- రేషన్ బియ్యానికి పాలిష్
- కార్పొరేట్ బ్రాండ్ల పేరుతో విక్రయం
- గుట్టురట్టు చేసిన సివిల్ సప్లై అధికారులు
హైదరాబాద్, మహా : హైదరాబాద్లో రేషన్ బియ్యం అక్రమ విక్రయాల వ్యవహారం కలకలం రేపుతోంది. పేదలకు పంపిణీ చేయాల్సిన రేషన్ బియ్యాన్ని కొందరు అక్రమ వ్యాపారులు సేకరించి, పాలిష్ చేసి, కార్పొరేట్ బ్రాండ్ల పేర్లతో బయట మార్కెట్లో విక్రయిస్తున్నారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ వ్యవహారంపై పౌరసరఫరాల శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. రేషన్ బియ్యం అక్రమ దందాపై చర్యలకు దిగిన సివిల్ సప్లయ్స్, విజిలెన్స్ అధికారులు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. ముఖ్యంగా కర్మన్ఘాట్ పరిధిలోని రైస్ డిపోలపై దాడులు నిర్వహిస్తూ బియ్యం నిల్వలు, విక్రయాల తీరును పరిశీలించారు.
పాలిష్ చేసి.. బ్రాండెడ్ బియ్యంగా
రేషన్ బియ్యాన్ని సేకరించి, మిల్లుల్లో పాలిష్ చేయించి, సన్న బియ్యంగా మార్చి, ప్రముఖ కంపెనీల బ్రాండ్ల పేర్లతో మార్కెట్లో విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ బియ్యాన్ని బహిరంగ మార్కెట్లో కిలో రూ.80 నుంచి రూ.100 వరకు విక్రయిస్తున్నట్లు సమాచారం. పేదల కోసం ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం పక్కదారి పడుతున్న తీరుపై అధికారుల తనిఖీలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ అక్రమ వ్యాపారంలో ఎవరెవరి పాత్ర ఉంది? ఎంత మొత్తంలో బియ్యం పక్కదారి పట్టింది? బ్రాండెడ్ ప్యాకింగ్ వెనుక ఉన్న సంస్థలు ఎవరు? అనే అంశాలపై దర్యాప్తుతో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అధికారుల తనిఖీల్లో వెలుగుచూసే వివరాలు, స్వాధీనం చేసుకున్న బియ్యం నిల్వలు, బాధ్యులపై తీసుకునే చ ర్యలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.








