Mahaa Daily Exclusive

  త్వరలో ఆమరణ దీక్ష!

Share

  •  డంపింగ్‌ యార్డు దుస్థితిపై భావోద్వేగానికి గురైన ఎమ్మెల్యే మల్లారెడ్డి..

హైదరాబాద్, మహా.

మేడ్చల్ మల్కాజ్‌గిరి నియోజకవర్గంలోని జవహర్‌నగర్ డంపింగ్ యార్డు కారణంగా స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న నరకయాతనపై ఎమ్మెల్యే, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ప్రాంత ప్రజల దుస్థితిని చూసి చలించిపోయిన ఆయన భావోద్వేగానికి గురయ్యారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న డంపింగ్ యార్డును వెంటనే తరలించాలని డిమాండ్ చేస్తూ, త్వరలోనే తాను ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని ఆయన సంచలన ప్రకటన చేశారు.

జవహర్‌నగర్ తన నియోజకవర్గంలో ఉందని, అది తన గుండెకాయ వంటిదని మల్లారెడ్డి పేర్కొన్నారు. తాజాగా జవహర్‌నగర్ పరిస్థితులపై ఒక అమెరికన్ యూనివర్సిటీ విడుదల చేసిన సర్వే నివేదిక అత్యంత ఆందోళన కలిగిస్తోందని ఆయన తెలిపారు. ప్రపంచంలోనే అత్యధికంగా మీథేన్ విషవాయువులు ఉద్గారమవుతున్న ప్రాంతాల జాబితాలో జవహర్‌నగర్ ఏకంగా నాలుగో స్థానంలో నిలిచిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాణాంతక వాతావరణం కారణంగా ఆ ప్రాంతంలో రోజుకు ఇద్దరు చొప్పున వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మరణిస్తున్నారని, వారి అకస్మిక మృతికి అసలు కారణాలు ఏమిటో కూడా అంతుచిక్కడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా డంపింగ్ యార్డ్ నిర్వహణ బాధ్యతలు చూస్తున్న రాంకీ సంస్థ తీరుపై మల్లారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డంపింగ్ యార్డ్ నిర్వహణ కోసం 2006లో రాంకీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంటే, ఆ సంస్థ నిబంధనలను గాలికి వదిలేసిందని మండిపడ్డారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన సదరు సంస్థ, జవహర్‌నగర్ ప్రాంతాన్ని నివాసయోగ్యం కాకుండా ఒక విషవలయంగా మార్చిందని ధ్వజమెత్తారు.

ఈ తీవ్ర సమస్యపై మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ వెంటనే జోక్యం చేసుకోవాలని మల్లారెడ్డి కోరారు. కేంద్ర ప్రభుత్వంపై తగిన ఒత్తిడి తీసుకువచ్చి జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్‌ను తక్షణమే వేరే ప్రాంతానికి తరలించేలా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. స్థానిక ప్రజల ప్రాణాలను కాపాడేందుకు, వారి దీర్ఘకాలిక సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే వరకు తాను విశ్రమించనని, అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకైనా వెనుకాడబోనని మల్లారెడ్డి స్పష్టం చేశారు.