- ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ఏ ఐ ఎస్ ఏ అధ్యక్షురాలు నేహా బోరా!
- సీపీజే నిరసనకు, తనకు ఎలాంటి సంబంధం లేదన్న నేహా న్యాయవాది.
న్యూఢిల్లీ , మహా.
ఢిల్లీలో ఇటీవల తీవ్ర కలకలం రేపిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) తిరంగా ర్యాలీ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. అక్టోబర్ 16న సీజేపీ చేపట్టిన ఆందోళనతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఐసా) అధ్యక్షురాలు నేహా బోరా స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా, ఆమె తరఫున ప్రముఖ సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ కోర్టులో కీలక వాదనలు వినిపించారు. పోలీసుల అక్రమ నిర్బంధాన్ని, వారు జారీ చేసిన నిబంధనల నోటీసులను సవాలు చేస్తూ దాఖలైన ఈ పిటిషన్ ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టులో విచారణ దశలో ఉంది.
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా అక్టోబర్ 16న సీజేపీ నేతలు కన్నాట్ ప్లేస్‌లోని సెంట్రల్ పార్క్‌లో ‘లెహ్రా దో తిరంగా’ యాత్రకు పిలుపునిచ్చారు. ఈ యాత్రకు అధికారులు అనుమతి ఇవ్వడంతో పాటు ఆ ప్రాంతంలో భారీగా భద్రతను మోహరించారు. అయితే, ముందస్తు నివారణ చర్యల పేరుతో సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కేతో పాటు ఐసా అధ్యక్షురాలు నేహా బోరాను కూడా పోలీసులు వేర్వేరు ప్రాంతాలలో అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అక్టోబర్ 17న అభిజీత్ దీప్కేను అరెస్ట్ చేసినట్లు ప్రకటించిన పోలీసులు, నేహా బోరాను విడుదల చేశారు.
విడుదలైనప్పటికీ, న్యూఢిల్లీ జిల్లా పోలీసు అధికారి (స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ – ఎస్ఈఎం) అక్టోబర్ 19న నేహా బోరాకు నోటీసులు జారీ చేశారు. విచారణ జరిగేంత కాలం శాంతిభద్రతలను కాపాడేలా రూ. 10,000 వ్యక్తిగత పూచీకత్తుపై సంతకం చేయాలని ఆ నోటీసులో ఆదేశించారు. భారతీయ నాగరిక్ సురక్షా సంహిత సెక్షన్ 126 కింద జారీ చేసిన ఈ నోటీసు పూర్తిగా వాస్తవాలకు విరుద్ధంగా, రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులైన 19, 21 అధికరణలను ఉల్లంఘించే విధంగా ఉందని పేర్కొంటూ నేహా బోరా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టులో నేహా బోరా తరఫున సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ వాదనలు వినిపిస్తూ పోలీసుల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. “అది పూర్తిగా చట్టవిరుద్ధమైన నిర్బంధం. సెంట్రల్ పార్క్‌లో సీజేపీ సంస్థ ఇచ్చిన నిరసన పిలుపుతో నేహా బోరాకు ఎలాంటి సంబంధం లేదు. ఆమె ఆ సమయంలో మండి హౌస్‌లో తన సొంత కార్యక్రమంలో బిజీగా ఉన్నారు. దురదృష్టవశాత్తు, ఆమెకు లాయర్లతో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా అర్ధరాత్రి ఆర్కే పురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు” అని కోర్టుకు వివరించారు. నేహా బోరాకు పోలీసులు జారీ చేసిన నోటీసును వెంటనే రద్దు చేయాలని, ఆమెపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా తగిన ఆదేశాలు జారీ చేయాలని ఆయన అభ్యర్థించారు.







