Mahaa Daily Exclusive

  గచ్చిబౌలిలో 3.5 ఎకరాల్లో లెదర్ కామన్ ఫెసిలిటీ సెంటర్.

Share

  •  రుక్మాపూర్‌లో పర్యావరణహిత చర్మశుద్ధి కర్మాగారాలు.
  •  జమ్మికుంట, ఆర్మూర్‌లో ప్లగ్‌ అండ్‌ ప్లే ఫ్యాక్టరీల ఏర్పాటు.
  •  మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన.

హైదరాబాద్, మహా.

తెలంగాణలో లెదర్ పరిశ్రమ అభివృద్ధికి, యువతకు ఉపాధి కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. శనివారం జరిగిన టీజీఎల్ఐపీసీ సమీక్షా సమావేశంలో లెదర్ పరిశ్రమ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో 3.5 ఎకరాల విస్తీర్ణంలో ‘లెదర్ కామన్ ఫెసిలిటీ సెంటర్’ ను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి కీలక ప్రకటన చేశారు. డిజైనింగ్ నుంచి బ్రాండింగ్ వరకు స్థానిక ఆర్టిజన్లకు పూర్తిగా మార్గనిర్దేశం చేయడంతో పాటు, లెదర్ ఉత్పత్తులకు తగిన వాల్యూ అడిషన్ చేసి మార్కెటింగ్‌కు పూర్తి సహకారం అందిస్తున్నామని వెల్లడించారు.

ఎస్సీ యువతను విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఇందులో భాగంగా రుక్మాపూర్‌లో అత్యాధునిక పర్యావరణహిత చర్మశుద్ధి కర్మాగారాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పరిశ్రమల ద్వారా సుమారు 1,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుందని వివరించారు.

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పారిశ్రామిక రంగాన్ని, చేతివృత్తులను ప్రోత్సహించేందుకు చర్యలు వేగవంతం చేసినట్లు మంత్రి తెలిపారు. జమ్మికుంట, ఆర్మూర్‌లలో ‘ప్లగ్‌ అండ్‌ ప్లే ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌లను’ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. గతంలో లిడ్ క్యాప్ సంస్థకు కేటాయించిన భూములపై క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన జరిపి వెంటనే నివేదిక అందజేయాలని అధికారులను మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు.