- రాహుల్ గాంధీకి సీఏఐటీ ఘాటు లేఖ.
- ఢిల్లీలో ర్యాలీల దెబ్బకు కుదేలవుతున్న వ్యాపారాలు.
ఢిల్లీ, మహా.
దేశ రాజధాని ఢిల్లీ రోడ్లపై నిత్యం సాగుతున్న రాజకీయ రణరంగం సామాన్య వ్యాపారుల ఉసురు పోసుకుంటోంది. పండగలు, పెళ్లిళ్ల సీజన్లో జోరుగా సాగాల్సిన వ్యాపారాలు ధర్నాలు, ర్యాలీల దెబ్బకు కుదేలవుతున్నాయి. వీధి వ్యాపారుల నుంచి బడా దుకాణాల వరకు ప్రతి ఒక్కరూ తీవ్ర ఆర్థిక నష్టాలను మూటగట్టుకుంటున్న వేళ.. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ జాతీయ అధ్యక్షుడు బీసీ భారతియా నేరుగా లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ఒక ఘాటు లేఖ సంధించారు. నిరసన తెలిపే హక్కును ఎవరూ కాదనరని, కానీ ఆ హక్కు పేరుతో పేద, మధ్యతరగతి వ్యాపారుల జీవనోపాధిని లాగేసుకోవడం ఎంతవరకు సమంజసమని ఆయన ఆ లేఖలో సూటిగా నిలదీశారు.
ఢిల్లీ ఇప్పుడు రాజకీయ ఆందోళనలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. ఇటీవలే కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ర్యాలీతో పాటు, వివిధ సంఘాలు చేస్తున్న నిరసనలకు హస్తం పార్టీ మద్దతు తెలపడంతో పరిస్థితి మరింత దిగజారిందని వ్యాపార వర్గాలు మండిపడుతున్నాయి. నిత్యం రద్దీగా ఉండే చాందినీ చౌక్, కరోల్ బాగ్, సదర్ బజార్ లాంటి ప్రధాన వాణిజ్య కేంద్రాలకు వెళ్లే దారులన్నీ ట్రాఫిక్ ఆంక్షలు, బారికేడ్లతో బ్లాక్ అవుతున్నాయి. దీంతో మార్కెట్లకు రావాల్సిన కస్టమర్లు సగం దారిలోనే వెనుదిరుగుతుండటంతో వ్యాపారుల గల్లా పెట్టెలు వెలవెలబోతున్నాయి. గిరాకీ లేకపోయినా అద్దెలు, కరెంటు బిల్లులు, సిబ్బంది జీతాలు లాంటి స్థిరమైన నిర్వహణ ఖర్చులు మోయలేక దుకాణదారులు ఆర్థికంగా దివాలా తీసే పరిస్థితికి చేరుకున్నారు.
వ్యాపార రంగానికి అసలైన ప్రాణం పోసే పండగలు, పెళ్లిళ్ల సీజన్ ఇదే కావడంతో వ్యాపారుల ఆందోళన తీవ్రస్థాయికి చేరింది. ఒకవైపు ‘స్థానిక వ్యాపారులను ప్రోత్సహించండి.. లోకల్ మార్కెట్లలోనే కొనండి’ అంటూ రాజకీయ నేతలే పదేపదే ప్రవచనాలు చెబుతుంటారు. కానీ, ఆ మార్కెట్లకు జనం వెళ్లకుండా మీరే ధర్నాలతో రోడ్లు దిగ్బంధిస్తే ఎలాగంటూ రాహుల్ గాంధీకి భారతియా గట్టి చురకలంటించారు. కేవలం మీ రాజకీయ మైలేజీ కోసం రెక్కాడితే గానీ డొక్కాడని చిరు వ్యాపారుల పొట్టకొట్టడం ఏమాత్రం న్యాయం కాదని కుండబద్దలు కొట్టారు. రాజకీయ పార్టీలు తమ కార్యక్రమాలను నిర్వహించుకునే స్వేచ్ఛను గౌరవిస్తూనే, సామాన్యుల బతుకుదెరువుకు ఆటంకం కలగకుండా ప్రత్యామ్నాయ వేదికలను ఎంచుకోవాలని, పోలీసుల సమన్వయంతో సామాన్యుల జీవించే హక్కును సైతం కాపాడాలని కాంగ్రెస్ అధిష్టానానికి సీఏఐటీ తేల్చిచెప్పింది.








