Mahaa Daily Exclusive

  సొంత గడ్డపై సీఎం రేవంత్ మార్క్.

Share

  •  కొడంగల్‌కు ఏకంగా రూ.9 వేల కోట్ల వరాలు!

హైదరాబాద్, మహా.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్‌ను అభివృద్ధిలో పరుగులు పెట్టించేందుకు పక్కా ప్లాన్‌తో రెడీ అయ్యారు. నవంబర్ 7, 8, 9 తేదీల్లో ఏకంగా మూడు రోజుల పాటు ఆయన అక్కడే సుడిగాలి పర్యటన చేయనున్నారు. ఈ టూర్‌లో ఏకంగా రూ.9,053 కోట్ల వ్యయంతో చేపట్టే 13 భారీ ప్రాజెక్టులకు ఆయన పునాది రాళ్లు వేయబోతున్నారు. దీంతో పాటు రూ.46 కోట్లతో రెడీ అయిన మరో 10 ప్రభుత్వ భవనాలను కూడా ఆయన చేతుల మీదుగా ప్రారంభించనున్నారు.

పర్యటన తొలి రోజైన నవంబర్ 7న హకీంపేటలో మెగా రైతుమేళాతో పాటు ఇండస్ట్రియల్ ఎక్స్‌పోను సీఎం ప్రారంభిస్తారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఆదర్శ రైతులు, పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి మాట్లాడి వాళ్ల సలహాలు, సమస్యలు తెలుసుకుంటారు.

రెండో రోజు నవంబర్ 8న డవాక్రా (స్వయం సహాయక సంఘాల) మహిళలతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా మీటింగ్ కానున్నారు. అదే రోజున వేల కోట్ల పనులకు పచ్చజెండా ఊపుతారు. లగచర్ల ఇండస్ట్రియల్ కారిడార్‌లో రూ.81 కోట్లతో పామాయిల్ ఫ్యాక్టరీకి, రూ.5,060 కోట్లతో కొత్వాల్‌గూడ-నాచారం రేడియల్ రోడ్డుకి, రూ.2,100 కోట్లతో ఎంఎన్‌కేఎల్‌ఐఎస్ సెకండ్ ఫేజ్ పనులకు శంకుస్థాపన చేస్తారు. అంతేకాదు, రూ.1,410 కోట్లతో ఏకంగా 223 బీటీ రోడ్లు, రూ.123 కోట్లతో వ్యవసాయ కాలేజీ, రూ.118 కోట్లతో 10 తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల నిర్మాణానికి శ్రీకారం చుడతారు. ఇక కొడంగల్, కోస్గి, మద్దూరులో హైటెక్ బస్టాండ్లకు కూడా పునాది రాయి వేస్తారు.

పర్యటన చివరి రోజైన నవంబర్ 9న హకీంపేటలో భారీ బహిరంగ సభను ప్లాన్ చేశారు. ఏకంగా 10 జిల్లాల నుంచి సుమారు 50 వేల మంది రైతులు హాజరయ్యేలా అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తంగా చూస్తే తన మూడు రోజుల టూర్‌లో వ్యవసాయం, పరిశ్రమలు, మహిళా సాధికారత, మౌలిక సదుపాయాలపై సీఎం రేవంత్ స్పెషల్ ఫోకస్ పెట్టారు.