Mahaa Daily Exclusive

  దిల్లీలో రాజేసుకున్న రాజకీయ వేడి….

Share

దిల్లీలో రాజేసుకున్న రాజకీయ వేడి.
* ఇండి కూటమి మార్చ్‌కు పోలీసుల బ్రేక్.
ఢిల్లీ, మహా.
నవంబర్ 1వ తేదీన దేశ రాజధాని దిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఇండి కూటమి తలపెట్టిన భారీ ర్యాలీ చుట్టూ తీవ్ర రాజకీయ ఉత్కంఠ నెలకొంది. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు మింటో రోడ్ – కన్నాట్ ప్లేస్ జంక్షన్ నుంచి ప్రారంభం కానున్న ఈ మార్చ్‌లో ప్రజలు, యువత, వివిధ రాజకీయ పక్షాలు భారీ సంఖ్యలో పాల్గొనాలని లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఎన్నికల కమిషన్ సంయుక్తంగా భారత ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తున్న తీరుకు నిరసనగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆయన ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. అయితే ఈ ర్యాలీకి ప్రజలు రాకుండా అమిత్ షా అడ్డుకుంటున్నారని రాహుల్ ఆరోపించారు.
మరోవైపు ఈ ర్యాలీకి అనుమతి లేదని దిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. కన్నాట్ ప్లేస్ నుంచి మార్చ్ ప్రారంభించేందుకు తమకు ఎలాంటి ముందస్తు దరఖాస్తు అందలేదని పేర్కొన్నారు. అయితే ప్రజాప్రతినిధులు తమ సొంత వాహనాల్లో కాన్స్టిట్యూషన్ క్లబ్‌కు లేదా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసానికి వెళ్లడానికి ఎలాంటి అభ్యంతరం లేదని వెల్లడించారు. జంతర్ మంతర్ వద్ద ఎలాంటి నిరసనలకు అనుమతి లేదని ముందే ప్రకటించిన పోలీసులు, తాజా పరిణామాల నేపథ్యంలో రామ్‌లీలా మైదానం వద్ద అదనపు పారామిలిటరీ బలగాలతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. సెంట్రల్ దిల్లీ పరిధిలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాజ్‌ఘాట్, దిల్లీ గేట్, ఐటీవో తదితర కీలక కూడళ్లలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
ఎన్ని అడ్డంకులు ఎదురైనా దిల్లీ చరిత్రలోనే నిలిచిపోయేలా ఈ ర్యాలీని విజయవంతం చేస్తామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ధీమా వ్యక్తం చేశారు. దేశ నలుమూలల నుంచి ప్రజలు తరలివస్తున్నారని ఆయన వెల్లడించారు. ఇదే క్రమంలో వంద మందికి పైగా ఎంపీలు సంతకాలు చేసిన ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌పై అభిశంసన తీర్మానం నోటీసును తిరస్కరించడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగా, వర్షం కారణంగా శుక్రవారం వాయిదా పడిన సీఈసీ అభిశంసన కార్యక్రమాన్ని శనివారం మధ్యాహ్నం 3:30 గంటలకు మల్లికార్జున ఖర్గే నివాసంలో నిర్వహించేందుకు ఇండియా కూటమి నేతలు సన్నద్ధమయ్యారు.