Mahaa Daily Exclusive

  కాంగ్రెస్ కావాలనే కరువును సృష్టిస్తోంది: హరీశ్‌రావు

Share

కాంగ్రెస్ కావాలనే కరువును సృష్టిస్తోంది: హరీశ్‌రావు
* దేవాదుల, కల్వకుర్తిపై శ్వేతపత్రం విడుదల చేయాలి
హైదరాబాద్, మహా.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే కరువును సృష్టిస్తోందని, రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ప్రాజెక్టుల ద్వారా నీటిని ఎత్తకుండా రైతాంగాన్ని ఇబ్బంది పెడుతున్నారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ఎల్‌పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. డైవర్షన్ పాలిటిక్స్ చేయడమే కాంగ్రెస్‌కు అలవాటుగా మారిందని విమర్శించారు.
గోదావరి, కృష్ణా నదుల్లో నీరు పుష్కలంగా అందుబాటులో ఉన్నప్పటికీ దేవాదుల, కల్వకుర్తి ప్రాజెక్టుల మోటార్లను నడిపించి రిజర్వాయర్లను నింపడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని హరీశ్‌రావు ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు పట్టిసీమ మోటార్ల ద్వారా నీటిని ఎత్తుతుంటే, తెలంగాణలో దేవాదుల నుంచి ఎందుకు నీళ్లు ఎత్తలేదని ప్రశ్నించారు. దేవాదుల మోటార్లు సక్రమంగా నడిపి ఉంటే వరంగల్, కరీంనగర్ జిల్లాలు సస్యశ్యామలం అయ్యేవని స్పష్టం చేశారు. కల్వకుర్తిలోనూ పూర్తిస్థాయిలో మోటార్లు నడపకుండా కేవలం రెండు మోటార్లతో కాలయాపన చేస్తూ ప్రజలను భయపెడుతున్నారని మండిపడ్డారు. దేవాదుల, కల్వకుర్తి ప్రాజెక్టుల్లో మోటార్లు ఎన్ని రోజులు నడిచాయి, ఎంత నీటిని లిఫ్ట్ చేశారనే దానిపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్‌కు మంచి పేరు వస్తుందనే దుర్బుద్ధితోనే కాళేశ్వరం ప్రాజెక్టును మూడేళ్లుగా పడావు పెట్టారని, మేడిగడ్డకు మరమ్మతులు చేయకుండా రాజకీయ కుట్రలకు పాల్పడుతున్నారని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నీళ్లు ఎత్తడం రాష్ట్రం నిర్ణయమేనని ఎన్డీఎస్ఏ స్పష్టం చేసిందని, అన్నారం, సుందిళ్ల బేషుగ్గా ఉన్నాయని సీడబ్ల్యూపీఆర్ఎస్ రిపోర్టు ఇచ్చినా ప్రభుత్వం కావాలనే కాలయాపన చేస్తోందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు నిజమైన వరప్రదాయిని అని, కరువును తరిమి కొట్టే శక్తి దానికి ఉందని ఉద్ఘాటించారు. తమ్మిడిహట్టి ద్వారా నీరు తెస్తామంటున్న ప్రభుత్వ తీరుపై స్పందిస్తూ, గ్రావిటీ ద్వారా నీళ్లు తెస్తామంటున్న మంత్రులు దీనిపై బహిరంగ చర్చకు సిద్ధం కావాలని సవాలు విసిరారు. అవసరమైతే తాను రాజీనామా చేస్తానని, మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి దమ్ముంటే రాజీనామా చేసి దీన్ని నిరూపించాలని సవాలు విసిరారు.
తమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యతపై సీడబ్ల్యూసీ గతంలోనే స్పష్టమైన లేఖలు ఇచ్చిందని హరీశ్‌రావు గుర్తుచేశారు. 2015 ఫిబ్రవరి, మార్చి నెలల్లో సీడబ్ల్యూసీ మరియు కేంద్ర మంత్రి ఉమాభారతి రాసిన లేఖల ప్రకారం తమ్మిడిహట్టి వద్ద 160 టీఎంసీలు కాక కనీసం 102 టీఎంసీలు కూడా అందుబాటులో లేవని, ప్రత్యామ్నాయం చూసుకోవాలని స్పష్టంగా పేర్కొన్నాయని తెలిపారు. కేసీఆర్ ఆదేశాల మేరకు తాము అధికారంలోకి వచ్చిన తొలి ఆరు నెలల్లోనే మహారాష్ట్ర ప్రభుత్వంతో ఆరడజను సార్లు చర్చలు జరిపామని, కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి మీటింగ్‌కు వెళ్లడానికే 1054 రోజులు పట్టిందని ఎద్దేవా చేశారు. గోబెల్స్ ప్రచారంతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తే బీఆర్ఎస్ ఊరుకోదని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను, చేతకానితనాన్ని ఎండగడుతూనే ఉంటామని హరీశ్‌రావు హెచ్చరించారు.