Mahaa Daily Exclusive

  గాంధీభవన్‌లో హైడ్రామా.

Share

  •  పీసీసీ చీఫ్‌కే హ్యాండిచ్చిన మంత్రి!
  •  దామోదర-తోట ఎపిసోడ్‌లో అనూహ్య ట్విస్ట్!

హైదరాబాద్, మహా.

తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి దామోదర రాజనర్సింహ, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు మధ్య రగులుతున్న వార్‌ ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. ఈ ఇద్దరు నేతల మధ్య నెలకొన్న పంచాయితీని తీర్చేందుకు టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ చేసిన ప్రయత్నం తొలి అడుగులోనే బెడిసికొట్టింది. ఇద్దరు నేతలను గాంధీభవన్‌కు పిలిపించి వేర్వేరుగా క్లాస్ తీసుకోవాలని పీసీసీ బాస్ వేసిన స్కెచ్‌ను మంత్రి దామోదర రివర్స్ చేశారు. ఉదయం మీటింగ్‌కు వస్తానని చెప్పిన మంత్రి, తీరా పీసీసీ చీఫ్ గాంధీభవన్‌కు చేరుకున్నాక డుమ్మా కొట్టడంతో వ్యవహారం రసవత్తరంగా మారింది. దీంతో మంత్రి రాకుండా కేవలం ఎమ్మెల్యేతో మాత్రమే మాట్లాడటం కరెక్ట్ కాదని భావించిన మహేశ్‌కుమార్‌ గౌడ్‌.. కనీసం లక్ష్మీకాంతారావుతో కూడా భేటీ కాకుండానే గాంధీభవన్ నుంచి వెనుదిరగడం పార్టీ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.

అసలు ఈ రచ్చకు బీజం పడింది ఢిల్లీ వేదికగానే! నవంబర్ 1న ఢిల్లీలోని ఓ హోటల్ లాబీలో మంత్రి, ఎమ్మెల్యే మధ్య తీవ్ర స్థాయిలోనే వాగ్వాదం జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి నియామకం, ఇతర కీలక పదవుల పంపకాల విషయంలో రేగిన చిచ్చు.. చినికిచినికి గాలివానలా మారింది. ఆ హోటల్ లాబీలోనే మంత్రి దామోదర తనను బూతులు తిట్టడంతో పాటు తీవ్రంగా బెదిరించారంటూ జుక్కల్ ఎమ్మెల్యే అధిష్టానానికి ఫిర్యాదు చేయడం కాంగ్రెస్ వర్గాల్లో కలకలం రేపింది. అయితే, ఎమ్మెల్యే చేస్తున్న ఈ ఆరోపణలపై మంత్రి వర్గం నుంచి ఇప్పటివరకూ ఎలాంటి కౌంటర్ గానీ, అధికారిక వివరణ గానీ రాకపోవడం గమనార్హం.

ఈ వివాదం పార్టీ పరువు బజారుకీడుస్తుండటంతో రంగంలోకి దిగిన పీసీసీ చీఫ్ ఇద్దరి వాదనలు వినేందుకు పక్కా షెడ్యూల్ ప్లాన్ చేశారు. ఉదయం మంత్రి దామోదరతో, మధ్యాహ్నం ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావుతో విడివిడిగా భేటీ కావాలని డిసైడ్ అయ్యారు. కానీ మంత్రి అనూహ్యంగా గైర్హాజరు కావడంతో ఈ వివాద పరిష్కారానికి భారీ బ్రేక్ పడింది. పీసీసీ చీఫ్ పిలుపునే మంత్రి లైట్ తీసుకోవడంతో, ఈ పంచాయితీపై పార్టీ అధిష్టానం తదుపరి ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందన్నది ఇప్పుడు గాంధీభవన్‌లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఇద్దరు కీలక నేతల మధ్య నడుస్తున్న ఈ ఈగో వార్‌ను పార్టీ పెద్దలు ఎలా డీల్ చేస్తారు? తదుపరి మీటింగ్‌కు మంత్రి హాజరవుతారా లేదా అన్నది ఇప్పుడు అధికార పార్టీలో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.