగా న్యూఢిల్లీలోని ద్వారకలో రూ. 8,941 కోట్ల విలువైన 43 యమునా నది పునరుద్ధరణ, తాగునీటి ప్రాజెక్టులకు అమిత్ షా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ లక్ష్యంగా నిప్పులు చెరిగారు.
చొరబాటుదారుల ఓట్ల కోసమే ‘ఓట్ చోరీ’ డ్రామా!
ఇటీవల బీజేపీ వరుసగా ఎన్నికల్లో గెలుస్తుండటంతో జీర్ణించుకోలేని రాహుల్ గాంధీ, ఆయన బృందం ‘ఓట్ చోరీ’ (ఓట్ల దొంగతనం) అంటూ కొత్త డ్రామాకు తెరలేపారని అమిత్ షా మండిపడ్డారు. “బీజేపీ మరో 30 ఏళ్లు అధికారంలో ఉంటుందని నేను చెబితే.. అమిత్ షాకు ముందే ఫలితాలు ఎలా తెలుస్తాయని రాహుల్ అడుగుతున్నారు. నేను ఈ మట్టిలోనే పుట్టాను, ఇక్కడే పెరిగాను, ఇక్కడే మరణిస్తాను. రాహుల్ లాగా ప్రతి ఆరు నెలలకోసారి విదేశాలకు చెక్కేయను. ప్రజల మధ్య ఉంటాను కాబట్టే ప్రజానాడి నాకు తెలుసు” అని షా చురకలు అంటించారు.
వాస్తవానికి ఓట్ల చోరీ ఆరోపణల మాటున దేశంలోకి అక్రమంగా చొరబడిన విదేశీయులు, వలసదారుల ఓటు హక్కును కాపాడేందుకు రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నారని, ఈ కుట్రను దేశ ప్రజలందరూ గమనిస్తున్నారని ఆరోపించారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం రాకముందే గుజరాత్, బెంగాల్, తమిళనాడు, బీహార్ వంటి అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ తన ఉనికిని కోల్పోయిందని గుర్తుచేశారు.
అనుకూలంగా వస్తే న్యాయం.. లేదంటే రాజ్యాంగ సంస్థలపై దాడా?
రాహుల్ గాంధీ ద్వంద్వ ప్రమాణాలను అమిత్ షా తీవ్రంగా ఎండగట్టారు. “మీరు తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, కేరళలో గెలిచినప్పుడు, తమిళనాడులో మీ మిత్రపక్షం గెలిచినప్పుడు ఇవే ఓటర్ల జాబితా, ఇదే ఎన్నికల సంఘం (ఈసీ), ఇవే ఈవీఎంలు గొప్పగా కనిపించాయి. కానీ మీరు ఓడిపోయిన చోట మాత్రం ఈసీ పనితీరు నచ్చదు. న్యాయస్థానాలు మీకు అనుకూలంగా తీర్పు ఇస్తే న్యాయం గెలిచిందంటారు.. అదే వ్యతిరేకంగా తీర్పు వస్తే ఏకంగా కోర్టులనే ప్రశ్నిస్తారు. ఇటువంటి ద్వంద్వ ప్రమాణాలు ఇక చెల్లవు రాహుల్ జీ! పొరుగు రాష్ట్రాల నుంచి కార్యకర్తలను పోగేసి ఢిల్లీలో ఆందోళనలు చేసినంత మాత్రాన ప్రజలిచ్చిన తీర్పును తారుమారు చేయలేరు. ప్రస్తుతం మీరు ఏదో విదేశంలో కూర్చున్నారు కాబట్టి నా మాటలు వినపడకపోవచ్చు.. కానీ తిరిగి ఢిల్లీలో అడుగుపెట్టాక నా మాటలు గుర్తుంచుకోండి” అంటూ అమిత్ షా వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
2029 మే నాటికి స్వచ్ఛమైన యమునా నది!
అనంతరం ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్, కాంగ్రెస్ పార్టీలపై అమిత్ షా విమర్శలు గుప్పించారు. గడిచిన 30 ఏళ్లలో ఢిల్లీని పాలించిన కాంగ్రెస్, ఆప్ ప్రభుత్వాలు యమునా నదిని మురుగు కాలువగా మార్చేశాయని ధ్వజమెత్తారు. ప్రతిరోజూ 2,000 టన్నుల వ్యర్థాలను, మురుగునీటిని యమునా నదిలో వదిలేశారని ఆరోపించారు. అయితే ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రధాని మోదీ ఆదేశాలతో యమునా ప్రక్షాళనకు నడుం బిగించామన్నారు. హరియాణా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీలోని బీజేపీ ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని, సీఎం రేఖా గుప్తా, మంత్రి పర్వేశ్ వర్మ కృషితో రూ. 9 వేల కోట్ల ప్రాజెక్టులు పట్టాలెక్కాయని తెలిపారు. 2029 మే నాటికి యమునా నదిని పూర్తిగా ప్రక్షాళన చేసి, స్వచ్ఛమైన నదిని ప్రజలకు అందిస్తామని శపథం చేశారు.
పంజాబ్లో ఆప్ తుడిచిపెట్టుకుపోవడం ఖాయం!
ఢిల్లీలో అధికారం కోల్పోయిన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్లో మకాం వేసి, అక్కడి ముఖ్యమంత్రిని కూడా సక్రమంగా పనిచేయనివ్వకుండా పాలనను భ్రష్టు పట్టిస్తున్నారని అమిత్ షా ఆరోపించారు. ఆప్ పాలనలో పంజాబ్లో డ్రగ్స్ మాఫియా విచ్చలవిడిగా పెరిగిపోయిందని, యువత భవిష్యత్తు నాశనమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. “కేజ్రీవాల్ జీ.. సాకులు చెబితే సరిపోదు, ప్రజలకు ఫలితాలు కావాలి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయం. పంజాబ్ ప్రజలు ఎన్డీయే ప్రభుత్వాన్ని తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. 2029 నాటికి పంజాబ్లో డ్రగ్స్ మహమ్మారిని సమూలంగా అంతం చేస్తాం” అని అమిత్ షా తేల్చిచెప్పారు.







