Mahaa Daily Exclusive

  ఆరుట్ల బుగ్గరామలింగేశ్వరస్వామి జాతర ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష….

Share

  • ఆరుట్ల బుగ్గరామలింగేశ్వరస్వామి జాతర ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష…
  • ఆధ్యాత్మిక స్వాగతం పలికేలా బుగ్గజాతర ఏర్పాట్లు చేయాలి…
  • పారిశుద్ధ్యం, నీటిసౌకర్యం, విద్యుత్‌, రోడ్లు, రవాణా, భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలి..

ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్‌రెడ్డి రంగారెడ్డి…

ఇబ్బందులు లేకుండా శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని నిర్దేశం..

ఏర్పాట్లకు రూ.కోటి మంజూరు చేయాలని కలెక్టర్‌తో ఫోన్‌లో సంప్రదింపులు…

 

ఇబ్రహీంపట్నం అక్టోబర్ 27 మహా:

కార్తీక మాసంలో ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలిచే ఆరుట్ల శ్రీ బుగ్గ రామలింగేశ్వరస్వామి జాతరను భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేయాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఇబ్రహీంపట్నం మండల పరిషత్‌ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. జాతర పరిసరాల్లోనే కాకుండా పరిసర గ్రామాల్లోనూ పారిశుద్ధ్యం, నీటిసౌకర్యం, విద్యుత్‌, రోడ్లు, భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంటుందని అధికారులకు ఎమ్మెల్యే దిశానిర్దేశం చేశారు.

 

▫️ జిల్లా నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి 15రోజుల పాటు లక్షలాదిగా భక్తులు తరలివస్తారని… ఇందుకోసం ఎక్కడా ఇబ్బందులు తలెత్తనీయవద్దని చెప్పారు. ప్రధానంగా నీటిసౌకర్యం విషయంలో అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఎన్సీతో ఫోన్‌లో మాట్లాడిన ఎమ్మెల్యే…. ఈ మేరకు పలుసూచనలు చేశారు. విద్యుత్‌ సరఫరా పకడ్బందీగా ఉండేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే…. అవసరమైన చోట్ల అదనపు పోల్స్, ట్రాన్స్‌ఫార్మర్లు, వీధిలైట్లు ఏర్పాట్లు చేయాలని చెప్పారు.

 

▫️ భద్రత విషయంలో పోలీస్‌శాఖ ముందస్తు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. అదనపు బలగాలను మోహరించి, జాతర ప్రశాంతంగా పూర్తయ్యేలా పర్యవేక్షించాలని పోలీస్‌ అధికారులకు సూచించారు. మద్యపానం, ఇతర మత్తుపదార్థాలు జాతర పరిసరాల్లో కనిపించకుండా ఎక్సైజ్‌ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు.

 

▫️ బుగ్గజాతరకు వచ్చే మార్గాల్లో అదనపు ఆర్టీసీ బస్సులు నడిపించాలని ఇబ్రహీంపట్నం డిపో మేనేజర్‌కు ఎమ్మెల్యే సూచించారు. ప్రధానంగా ఉచిత ప్రయాణం దృష్ట్యా మహిళల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున… ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పంచాయతీ కార్యదర్శులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించి, పారిశుద్ధ్యం, ఇతర సౌకర్యాల కల్పనకు చర్యలు చేపట్టాలని ఎంపీడీవో, ఎంపీవోలకు ఎమ్మెల్యే సూచనలు చేశారు. గత ఏడాది మాదిరిగానే భక్తులకు ఉచిత ప్రసాదం అందించాలని దేవాదాయశాఖకు తెలిపారు. జాతర ప్రశాంత వాతావరణంలో పూర్తయ్యేలా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, భక్తుల సౌకర్యాల విషయంలో నిర్లక్ష్యానికి తావులేకుండా చూడాలని స్పష్టం చేశారు.

 

▫️ జాతర ఏర్పాట్ల కోసం ముందస్తుగా రూ.కోటి కేటాయించాలని మల్‌రెడ్డి రంగారెడ్డి గారు కలెక్టర్‌ను కోరారు. ఈ మేరకు కలెక్టర్‌ నారాయణరెడ్డి గారితో ఫోన్‌లో సంప్రదించగా… ఆయన సానుకూలంగా స్పందించారు. ఆధ్యాత్మిక వైభవంతో, ప్రశాంతవాతావరణంలో జాతర పూర్తయ్యేలా అధికారులకు భక్తులు సహకరించాలని ఎమ్మెల్యే కోరారు.