Mahaa Daily Exclusive

  తెలంగాణ విద్యారంగంలో నవ శకం….

Share

తెలంగాణ విద్యారంగంలో నవ శకం.
* మోడల్ స్కూళ్లు ఇకపై ‘తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు.
* రూ.787 కోట్లతో సర్కారు బృహత్తర ప్రణాళిక.
* ఒకటో తరగతి నుంచే ఆంగ్ల మాధ్యమ విద్య.
* గ్రామీణ విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య.
* రూపురేఖలు మార్చేందుకు సిద్ధమైన విద్యాశాఖ.

హైదరాబాద్, మహా.

తెలంగాణ రాష్ట్ర విద్యావ్యవస్థలో సరికొత్త అధ్యాయం ఆవిష్కృతం కాబోతోంది. గ్రామీణ ప్రాంతాల పేద, మధ్యతరగతి విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన ఆంగ్ల మాధ్యమ విద్యను మరింత చేరువ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక అడుగు వేసింది. ఇప్పటివరకు ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు మాత్రమే పరిమితమైన విద్యాబోధనను సమూలంగా మారుస్తూ, ఒకటో తరగతి నుంచే నాణ్యమైన విద్యను అందించే బృహత్తర ప్రణాళికకు విద్యాశాఖ రూపకల్పన చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మోడల్ స్కూళ్లను ఏకంగా ‘తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు (టీపీఎస్)’గా మార్చి, మౌలిక సదుపాయాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లేలా భారీ నిధులతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది.
విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు
రాష్ట్రవ్యాప్తంగా 2012-13 విద్యా సంవత్సరంలో ఏర్పాటైన 194 మోడల్ స్కూళ్ల రూపురేఖలను పూర్తిగా మార్చేందుకు విద్యాశాఖ రూ.787.54 కోట్ల అంచనా వ్యయంతో సమగ్ర కార్యాచరణను సిద్ధం చేసింది. ఈ నివేదికకు ప్రభుత్వ ఆమోదం లభిస్తే 2027-28 విద్యా సంవత్సరం నుంచి ఈ కొత్త విధానం రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి వస్తుంది. ప్రాథమిక స్థాయి నుంచే ఇంగ్లీష్ మీడియం చదువులను ప్రభుత్వ బడుల్లో ఉచితంగా అందించాలన్న లక్ష్యంతో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు కొత్తగా తరగతులను ప్రవేశపెట్టనున్నారు. పూర్తిగా ఆంగ్ల మాధ్యమంలోనే బోధన సాగడం ఈ పాఠశాలల ప్రత్యేకత కావడంతో, తాజా నిర్ణయం వల్ల గ్రామీణ విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య ఉచితంగా అందుబాటులోకి రానుంది.
ప్రాథమిక తరగతులకు భారీగా నిధుల కేటాయింపు
కొత్తగా ప్రాథమిక తరగతులను ప్రారంభించనున్న నేపథ్యంలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిచ్చింది. ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టేందుకు ప్రతి పాఠశాలలో అదనంగా ప్రతి తరగతికి రెండు చొప్పున కొత్త గదులు నిర్మించాల్సి ఉంటుంది. ఇందుకు ఒక్కో పాఠశాలకు రూ.3 కోట్ల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా మొత్తం రూ.582 కోట్లు ఖర్చవుతాయని విద్యాశాఖ అంచనా వేసింది. ఈ భారీ ప్రాజెక్టు కోసం ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ) నుంచి నిధులను సమీకరించనున్నారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయంలో 70 శాతం నిధులను ఏఐఐబీ రుణంగా తీసుకోనుండగా, మిగిలిన 30 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా సమకూర్చనుంది. దీనికితోడు కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద వచ్చే నిధులను కూడా సమర్థవంతంగా వినియోగించుకునేలా విద్యాశాఖ ప్రత్యేకంగా ఒక పబ్లిక్ ట్రస్ట్‌ను సైతం ఏర్పాటు చేసింది.
అసంపూర్తి నిర్మాణాల పూర్తికి పటిష్ట చర్యలు
కొత్త గదుల నిర్మాణంతో పాటు గతంలో పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయడానికి ప్రణాళికలో స్పష్టమైన రూపకల్పన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 105 మోడల్ స్కూళ్లలో భవన నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయని, మరమ్మతులు అవసరమని విద్యాశాఖ గుర్తించింది. వీటిలో 38 చోట్ల పాక్షికంగా పనులు జరగ్గా, మరో 67 చోట్ల ఇంకా పనులు ప్రారంభం కావాల్సి ఉంది. ఈ భవన నిర్మాణాలను పూర్తి చేయడంతో పాటు విద్యార్థుల భద్రత కోసం ప్రహరీ గోడల నిర్మాణం, విశాలమైన క్రీడా మైదానాలు, బాస్కెట్‌బాల్ కోర్టుల ఏర్పాటు, పాఠశాల ప్రాంగణాల సుందరీకరణ తదితర పనుల కోసం ప్రత్యేకంగా రూ.205.54 కోట్లను కేటాయించారు. పటిష్టమైన మౌలిక వసతులు ఉంటేనే మెరుగైన విద్యా వాతావరణం నెలకొంటుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిధులను ప్రతిపాదించింది.
అదనంగా అందుబాటులోకి రానున్న 58 వేల సీట్లు
ప్రస్తుతం ఒక్కో మోడల్ స్కూల్‌లో ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు 820 సీట్ల చొప్పున మొత్తం 1,59,000 సీట్లు అందుబాటులో ఉండగా, వీటిలో సుమారు 1,10,000 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. సరైన రవాణా సదుపాయాలు లేకపోవడం వల్లే అడ్మిషన్లు ఆశించిన స్థాయిలో లేవని విద్యాశాఖ గుర్తించింది. ఈ సమస్యను అధిగమించడానికి మోడల్ స్కూళ్లను టీపీఎస్‌గా మార్చి ప్రత్యేక రవాణా సౌకర్యాలను కల్పించనున్నారు. ఇక కొత్తగా ప్రాథమిక తరగతులను ప్రవేశపెట్టడం ద్వారా ప్రతి తరగతికి 60 మంది విద్యార్థుల చొప్పున ఒక్కో పాఠశాలలో అదనంగా 300 మంది చిన్నారులకు ప్రవేశం లభిస్తుంది. దీనివల్ల 194 పాఠశాలల్లో కలిపి ఏకంగా 58,200 అదనపు సీట్లు అందుబాటులోకి వస్తాయి. రవాణా సదుపాయం, ఉచిత ఆంగ్ల మాధ్యమ విద్య తోడవడంతో ఈ ప్రతిపాదనలకు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి విశేష స్పందన లభిస్తుందని విద్యాశాఖ అధికారులు దృఢవిశ్వాసంతో ఉన్నారు.