Mahaa Daily Exclusive

  డిండి లిఫ్ట్ పేరుతో పాలమూరు రైతాంగానికి ద్రోహం.

Share

  •  కేసీఆర్ నాటి ఉరితాడును నేడు మరింత బిగిస్తోంది.
  •  డిండి ఎత్తిపోతలను తక్షణమే రద్దు చేయాలి.
  •  బీజేపీ ఎంపీ డీకే అరుణ తీవ్ర ఆగ్రహం!

హైదరాబాద్, మహా.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రైతాంగ ప్రయోజనాలను తాకట్టు పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై బీజేపీ జాతీయ నేత, మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి డీకే అరుణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పాలమూరు ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన రేవంత్ రెడ్డి, సొంత జిల్లా రైతాంగానికే ద్రోహం తలపెట్టడం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. నాడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాలమూరు మెడకు వేసిన ‘డిండి ఉరితాడు’ను నేడు సీఎం రేవంత్ రెడ్డి మరింత బిగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో అసలు భాగం కాని డిండి లిఫ్ట్‌ను తక్షణమే రద్దు చేయాలని డీకే అరుణ డిమాండ్ చేశారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి వచ్చే ప్రతి నీటి బొట్టూ ఉమ్మడి పాలమూరు జిల్లాకే దక్కాలని స్పష్టం చేశారు. నల్గొండ జిల్లాకు నీళ్లందించేందుకు ఎస్‌ఎల్‌బీసీ, పుట్టగండి లిఫ్ట్, నక్కలగండి వంటి అనేక ప్రత్యామ్నాయ మార్గాలు అందుబాటులో ఉన్నాయని, అలాంటప్పుడు పాలమూరు హక్కులను కాలరాయడం ఎందుకని నిలదీశారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును కాంగ్రెస్ హయాం నాటి జీవో 72 ప్రకారం జూరాల ఆధారిత పాత డిజైన్‌తోనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

గతంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ హయాంలో తాను మంత్రిగా ఉండి పాలమూరు జిల్లా ప్రయోజనాల కోసం జీవో 72ను తెచ్చిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ఆ డిజైన్లను మార్చి, జీవో 105, 107ల ద్వారా డిండి లిఫ్ట్ కోసం రోజుకు 0.5 టీఎంసీ తరలించే కుట్ర చేశారని విమర్శించారు. నాడే తాము దానిని తీవ్రంగా వ్యతిరేకించి అడ్డుకున్నామని, కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి అదే ఉరితాడును కొనసాగిస్తూ జిల్లాకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. డిండి ప్రాజెక్టు కాల్వల వల్ల దాదాపు 60 కిలోమీటర్ల మేర భూములు, 30కి పైగా గ్రామాలు ముంపునకు గురవుతున్నా స్థానిక కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. నల్గొండ నాయకులు తమ ప్రాంత ప్రయోజనాల కోసం ఏకమవుతుంటే, పాలమూరు ప్రతినిధులు తమ స్వప్రయోజనాల కోసం జిల్లా హక్కులను తాకట్టు పెడితే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

దశాబ్ద కాలంగా నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి, కోయిల్ సాగర్, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయని డీకే అరుణ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వచ్చి మూడేళ్లు గడుస్తున్నా రిజర్వాయర్లలో పూడిక తీయలేదని, మరమ్మతులు చేపట్టలేదని మండిపడ్డారు. పాలమూరు-రంగారెడ్డిని జూరాల నుంచి ప్రారంభించేలా నాటి అసలైన డీపీఆర్‌ను తిరిగి సమీక్షించాలని, పార్లమెంట్ పరిధిలోని ప్రతి నియోజకవర్గానికీ సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పాలమూరు రైతాంగ ప్రయోజనాల కోసం రాజీలేని ప్రజాపోరాటం నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.