Mahaa Daily Exclusive

  భీమ్‌రెడ్డి కేసులో ఇళ్లు, భూముల అటాచ్‌మెంట్‌

Share

  • లంచంగా ఇచ్చినట్లు ఆరోపణలున్న రెండు ఇళ్లు, ఇన్నోవా కారు స్వాధీనానికి చర్యలు
  • నాలుగు వ్యవసాయ భూములపైనా ఆదాయపు పన్ను శాఖ ఆంక్షలు

హైదరాబాద్‌, మహా : పోలీసు అధికారి సంకిరెడ్డి భీమ్‌రెడ్డి, ఆయన భార్యకు సంబంధించిన బినామీ ఆస్తుల వ్యవహారంలో ఆదాయపు పన్ను శాఖ మరిన్ని ఆస్తులను గుర్తించింది. అధికారికంగా చేసిన మేళ్లకు ప్రతిఫలంగా ఇచ్చినట్లు ఆరోపణలున్న రెండు ఇళ్లు, వివాదాల పరిష్కారంలో సహకరించినందుకు అందించినట్లు భావిస్తున్న ఇన్నోవా కారు సహా పలు ఆస్తులను తాత్కాలికంగా అటాచ్‌ చేసింది. ఆదాయపు పన్ను శాఖలోని బినామీ ఆస్తుల నిరోధక విభాగం (బీపీయూ) నవంబరు 3న మూడు ఉత్తర్వులు జారీ చేసింది.

పటాన్‌చెరు పరిధిలోని ముత్తంగిలో రెండు ఇళ్లు, మొగుడంపల్లిలో 3.20 ఎకరాల విస్తీర్ణంలో నాలుగు వ్యవసాయ భూములు, టయోటా ఇన్నోవా క్రిస్టా కారు ఈ జాబితాలో ఉన్నాయి. రిజిస్ట్రేషన్‌ పత్రాల్లో పేర్కొన్న ధరలు, వాహనం విలువ ప్రకారం వీటి మొత్తం విలువ రూ.59.4 లక్షలు. ప్రస్తుత మార్కెట్‌ ధరల ప్రకారం స్థిరాస్తుల విలువ పలుకోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. హైదరాబాద్‌ బీపీయూ ఈ ఆస్తులపై అటాచ్‌మెంట్‌ ఉత్తర్వులు ఇచ్చింది.

అధికారికంగా చేసిన మేళ్లకు ప్రతిఫలంగా ఇళ్లు

ఆదాయపు పన్ను శాఖ దర్యాప్తు ప్రకారం.. జీపీఆర్‌ హౌసింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ 2023 జులైలో ముత్తంగిలోని బృందావన్‌ గార్డెన్స్‌లో రెండు ఇళ్లను పోతుగంటి ఇంద్రకరణ్‌రెడ్డి పేరుతో బదిలీ చేసింది. ఇందుకు ఎలాంటి డబ్బు తీసుకోలేదు. ఒక్కో ఇల్లు 200 చదరపు గజాల విస్తీర్ణంలో ఉంది. రిజిస్ట్రేషన్‌ పత్రాల్లో ఒక్కోదాని విలువ రూ.14.2 లక్షలుగా పేర్కొన్నారు.

పటాన్‌చెరు సబ్‌డివిజనల్‌ పోలీసు అధికారిగా (ఎస్‌డీపీవో) పనిచేసిన సమయంలో భీమ్‌రెడ్డి చేసిన మేళ్లకు ప్రతిఫలంగానే ఈ ఇళ్లు ఇచ్చారని ఆదాయపు పన్ను శాఖ ఆరోపించింది. సంస్థకు వ్యతిరేకంగా వచ్చిన ఫిర్యాదులపై కేసులు నమోదు చేయకపోవడం, సంస్థకు సంబంధించిన వివాదాల పరిష్కారంలో సహకరించడం వంటి పనులు చేసినట్లు పేర్కొంది.

జీపీఆర్‌ హౌసింగ్‌ డైరెక్టర్‌ జి.కల్యాణ్‌బాబు ఇచ్చిన వాంగ్మూలాన్ని అధికారులు ఈ కేసులో ప్రస్తావించారు. కృతజ్ఞతగా ఆ ఇళ్లను ఇచ్చినట్లు ఆయన చెప్పారని పేర్కొన్నారు. భీమ్‌రెడ్డి సూచన మేరకే ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు తన పేరును ఉపయోగించుకునేందుకు అంగీకరించినట్లు ఇంద్రకరణ్‌రెడ్డి ఒప్పుకొన్నారని తెలిపారు. విద్యుత్తు కనెక్షన్లకు సంబంధించిన రికార్డులను కూడా అధికారులు ఆధారాలుగా తీసుకున్నారు.

హోంగార్డు పేరుతో 3.20 ఎకరాల భూమి

మొగుడంపల్లిలోని నాలుగు వ్యవసాయ భూములను హోంగార్డు లక్ష్మణ్‌ నాయక్‌ పేరుతో రిజిస్ట్రేషన్‌ చేశారు. వీటి విలువను పత్రాల్లో రూ.8.9 లక్షలుగా పేర్కొన్నారు. ఈ భూముల అసలు లబ్ధిదారుల్లో భీమ్‌రెడ్డి ఒకరని ఆదాయపు పన్ను శాఖ గుర్తించింది.

అధికారిక మేళ్లకు ప్రతిఫలంగా ఇన్నోవా

యాపిల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ యజమాని ఆలూరి సురేష్‌ పోలీసు అధికారి భీమ్‌రెడ్డికి టయోటా ఇన్నోవా క్రిస్టా కారును అందించినట్లు బీపీయూ ఆరోపించింది. ప్రమాదాలకు సంబంధించిన వివాదాల్లో సహకరించినందుకు ప్రతిఫలంగా ఈ వాహనాన్ని ఇచ్చినట్లు పేర్కొంది.

అటాచ్‌మెంట్‌ ఉత్తర్వుల్లో కారు విలువను రూ.22 లక్షలుగా చూపారు. 2024 చివరి నుంచి ఈ వాహనాన్ని భీమ్‌రెడ్డి ఒక్కరే వినియోగిస్తున్నట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు.