- డీపీఆర్ లేకుండా టెండర్లు ఎలా పిలుస్తారు
- మూసీ సుందరీకరణ ఎందుకు తొందర
- మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్
హైదరాబాద్, మహా : నీళ్లు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, హైదరాబాద్‌లో తాగునీటికి కూడా కష్టంగా ఉంటే మూసీ సుందరీకరణ ఎందుకని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నించారు. మేడిగడ్డకు మరమ్మతులు చేసి వాడుకోకుండా, ఎవరు అడిగారని మూసీ సుందరీకరణ ప్రాజెక్టు చేపట్టారని సీఎం రేవంత్ రెడ్డిని నిలదీశారు. అసలు డీపీఆర్ లేకుండానే ప్రాజెక్టుకు టెండర్లు ఎలా పిలుస్తారని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప రైతుల కష్టాలు పట్టడంలేదని కేటీఆర్ ఆరోపించారు.
మన రాష్ట్రంలో లోటు వర్షపాతం 17 నుంచి 20 శాతం మాత్రమే ఉందిని తాను తెచ్చిన, తాను రుద్దిన కరవుపై సీఎం రేవంత్‌రెడ్డి అవాస్తవాలు చెప్తున్నారని కేటీఆర్ తెలిపారు. తీవ్రమైన కరవులో ఉన్నామని చెప్తూనే మూసీ సుందరీకరణ ఎందుకని ప్రశ్నించారు. మూసీ సుందరీకరణ పేరుతో రూ.1.50 లక్షల కోట్ల లూటీకి సిద్ధమయ్యారని ఆరోపించారు. ప్రజలకు అనుమతి లేకుండా చేసి పబ్లిక్ హియరింగ్ అంటున్నారని అన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో? రాహుల్‌గాంధీకి ఏమైనా తెలుస్తోందా? నిలదీశారు. రేవంత్‌రెడ్డికి రియల్‌ఎస్టేట్ వ్యాపారం తప్ప ఏమీ తెలియదని, రాష్ట్రం ఓవైపు కరవుతో అల్లాడుతుంటే మూసీ సుందరీకరణ చేపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
“తెలంగాణ కంటే తక్కువ వర్షపాతం ఉన్నా ఆంధ్రప్రదేశ్‌లో కరవు లేదు. ఆ రాష్ట్ర సీఎం నారా చంద్రబాబు నాయుడు ముందు చూపుతో నీళ్లు ఎత్తిపోసుకున్నారు. నీళ్లు ఎత్తిపోసుకోవడం వల్లే ఏపీలో కరవు, క్రాప్‌హాలిడే లేవు. ఈ విషయంలో చంద్రబాబును అభినందిస్తున్నా. డీపీఆర్ లేకుండానే రూ.లక్షన్నర కోట్ల ప్రాజెక్టును చేపట్టారు. మూసీ సుందరీకరణ మీద ఉన్న శ్రద్ధ ఇతర అంశాలపై ఎందుకు లేదు. మూడేళ్ల క్రితం కాంగ్రెస్ వాళ్లే పేల్చిన మేడిగడ్డకు మరమ్మతులు చేపట్టలేదు. మేడిగడ్డకు మరమ్మతులు చేసి నీటిని వాడుకునే తెలివి లేదు. ఎవరు అడిగారని మూసీ సుందరీకరణ ప్రాజెక్టును చేపట్టారు” – కేటీఆర్, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు
కన్నెపల్లి నుంచి నీళ్లు ఎత్తిపోయాలని 4 నెలల క్రితం చెప్పామన్న కేటీఆర్ బీఆర్‌ఎస్ మాటలను రేవంత్ రెడ్డి పెడచెవిన పెట్టారని తెలిపారు. నీళ్లు ఎత్తిపోయకుండా 750 టీఎంసీలు కిందకు వదిలేశారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి వదిలిన నీళ్లను చంద్రబాబు ఎత్తిపోసుకున్నారని, అందుకే ఆంధ్రాలో కరవు లేదని తెలిపారు. రేవంత్ అహంకారం వల్లనే తెలంగాణలో కరవు వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం నీరు ఉమ్మడి పాలమూరు తప్ప రాష్ట్రమంతా వస్తాయని, రేవంత్‌రెడ్డి కారణంగానే 9 ఉమ్మడి జిల్లాలు ఎండుతున్నాయని విమర్శించారు. కృష్ణానదిలోని 250 టీఎంసీల నీళ్లు రేవంత్ వదిలేశారని, చంద్రబాబు కృష్ణా నీళ్లు కుప్పం వరకూ తీసుకెళ్లారని, రేవంత్ 70 కి.మీ తీసుకెళ్లలేదని, చంద్రబాబు 700 కి.మీ తీసుకెళ్లారని పేర్కొన్నారు.
కొండా సురేఖ వివరణపై
మరోవైపు కేటీఆర్‌పై గతంలో మాజీ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలపై ఆమె వివరణ ఇచ్చారు. కొండా సురేఖ వివరణపై కేటీఆర్ స్పందించారు. కొండా సురేఖ వ్యాఖ్యలు ఇంకా చూడలేదని, చూశాక లీగల్ టీమ్‌తో చర్చిస్తానని తెలిపారు. నిజం నిలకడ మీద తేలుతుందని పెద్దలు ఎప్పుడో చెప్పారని, ఇంకా క్షమాపణలు చెప్పేవాళ్లు చాలా మంది ఉన్నారని పేర్కొన్నారు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ దూది పింజల్లా తేలిపోతాయని స్పష్టం చేశారు.








