• బెంగళూరు నివాసంలో పెళ్లికి జగన్ నిరాకరణ.
• భద్రతే ప్రధానమన్న జగన్.. లోటస్ పాండ్‌లో పెళ్లికి ఆహ్వానం.
• మేనకోడలి పెళ్లి వేళ సోదరికి జగన్ కీలక సూచనలు.
హైదరాబాద్, మహా.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమార్తె అంజలి వివాహ వేడుకకు సంబంధించి వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాసిన లేఖ రాజకీయ మరియు కుటుంబ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. గత ఏడేళ్లుగా ఇరు కుటుంబాల మధ్యే కాకుండా వ్యక్తిగతంగా అనేక పరిణామాలు చోటుచేసుకున్నప్పటికీ, అంజలి జీవితాంతం సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు జగన్ ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే, బెంగళూరులోని తన నివాస ప్రాంగణంలోనే ఈ వివాహం నిర్వహించాలని షర్మిల భావిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని, తీవ్రమైన భద్రతా కారణాల రీత్యా అక్కడ పెళ్లి నిర్వహించడం సాధ్యం కాదని ఆయన తేల్చిచెప్పారు.
తన నివాసంలో వివాహ వేడుక నిర్వహించడం వల్ల తలెత్తే ఇబ్బందులను జగన్ ఆ లేఖలో పూసగుచ్చినట్లు వివరించారు. పెళ్లి అంటే కేవలం కుటుంబ సభ్యులే కాకుండా పెద్ద సంఖ్యలో అతిథులు, క్యాటరింగ్ సిబ్బంది, డెకరేషన్, ఈవెంట్ మేనేజ్‌మెంట్ నిపుణులు, ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు ఇలా ఎంతోమంది రాకపోకలు సాగిస్తారని పేర్కొన్నారు. వీరిలో చాలామంది తమకు కనీసం పరిచయం లేని వ్యక్తులు ఉంటారని, ఇంత భారీ జనసంచారం నివాస ప్రాంగణంలోకి రావడం వల్ల తీవ్రమైన భద్రతాపరమైన ముప్పులు తలెత్తుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా తన నివాసానికి, చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు బయటకు వెళ్లడం వ్యక్తిగత గోప్యతకు తీవ్ర భంగం కలిగిస్తుందని తెలిపారు.
అంజలిని తాను చిన్నప్పటి నుంచి ఎంతో ఆప్యాయంగా చూశానని, ఆమెకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నానని జగన్ భావోద్వేగంగా పేర్కొన్నారు. అయినప్పటికీ, భద్రతకు సంబంధించిన అంశాలను ఏమాత్రం విస్మరించలేమని స్పష్టం చేశారు. ఒకవేళ తన సొంత పిల్లలు హర్ష లేదా వర్ష పెళ్లి అయినా తాను ఇదే నిర్ణయం తీసుకునేవాడినని తెలిపారు. ప్రస్తుతం తాను అదే నివాసంలో ఉంటున్నందున, ఇలాంటి పెద్ద కార్యక్రమం నిర్వహించడం వల్ల అనవసరంగా అందరి దృష్టి ఆ నివాసంపై పడుతుందని, తాను మరియు తన కుటుంబం సురక్షితంగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని పేర్కొన్నారు.
బెంగళూరు నివాసానికి బదులుగా వివాహం కోసం మరో ప్రత్యామ్నాయ వేదికను ఎంచుకోవాలని షర్మిలకు ఆయన సూచించారు. రాజా పెళ్లికి చేసినట్లుగా ఏదైనా కన్వెన్షన్ సెంటర్ లేదా డెస్టినేషన్ వెడ్డింగ్ వేదికలో వేడుకను నిర్వహించుకోవచ్చని సలహా ఇచ్చారు. ఒకవేళ అలాంటివి ఇష్టం లేకపోతే హైదరాబాద్‌లోని తన ‘లోటస్ పాండ్’ ఆస్తిని పెళ్లి వేదికగా ఉపయోగించుకోవడానికి అనుమతినిస్తానని, గతంలో ఇచ్చిన ప్రతిపాదన ఇప్పటికీ అలాగే ఉందని లేఖలో వెల్లడించారు.








