- ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కీలక నిర్ణయాలు
- అర్నబ్ తుఫాన్ నష్టంపై ప్రధానంగా చర్చ
- 48 అంశాలకు ఆమోదం
- పలు కంపెనీలకు భూములు కేటాయింపు
అమరావతి, మహా : ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం 48 అంశాలకు కేబినెట్ ఆమోదించింది. ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి మంత్రులు నారా లోకేష్, నాదెండ్ల మనోహర్ నేరుగా హాజరుకాగా.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా మిగిలిన మంత్రులు వర్చువల్‌గా హాజరయ్యారు. అర్నబ్ తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు, బాధితులకు అందుతున్న సహాయక చర్యలపై ప్రధానంగా చర్చించారు.
ఏపీ కేబినెట్ విశాఖపట్నంలో అదానీ డేటా సెంటర్ ప్రాజెక్టు కోసం 5.84 ఎకరాల భూమి కేటాయింపునకు ఆమోదం తెలిపింది. సిలికాన్ క్రిస్టల్, వేఫర్ తయారీ కేంద్రం ఏర్పాటుకు 91.10 ఎకరాల భూమిని కేటాయిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అలాగే ఏపీ క్లీన్ ఎనర్జీ పాలసీ-2024 లో పలు కీలక మార్పులు, సవరణలకు కేబినెట్ ఆమోదించింది. విజయనగరం జిల్లాలో గ్రీన్ స్టీల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుండగా.. ఈ సంస్థకు ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రోత్సాహకాలను ఖరారు చేసింది. అలాగే కర్నూలు జిల్లాలో కొత్తగా విండ్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. కుప్పం బ్రాంచ్ కాలువ పనులకు ఓకే చెప్పారు. 8 ప్రధాన పరిశ్రమలతో పాటు ఇతర అనుబంధ సంస్థలకు ఎర్లీ బర్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద మూలధన రాయితీలను మంజూరుకు కేబినెట్ ఓకే చెప్పింది. ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక గ్యారంటీలను మరింత కాలం పొడిగించింది. అర్నబ్ తుఫాన్ కారణంగా నష్టం, ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలపై చర్చ జరిగింది.
అమరావతిలో సచివాలయ టవర్ల నిర్మాణానికి రూ.1,925 కోట్ల టెండర్లు, అమరావతి క్వాంటమ్ వ్యాలీలో హార్డ్‌వేర్ తయారీ పార్కు, రక్షణ పరిశ్రమల క్లస్టర్లు, కొత్త పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. కృష్ణా జిల్లాలో 50 వేల ఎకరాలకు సాగునీరు అందించే లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు రూ.698.90 కోట్ల ప్రతిపాదనలకు ఓకే చెప్పారు. పరిశీలిస్తున్నారు. విండ్ పవర్, బయోగ్యాస్, సోలార్ హైబ్రిడ్ ప్రాజెక్టులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించారు. థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు కొనుగోలు, రుణ హామీల అంశాలపై చర్చ జరిగింది. కాకినాడలో అమ్యూజ్మెంట్ పార్కు, అనంతపురంలో ఫోర్స్టార్ హోటల్ ఏర్పాటుకు ఓకే చెప్పారు.








