ఒడిశా గ్రీన్ సిగ్నల్!
* యాదాద్రికి బొగ్గు కష్టాల నుంచి ఊరట.
* రవాణా సమయం పెంపుతో మార్గం సుగమం.
* విద్యుత్ ఉత్పత్తిపై ఆశలు.
హైదరాబాద్, మహా.
తెలంగాణ విద్యుత్ రంగానికి అత్యంత ప్రతిష్టాత్మకమైన యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి బొగ్గు సరఫరా దిశగా కీలక అడుగు పడింది. ఒడిశాలోని అంగుల్ జిల్లా యంత్రాంగం రవాణా నిబంధనలను సడలించడంతో సింగరేణి ఆధ్వర్యంలోని నైనీ బొగ్గు గని నుంచి బొగ్గు తరలింపునకు మార్గం సుగమమైంది.
గతంలో నాలుగు గంటలుగా ఉన్న రవాణా సమయాన్ని ఆరు గంటలకు పెంచేందుకు అంగుల్ జిల్లా యంత్రాంగం అంగీకరించినట్లు సమాచారం. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు రవాణాకు అవకాశం కల్పించడం ద్వారా సింగరేణి నైనీ గని నుంచి రైల్వే సైడింగ్‌కు బొగ్గు తరలింపు వేగవంతం కానుంది. అయితే, ఈ నిర్ణయానికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది.
ఒడిశాలోని అంగుల్ జిల్లా పరిధిలో ఉన్న నైనీ బొగ్గు గనిని సింగరేణి కాలరీస్ సంస్థ నిర్వహిస్తోంది. దీని వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 10 మిలియన్ టన్నులు కాగా, 2025 జూలైలో ఉత్పత్తి ప్రారంభమైన ఈ గనిలో అదే ఏడాది డిసెంబర్ నాటికి సుమారు 80 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నమోదైంది. అయితే గనిలో బొగ్గు పుష్కలంగా ఉన్నప్పటికీ, ప్రత్యేక రవాణా మార్గం పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడం వల్ల భారీ వాహనాలు గ్రామీణ రహదారుల గుండా వెళ్లాల్సి వస్తోంది. దీనివల్ల స్థానికుల అభ్యంతరాలు, కాలుష్యం, రోడ్లు దెబ్బతినే సమస్యలు ప్రధాన అవరోధాలుగా మారుతున్నాయి.
ఈ నేపథ్యంలో యాదాద్రి కేంద్రానికి నైనీ గని నుంచి రోజుకు 16 వేల టన్నుల బొగ్గు తరలించేలా తెలంగాణ జెన్కో, సింగరేణి అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. గత నెలల్లో సింగరేణి సీఎండీ బుద్ధప్రకాశ్ జ్యోతి, జెన్కో సీఎండీ ఎస్. హరీశ్ తదితరులు నైనీ గనిని సందర్శించి రవాణా సమస్యలు, రైల్వే వ్యాగన్ల లభ్యతపై ఉన్నత స్థాయి సమీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు రోజుకు 75,500 టన్నుల బొగ్గు సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఒక్క యాదాద్రికి మాత్రమే పూర్తి స్థాయిలో రోజుకు 34 వేల టన్నుల బొగ్గు అవసరమని అంచనా వేశారు.
నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద నిర్మించిన యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం ఐదు యూనిట్లతో మొత్తం 4,000 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం కలిగి ఉంది. ఇటీవల ఐదో యూనిట్‌ను గ్రిడ్‌తో అనుసంధానించగా, ఒడిశా నుంచి ఏటా 50 లక్షల టన్నుల బొగ్గు సరఫరా చేసేందుకు కోల్ ఇండియా సూత్రప్రాయంగా అంగీకరించింది. అయితే తాజా రవాణా సమయాల పెంపు నిర్ణయం ఆశాజనకంగా ఉన్నప్పటికీ, భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే అంగుల్ ప్రాంత బొగ్గు గనులను కలుపుతూ ప్రత్యేక రైల్వే కారిడార్‌ను అందుబాటులోకి తేవడం ఒక్కటే శాశ్వత పరిష్కారమని నిపుణులు భావిస్తున్నారు. అనుమతుల పూర్తి స్థాయి అమలు, రవాణా వాహనాల పెంపు, రైల్వే వ్యాగన్ల లభ్యత సక్రమంగా జరిగితేనే యాదాద్రి పూర్తి స్థాయి సామర్థ్యంతో పరుగులు తీయనుంది.








