Mahaa Daily Exclusive

  పేదల ఆరోగ్యానికి పల్లా భరోసా….

Share

  • పేదల ఆరోగ్యానికి పల్లా భరోసా.
  • నీలిమ ఆస్పత్రిలో రోగులను పరామర్శించిన జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి!
  •  ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నియోజకవర్గ ప్రజల ఆరోగ్య పరిస్థితిపై ఆరా.
  • పార్టీలకు అతీతంగా సేవలే లక్ష్యమని స్పష్టీకరణ.

ఘట్కేసర్, మహా.

ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం.. జనగామ నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి నిరంతరం శ్రమిస్తున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన నాటి నుంచి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న నియోజకవర్గ ప్రజలను ఎప్పటికప్పుడు పరామర్శిస్తూ వారికి అండగా నిలుస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం ఘట్కేసర్‌లోని నీలిమ ఆస్పత్రిని ఆయన సందర్శించారు. అక్కడ చికిత్స పొందుతున్న జనగామ నియోజకవర్గ ప్రజలను కలిసి, వారి ఆరోగ్య పరిస్థితిని ఆప్యాయంగా అడిగి తెలుసుకున్నారు.
ఆస్పత్రి వార్డుల్లో చికిత్స పొందుతున్న ప్రతి రోగి దగ్గరికీ స్వయంగా వెళ్లిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి.. ‘ఆరోగ్యం ఎలా ఉంది? వైద్యం సక్రమంగా అందుతోందా? ఆస్పత్రిలో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా?’ అంటూ ఆప్యాయంగా పలకరించారు. వారికి ఎలాంటి ఆందోళన వద్దు అని చెప్పి ధైర్యం కల్పించారు. అనంతరం ఆస్పత్రి వైద్యులతో ప్రత్యేకంగా మాట్లాడి, రోగులకు అందిస్తున్న చికిత్స, హెల్త్ బులెటిన్ మరియు వైద్య సేవల పురోగతిపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. రోగులకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా అత్యవసర మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఈ సందర్భంగా సూచించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో తాను ఇచ్చిన హామీ మేరకు జనగామ నియోజకవర్గ ప్రజలకు నీలిమ ఆస్పత్రి ద్వారా నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కేవలం ఆధార్ కార్డు ఉంటే చాలు, ఆస్పత్రిలో అర్హులైన వారు చికిత్స పొందవచ్చని వెల్లడించారు. రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా నియోజకవర్గ ప్రజలందరికీ వైద్య సేవలు అందించేందుకు తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. ప్రజల ప్రాణాలను కాపాడటమే, వారి ఆరోగ్య పరిరక్షణే తన అత్యున్నత ప్రాధాన్యమని పల్లా రాజేశ్వర్ రెడ్డి పునరుద్ఘాటించారు.