Mahaa Daily Exclusive

  గుంటూరులో తీవ్ర కలకలం రేపుతున్న ‘షకీలియత్’ గుంఫు..

Share

  • గుంటూరులో తీవ్ర కలకలం రేపుతున్న ‘షకీలియత్’ గుంఫు
  • విద్యార్థుల విశ్వాసానికే ప్రమాదం

గుంటూరు, మహా : నగరంలోని పాఠశాలలు, కళాశాలల విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని కొందరు వ్యక్తులు ప్రార్థనా మందిరాలు (మసీదులు), టీ కొట్లు, ప్రైవేటు విద్యాసంస్థల సమీపంలో అనుమానాస్పద కార్యకలాపాలు సాగిస్తున్నట్లు మజ్లిస్ ఉలేమా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ముస్లిం యువత, విద్యార్థుల విశ్వాసాన్ని (ఈమాన్) తప్పుదోవ పట్టించేలా ప్రచారం చేస్తున్న ‘షకీల్ బిన్ హనీఫ్’ అనుచరుల వ్యాఖ్యల పట్ల ప్రతి ఒక్కరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఉలేమా పండితులు విజ్ఞప్తి చేశారు.

సామాజిక మాధ్యమాలు, వ్యక్తిగత వేదికల ద్వారా మాయమాటలు

తనను తాను మహదీ, ఈసా (యేసు) అని చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంటున్న షకీల్ బిన్ హనీఫ్‌ను కొందరు ప్రవక్తగా, ఆధ్యాత్మిక మార్గదర్శిగా భావిస్తూ ప్రచారం చేస్తున్నారు. గుంటూరు, నెల్లూరు సహా పలు జిల్లాల్లో ప్రాథమిక ఇస్లాం జ్ఞానం లేని అమాయక విద్యార్థులను ఎంచుకుని, ఖురాన్ మరియు హదీసులకు తప్పుడు వ్యాఖ్యానాలు చెప్తూ ఇస్లామిక్ సిద్ధాంతాలకు విరుద్ధంగా నడుచుకునేలా పురికొల్పుతున్నారు.

ఉలేమా స్పష్టత – ఇస్లాం పరిధికి వెలుపలే

ఈ తరహా ప్రచారాలు, విశ్వాసాలు ఇస్లామిక్ సూత్రాలకు సంపూర్ణంగా విరుద్ధమని భారతదేశంలోని ప్రముఖ ఉలేమాలు (ధర్మకర్తలు) ముక్తకంఠంతో స్పష్టం చేశారు. ఖాదియానిజం, రియాజ్ అహ్మద్ గోహర్ షాహీ, షకీలియత్ వంటి గుంపులు ఇస్లాం విశ్వాస పరిధిలోకి రావని, వీరి మాటలు విని ఇస్లామిక్ మూలసూత్రాలను తిరస్కరిస్తే విశ్వాసాన్ని (ఈమాన్) కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

తల్లిదండ్రులు, బాధ్యతాయుత పౌరులకు పిలుపు

ధనం లేదా ఆరోగ్యం కోల్పోతే తిరిగొస్తుందని, కానీ విశ్వాసాన్ని కోల్పోతే సర్వస్వం కోల్పోయినట్లేనని ధర్మకర్తలు పేర్కొన్నారు. ధర్మం గురించి ఏవైనా సందేహాలు ఉంటే బాధ్యతాయుతమైన పండితులను సంప్రదించాలని, ఇలాంటి తప్పుడు ప్రచారకులకు దూరంగా ఉండాలని కోరారు. ముఖ్యంగా కళాశాల, పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల నడవడికపై దృష్టి సారించి, వారి ఈమాన్‌ను కాపాడుకోవాలని మజ్లిస్ ఉలేమా పిలుపునిచ్చింది.