Mahaa Daily Exclusive

  యూజీసీ ‘ఈక్విటీ’ నిబంధనలపై కేంద్రం వెనక్కి.

Share

  •  సుప్రీం ఆదేశాలతో ప్రత్యేక కమిటీకి స్కెచ్.
  •  తాత్కాలికంగా 2012 రూల్స్ అమలు.

ఢిల్లీ, మహా.

ఉన్నత విద్యాసంస్థల్లో కుల వివక్షను సమూలంగా పారదోలేందుకు విశ్వవిద్యాలయాల మంజూరు సంఘం తీసుకొచ్చిన 2026 ఈక్విటీ (సమానత్వ) నిబంధనలపై కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు పునరాలోచనలో పడింది. ఈ నిబంధనల అమలుపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఇప్పటికే బ్రేకులు వేయడంతో, అందులోని వివాదాస్పద అంశాలను జల్లెడ పట్టేందుకు ఓ స్పెషల్ కమిటీని రంగంలోకి దించాలని కేంద్రం భావిస్తోంది. విద్యార్థులందరి ప్రయోజనాలను సమానంగా కాపాడేలా, ఎవరికీ అన్యాయం జరగకుండా నిబంధనలు ఉండాలన్న సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాల నేపథ్యంలో ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేస్తోంది.

నవంబర్ 5న సుప్రీంకోర్టులో జరిగిన విచారణ ఈ పరిణామానికి వేదికైంది. కేంద్రం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. ప్రత్యేక కమిటీ ఏర్పాటుపై ప్రభుత్వ కసరత్తును ధర్మాసనానికి వివరించారు. కొత్త నిబంధనల వల్ల ఏ ఒక్క విద్యార్థి వర్గం కూడా తాము వివక్షకు గురవుతున్నామన్న ఆందోళనకు గురికాకుండా చూడాలని ప్రభుత్వం యోచిస్తోందని, ఇందుకోసం విద్యావేత్తలు, సంబంధిత నిపుణులతో ఓ కమిటీని ఏర్పాటు చేసి నిబంధనలను మరోసారి ఆసాంతం సమీక్షిస్తామని కోర్టుకు తెలిపారు.

అసలు వివాదం ఎక్కడ మొదలైందంటే.. 2026 జనవరి 13న యూజీసీ నోటిఫై చేసిన కొత్త నిబంధనల్లోని భాషపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా కుల ఆధారిత వివక్షను నిర్వచించే భాష అస్పష్టంగా ఉందని, ఇది దుర్వినియోగానికి దారితీసే ప్రమాదం ఉందని సుప్రీంకోర్టు ప్రాథమికంగా అభిప్రాయపడింది. ఈ కుల ఆధారిత వివక్ష నిర్వచనం నిర్దిష్ట సామాజిక వర్గాలకే ప్రత్యేక రక్షణ కల్పించేలా ఉందని కొందరు పిటిషనర్లు గట్టిగా వాదించారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ ధర్మాసనం జనవరి 29న ఈ 2026 నిబంధనలపై స్టే విధించింది. వాటి చట్టబద్ధత తేలేవరకు పాత 2012 నిబంధనలనే పక్కాగా అమలు చేయాలని ఆదేశించింది. నిబంధనలపై స్టే ఉన్నంత మాత్రాన విద్యాసంస్థల్లో వివక్షను అరికట్టే రక్షణ వ్యవస్థ ఆగిపోలేదని, 2012 రూల్స్ ప్రకారం కఠిన చర్యలు కొనసాగాలని కోర్టు స్పష్టం చేసింది. ఇక ఇప్పుడు అందరి దృష్టీ కేంద్రం ఏర్పాటు చేయబోయే ప్రత్యేక కమిటీపైనే పడింది. ఆ కమిటీ విధివిధానాలు, సభ్యుల ఎంపిక, నివేదిక తర్వాత యూజీసీ నిబంధనల్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయన్నది విద్యావర్గాల్లో తీవ్ర ఆసక్తి రేపుతోంది.