Mahaa Daily Exclusive

  వైద్య విద్యకు వన్నె తెచ్చిన ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ ఘనంగా రూబీ జూబ్లీ వేడుకలు!

Share

ఘనంగా రూబీ జూబ్లీ వేడుకలు!

విజయవాడ, మహా.

దేశంలోనే ప్రథమ వైద్య విశ్వవిద్యాలయంగా అరుదైన గుర్తింపు పొందిన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ స్థాపించి నాలుగు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రూబీ జూబ్లీ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) చేతుల మీదుగా 1986లో ప్రారంభమైన ఈ చారిత్రక విశ్వవిద్యాలయం.. గడచిన నాల్గు దశాబ్దాలుగా వైద్య విద్య, ఆరోగ్య రంగాల్లో దేశవ్యాప్తంగా ప్రత్యేక ముద్ర వేసుకుంది. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని విజయవాడలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కలావేదికలో అట్టహాసంగా వేడుకలు నిర్వహించనున్నారు.

ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి.. హాజరుకానున్న సీఎం చంద్రబాబు

విజయవాడ వేదికగా జరగనున్న ఈ రూబీ జూబ్లీ వేడుకలకు దేశ ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ వేడుకల్లో ప్రత్యక్షంగా పాల్గొననున్నారు. వీరితో పాటు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, మంత్రి కొలుసు పార్థసారథి, నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) చైర్మన్ రమేష్ తదితర ప్రముఖులు హాజరుకానున్నారు. ప్రముఖుల సమక్షంలో జరిగే ఈ వేడుకలు యూనివర్సిటీ ప్రస్థానంలో మరో సువర్ణ అధ్యాయంగా నిలవనున్నాయి.

దేశంలోనే తొలి వైద్య విశ్వవిద్యాలయంగా అగ్రస్థానం

నాటి నుంచి నేటి వరకు వైద్య విద్య అభివృద్ధి, విద్యార్థులకు అత్యుత్తమ విద్యావకాశాల కల్పన, ఆరోగ్య రంగానికి నైపుణ్యం గల వైద్యులను అందించడంలో విశ్వవిద్యాలయం అసాధారణ పాత్ర పోషించింది. ప్రస్తుతం ఈ వర్సిటీ పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 580 నుంచి 590 వరకు వైద్య కళాశాలలు విస్తరించి ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ వేడుకల్లో భాగంగా యూనివర్సిటీ గత 40 ఏళ్ల ప్రస్థానాన్ని, ఈ కాలంలో సాధించిన అపూర్వ ప్రగతిని ఘనంగా నెమరు వేసుకోనున్నారు.

భవిష్యత్ ప్రణాళికలపై ప్రత్యేక చర్చ

ఈ వేడుకల్లో సుమారు 200 మంది విశ్వవిద్యాలయ సిబ్బందితో పాటు వెయ్యి మందికి పైగా వైద్య విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొననున్నారు. గడచిన నాలుగు దశాబ్దాల విజయాల సమీక్షతో పాటు, భవిష్యత్తులో వైద్య విద్యను మరింత పటిష్టం చేయడానికి, ప్రపంచ స్థాయి ప్రమాణాలను అందుకోవడానికి చేపట్టాల్సిన చర్యలపై ఈ వేదికగా ప్రత్యేకంగా చర్చించనున్నారు. వర్సిటీ అభివృద్ధి లక్ష్యాలను నిర్దేశించుకుంటూ ముందుకు సాగేందుకు ఈ రూబీ జూబ్లీ వేడుకలు వేదిక కానున్నాయి.